ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం

ABN , First Publish Date - 2020-07-09T16:39:47+05:30 IST

ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం జరిపారో..

ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం

ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజం


జి.కొండూరు(కృష్ణా): ఏం ఉద్దరించారని రైతు దినోత్సవం జరిపారో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రైతు దినోత్సవం పేరుతో ప్రకటనలకు రూ.వేలకోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుబారా చేస్తున్నారని మండి పడ్డారు. రైతుసొమ్ము దుబారా దినోత్సవం అని ప్రభుత్వం నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు.


టీడీపీ హయాంలో ఏడాదిలో సాగునీటి రంగానికి రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ కేవలం రూ.4 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయిందన్నారు. రైతు రుణమాఫీని తప్పుబట్టిన జగన్‌ అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పక్కన పెట్టాడన్నారు. ఏటా ప్రతి రైతుకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7వేలకే పరిమితం చేశారన్నారు.  సున్నా వడ్డీ జీవో ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏడాది పట్టిందన్నారు. లక్ష రుణం తీసుకుంటే రూ.1,07,000 వడ్డీతో కడితే ఏడాది తర్వాత తిరిగిస్తుందంట ఇదేనా సున్నా పథకం అని ప్రశ్నించారు.


అజయ్‌ కల్లం రెడ్డి, నాగిరెడ్డి, కన్నబాబులు అనే త్రిమూర్తులు రైతుల్ని రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. రైతు భరోసా పేరుతో 64 లక్షల మంది రైతుల్ని 54 లక్షల మందికి కుదించారన్నారు. నాలుగైదు విడతల రుణమాఫీ కింద రూ.40 వేలు, అన్నదాత సుఖీభవ కింద చెల్లించాల్సిన రూ.10 వేలు కలిపి మొత్తం రూ.50 వేలను రైతులకు చెల్లించకుండా వైసీపీ ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-07-09T16:39:47+05:30 IST