అప్పన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-24T05:16:36+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తజనంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది.

అప్పన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ప్రసాదాల కౌంటర్ల వద్ద బారులుతీరిన భక్తులు

సింహాచలం, అక్టోబరు 23: వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తజనంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది.  ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు సింహగిరిపై,  నగరంలోని వివిధ ప్రాం తాల్లో పెళ్లిళ్లు చేసుకున్న నూతన వధూవరులు  కుటుంబ సభ్యులతో తరలి వచ్చారు. దీంతో కేశఖండనశాల, గంగధార, ఉచిత దర్శన క్యూలు, ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద భక్తులు బారులుతీరి కనిపించారు. భక్తుల తాకిడి కారణంగా ఉచిత క్యూ లైన్‌ ద్వారా స్వామివారిని దర్శించేందుకు సుమారు రెండు గంటలు పట్టిందని  పలువురు తెలిపారు. అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా స్వామివారి దర్శనం కంటే ప్రసాదాల కొనుగోళ్లకే భక్తులు అధిక సమయం వెచ్చించాల్సి వచ్చింది. కాగా స్వామివారి ప్రసాదం పులిహోర రుచిగా లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అప్పన్నను దర్శించుకున్న మంత్రి 

సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ దంపతులు, అడిషినల్‌ డీసీపీ ఎం.నాగేశ్వరరావు, అసోం రాష్ట్ర సచివాలయ ఐఏఎస్‌ అధికారి నీరదాదేవి, విద్యాశాఖ సెక్రటరీ భాగ్యచౌదరి, తిరుపతికి చెందిన టీడీపీ నాయకురాలు సుగుణమ్మ, డీఈవో చంద్రకళ, సర్వశిక్షా అభియాన్‌ అధికారి రాజేశ్వరి, రంప చోడవరం ఐటీడీఏ పీవో ఎం.వెంకటేశ్వరరావు,  తదితరులు దర్శించుకున్నారు. 


Updated Date - 2021-10-24T05:16:36+05:30 IST