భక్తసులభుడు!

ABN , First Publish Date - 2021-12-17T05:30:00+05:30 IST

మానవులలోని అజ్ఞానాంధకారాన్నీ, అహంకారాన్ని పారద్రోలే అవధూత

భక్తసులభుడు!

19న శ్రీ దత్తాత్రేయ జయంతి

మానవులలోని అజ్ఞానాంధకారాన్నీ, అహంకారాన్ని పారద్రోలే అవధూత దత్తాత్రేయుడు. భూలోకంలో గురుపరంపరకు ఆయనతోనే పునాది పడింది. కాబట్టి ఆయనను తొలిగురువుగా భావిస్తారు. శ్రీదత్తాత్రేయుణ్ణి ‘స్మర్తృగామి’ అని పిలుస్తారు. అంటే స్మరించినంత మాత్రాన కోర్కెలను తీర్చే భక్తసులభుడు.  శ్రీదత్తాత్రేయుడు కలియుగంలో... శ్రీపాదశ్రీవల్లభునిగా, శ్రీనరసింహ సరస్వతిగా, శ్రీమాణిక్యప్రభువుగా, శ్రీసమర్ధ అక్కల్‌కోట మహారాజుగా అవతారాలు దాల్చాడని, శ్రీషిరిడీ సాయినాథుడు ఆయన ఆఖరి అవతారమనీ చెబుతారు. 


పురాణాల్లోని శ్రీదత్తాత్రేయుడి ఆవిర్భావ కథ ప్రకారం... అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తుల భార్యలు తమ భర్తలను ఆమె వద్దకు పంపుతారు. వివస్త్రగా తమకు భోజనాలు వడ్డించాలని త్రిమూర్తులు కోరగా... ఆమె వారిని పసిపిల్లలుగా మార్చి, తన స్తన్యాన్ని ఇస్తుంది. దీనికి సంతోషించిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకోమంటారు. వారు తన పుత్రులుగా జన్మించాలని ఆమె వేడుకుంటుంది. బ్రహ్మ చంద్రుడిగా, విష్ణువు శ్రీ దత్తునిగా, శివుడు దూర్వాసునిగా జన్మిస్తారు.

చంద్రుడు తన చంద్రమండలానికి, దూర్వాసుడు తపస్సుకు వెళ్ళగా... దత్తాత్రేయుడు లోకోద్ధరణకు పూనుకుంటాడు. అధర్మనాశనం కోసం తన అవతారాన్ని వినియోగిస్తాడు. దత్తాత్రేయుడు అత్యంత మనోహర మూర్తి. ఔదుంబర (మేడి) చెట్టు నీడలో... త్రిమూర్తులను తలపించే మూడు శిరస్సులతో, వారిని సూచించే చిహ్నాలతో, కామధేనువును స్ఫురింపజేసే గోమాతతో, చతుర్వేదానికి ప్రతీకలైన నాలుగు శునకాలతో ఆయన ప్రకాశమానంగా దర్శనమిస్తాడు.


ప్రకృతే గురువు...

‘మార్కండేయ, మత్స్య, బ్రహ్మ, దత్త పురాణాల’లో దత్తాత్రేయ అవతార ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘మాండూక్య ఉపనిషత్తు’లో దత్తాత్రేయుడు ప్రవచించిన సిద్ధాంత వివరణను చూడవచ్చు. ‘భాగవత పురాణం’లో ప్రహ్లాదుడికి ఆస్తిక సిద్ధాంతం గురించి దత్తాత్రేయుడు వివరిస్తాడు. శ్రీకృష్ణుడు ‘ఉద్ధవగీత’లో దత్తాత్రేయుడి 24 మంది గురువుల గురించి పేర్కొన్నాడు. తను సృష్టించిన ప్రకృతే సర్వులకూ గురువు అనీ, వాటిని అనుసరించి, అనుకరించి, నీతిని నేర్చుకొని, అనుభసారాన్ని గ్రహిస్తే... సర్వం పరమేశ్వరమయం అవుతుందనేది భక్తులకు దత్తాత్రేయుడు ఇచ్చిన సందేశం. భయంతో స్వేచ్ఛను కోల్పోయే లేడి, తుచ్ఛమైన ఎరలకు లొంగిపోయే చేప, తాను సృజించిన గూటిలో నివసించి, పరమాత్మలా తుదకు తనలోనే లయం చేసుకొనే సాలీడు.


విషయవాసనలకు లోనుకాని మహాసాగరం, సూర్య చంద్రులు, కల్మషరహితంగా ప్రతిక్షణం ఆనందించే పసి పిల్లవాడు, ‘అహేతుక విశ్వాసాలు’ అనే కుబుసాన్ని విడుస్తూ... నిత్య నూతన దేహంతో జీవించే సర్పం, ఇంద్రియలోలత్వంతో మంటల్లో నశించే శలభం, అనంతమైన ఆత్మకు ప్రతీక అయిన ఆకాశం. పువ్వులను నొప్పించకుండా మకరందాన్ని సేకరించే తుమ్మెద... ఇలా ప్రకృతిలో కనిపించే ప్రతీదీ మనకు మార్గదర్శనం చేస్తాయని దత్తాత్రేయుడు బోధించాడు. అష్టాంగయోగాలైన... యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ప్రక్రియలను లోకానికి ఆయన పరిచయం చేశాడు. తదనంతర కాలంలో వాటిని పతంజలి మహర్షి యోగ సూత్రాలుగా క్రోడీకరించాడు.


‘స్మరణ భకి’్తతో కార్తవీర్యార్జునుడు, ‘అర్చనా భక్తి’తో ఆయువు అనే మహారాజు, ‘వందన భక్తి’తో అల్కరుడు, మైత్రీ భక్తితో పరశురాముడు, నవవిధ భక్తిభావాలతో ప్రహ్లాదుడు, యదురాజు, వేదధర్ముడు, ఛందోశాస్త్రకారుడైన పింగళనాగుడు... ఇలా ఎందరో దత్తాత్రేయుడిని సేవించి తరించారు. భక్తుల మానసిక స్థితిని, అచంచల భక్తి విశ్వాసాలను తెలుసుకొనే క్రమంలో... బాల, ఉన్మత్త, పిశాచ, దిగంబర, జడాకార స్థితులలో దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చి, పరీక్షిస్తాడు. వారిని తనలో శాశ్వతంగా లయం చేసుకుంటాడు.  


మార్గశిర పూర్ణిమ శ్రీదత్తాత్రేయ జయంతి. ఆ రోజు చేసే ఆయనకు చేసే పూజలు,  ‘ఓం శ్రీం హ్రీం ద్రాం’ అనే బీజాక్షరాలను పఠిస్తూ నిశ్చల భక్తితో చేసే జపాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయనీ, కష్టాల్లో ఉన్నవారు ఆయన నామస్మరణమాత్రాన అనుగ్రహం పొందుతారని పెద్దలు చెబుతారు



దత్తాత్రేయుడు అత్యంత మనోహర మూర్తి. ఔదుంబర (మేడి) చెట్టు నీడలో... త్రిమూర్తులను తలపించే మూడు శిరస్సులతో, వారిని సూచించే చిహ్నాలతో, కామధేనువును స్ఫురింపజేసే గోమాతతో, చతుర్వేదానికి ప్రతీకలైన నాలుగు శునకాలతో ఆయన ప్రకాశమానంగా దర్శనమిస్తాడు.


 డాక్టర్‌ దేవులపల్లి పద్మజ

9849692414

Updated Date - 2021-12-17T05:30:00+05:30 IST