Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమిదే..: డీజీపీ మహేందర్‌రెడ్డి

సంస్థాన్‌ నారాయణపురం: సర్వేల్‌ గురుకుల విద్యాలయంలో చదవడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రా మంలోని గురుకుల పాఠశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం జరిగిన స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. తన జీవితాన్ని మలుపు తిప్పింది సర్వేల్‌ గురుకులమేనని అన్నారు. మొదట తమ ఊరి పక్కన ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకున్నానని, ఆనాడు తనతో పాటు చదివిన మిత్రులంతా వ్యవసాయం, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.


తనకు సర్వేల్‌ గురుకులంలో సీటు రావడం, గురువుల పర్యవేక్షణలో కష్టపడి చదవడంతోనే ఉన్నత స్థితికి ఎదిగానని వివరించారు. ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే.. నా జీవితమే సర్వేల్‌ గురుకులం.. సర్వేల్‌ గురుకులమే నా జీవితం’’ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ బూడిద నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, గురుకుల విద్యాలయ సంస్థ డిప్యూటీ సెక్రటరీ కేఎస్‌ ప్రసాద్‌, పూర్వ విద్యార్థులు మల్లేశ్‌, పెంటాచారి, రమణారెడ్డి, ఉదయ్‌భాస్కర్‌, చిన్నరాజ, గంగాధర్‌ పాల్గొన్నారు. వచ్చేనెల 26న స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహిస్తామని బూడిద నరేందర్‌రెడ్డి తెలిపారు.


Advertisement
Advertisement