భవిష్యత్‌లో టీకా తీసుకున్నోళ్లకే.. మాల్స్‌, హోటళ్లలో అనుమతి

ABN , First Publish Date - 2021-08-01T08:34:28+05:30 IST

రానున్న రోజుల్లో కరోనా టీకా తీసుకున్నవారినే హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి అనుమతినిచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు

భవిష్యత్‌లో టీకా తీసుకున్నోళ్లకే.. మాల్స్‌, హోటళ్లలో అనుమతి

తొమ్మిది జిల్లాల్లో ఇంకా ఎక్కువగానే కేసులు

పాజిటివ్‌ వచ్చినా యథేచ్ఛగా తిరుగుతున్నారు

మీడియాతో డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో కరోనా టీకా తీసుకున్నవారినే హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి అనుమతినిచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ మూడో దశ రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్‌ఎంసీలో కొన్ని ప్రాంతాలతో పాటు మొత్తం 9 జిల్లాల్లో ఇప్పటికీ కేసులు అధికంగానే నమోదవుతున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు.  ఖమ్మం జిల్లా కూ సుమంచి గ్రామంలో పాజిటివ్‌ వచ్చినవారు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని పే ర్కొన్నారు. కాగా, తెలంగాణలో నమోదైన రెండు డెల్టాప్లస్‌ కేసులు హైదరాబాద్‌వేనని, మేలోనే వీటిని గుర్తించామన్నారు. వారు కోలుకున్నారని తెలిపారు.


కాంటాక్టులను వెంటనే గుర్తించి పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. డెల్టా వేరియంట్లు చాలా ప్రమాదకరమని, శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి ఇన్ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంటుందన్నారు. థర్డ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేలా.. వైద్య వసతులను సిద్ధం చేసినట్లు తెలిపారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలను కల్పించామన్నారు. జూలైలో 30.04 లక్షల డోసులు వచ్చాయని, వచ్చే రెండు వారాలు రెండో డోసువారికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.


1.13 లక్షల టెస్టులు.. 621 కేసులు

రాష్ట్రంలో శనివారం 1,13,012 మందికి పరీక్షలు చేయగా.. 621 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 6,44,951కు, మరణాలు 3,802కు పెరిగాయి. కొత్తగా 691 మంది కోలుకున్నారు. 9,069 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో 80, కరీంనగర్‌లో 67, ఖమ్మం జిల్లాలో 51 నమోదయ్యాయి. ఆస్పత్రుల్లో 3798 మంది చికిత్స పొందుతున్నారు.  


అప్రమత్తంగా లేకుంటే థర్డ్‌వేవ్‌ తప్పదు సీఎస్‌ఐఆర్‌ డీజీ శేఖర్‌ స్పష్టీకరణ

చౌటుప్పల్‌ రూరల్‌: ప్రజలు అప్రమత్తంగా లేకుం టే దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ తప్పదని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ సీ మండే హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం మందోళ్ళగూడెం శివారులో భూమ్యాస్కాంత పరిశోధన క్షేత్రంలో (సీఎస్‌ఐఆర్‌, ఎన్‌జీఆర్‌ఐ) నెలకొల్పిన భూమ్యాయస్కాంత అబ్జర్వే టరీని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒకవేళ దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చినా సెకండ్‌వేవ్‌ అంత ఉధృతంగా ఉండకపోవచ్చు. సెకండ్‌ వేవ్‌లో సరైన ప్రణాళిక లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సెకండ్‌వేవ్‌లో వచ్చిన పరిస్థితులు ఇప్పుడు లేవు. సుమారు 70శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉన్నాయి. ఒకవేళ మూడో దశ వచ్చినా.. దాన్ని ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది’ అని ఆయన చెప్పారు. 



2 గంటల తేడాతో దంపతుల మృతి

కరోనాతో చికిత్స పొందుతూ ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరుకు చెందిన దంపతులు బొల్లెపోగు వెంకటేశ్వర్లు (63), ద్వారక (59) రెండు గంటల వ్యవధిలో మృతిచెందారు. 15 రోజుల క్రితం వీరికి పాజిటివ్‌ రాడంతో వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తర్వాత తీవ్ర జ్వరం రావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ చనిపోయారు. 

Updated Date - 2021-08-01T08:34:28+05:30 IST