మహనీయుల దానధర్మాలు

ABN , First Publish Date - 2020-08-09T09:12:42+05:30 IST

భీష్ముడు ధర్మరాజుతో ‘‘రాజా! యాచకుడు దాతను ‘దేహీ’ అని అర్థించినప్పుడు, సంతోషంతో అభయమిచ్చి, కోరిన వానిని దానం చేయుట యజ్ఞంతో సమానమగును’’ అని వివరించిన పద్యమిది.

మహనీయుల దానధర్మాలు

అర్ధిగోరిన వస్తువులర్ధి తోడ

నీగి యెల్ల దానములకు నభయంబు నిచ్చు

టంతకంటెను మే లెందు రార్యజనులు


భీష్ముడు ధర్మరాజుతో ‘‘రాజా! యాచకుడు దాతను ‘దేహీ’ అని అర్థించినప్పుడు, సంతోషంతో అభయమిచ్చి, కోరిన వానిని దానం చేయుట యజ్ఞంతో సమానమగును’’ అని వివరించిన పద్యమిది. ఒకప్పుడు ఇంద్రుడు విశ్వరూప మహర్షిని వధించినందున బ్రహ్మహత్యా దోషం కలిగింది. మహర్షి తండ్రి త్వష్టి ఆగ్రహంతో ఇంద్రుని చంపగల పుత్రుని అనుగ్రహించమని హోమం చేశాడు. ఆ హోమంలోంచి భయంకరాకారమై, శూలధారియైున వృతాసురుడు ఉద్భవించి, సమస్తలోకాలను ఆక్రమించి, దేవతా గణములను ఓడించాడు.


దేవతాగణములు శీహరుని శరణు కోరగా ‘‘మహాదాత దధీచి మహర్షి ఎముకలతో నిర్మించిన వజ్రాయుధంతో వృతానురుడు మరణిస్తాడు’’ అని చెప్పాడు. దాంతో.. దేవతలు దధీచిని ప్రార్థించారు. ఆ మహర్షి తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత.. దధీచి ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి, ఇంద్రుడికి అందజేశాడు. ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడిని సంహరించాడు. శరీరాన్ని లోకహితార్థమై త్యాగం చేసి, దానమిచ్చిన దధీచి మహర్షి కీర్తి.. అత్యున్నతమైనది.


దాన శీలి బలి చక్రవర్తి కూడా వామనుడికి మూడడుగుల నేల ఇచ్చేందుకు ఏమాత్రం సంకోచించలేదు. శుక్రాచార్యుడు వారించినా.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. ఆయనకు స్వర్గలోక ప్రాప్తి లభించింది. చరితార్థుడయ్యాడు. రంతిదేవుడు అనే రాజు సర్వస్వాన్ని పేదలకు దానమిచ్చి.. దారిద్ర్యాన్ని అనుభవించాడు. 48 రోజులు అన్నపానీయాలు లేకుండా గడిపాడు. ఆ తర్వాతి రోజు ఆయనకు పాయసాన్నం లభించింది. ఆయన తినబోతుండగా.. ఓ బ్రాహ్మడు వచ్చి ‘దేహీ’ అంటూ యాచించాడు. రంతిదేవుడు ఆయనకు సగం ఇచ్చి, మిగతాది తినబోగా ఓ శూద్రుడు వచ్చి ‘భిక్షాందేహీ’ అని ప్రార్థించాడు. ఆ వెంటనే మరొకరు వచ్చి యాచించగా.. వారికి మిగతా పాయసాన్నం ఇచ్చేశాడు. ఆ తర్వాత మరొకరు వచ్చి దేహీ అని అర్థించగానే.. ఉన్న కొద్దిపాటి తాగునీటిని అందజేశాడు. ఆయన దాతృత్వాన్ని చూసి.. ప్రసన్నమై.. యాచించిన వారందరి రూపంలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఆ రాజుకు మోక్షాన్ని ఇచ్చారు.


పాండవ పక్షపాతి ఇంద్రుడు కపట బుద్ధితో.. బ్రాహ్మణుడి రూపంలో కర్ణుడి సహజ కవచకుండలాలను దానంగా స్వీకరించాడు. సూర్యుడు హెచ్చరించినా.. కర్ణుడు తన కవచకుండలాలను త్యజించాడు. బ్రాహ్మణులు ఏది కోరినా దానమివ్వడం తన కర్తవ్యమంటూ సూర్యుడికి క్షమాపణలు తెలిపాడు. ఆ దానశీలతకు మెచ్చిన ఇంద్రుడు.. కర్ణుడికి శక్తి ఆయుధాన్నిచ్చాడు. ప్రచారం లేకుండా చేసే గుప్తదానం ఎంతో గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. చతుర్విద భక్తిమార్గాలతోపాటు.. దాతృత్వం కూడా మోక్షానికి సోపానమని మహానీయుల దానధర్మాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఉన్నంతలో దానధర్మాలు, పరోపకారం చేయడం ఉత్తమగతులను ప్రాప్తింపజేస్తుంది.


రాయసం రామారావు, 9492191360

Updated Date - 2020-08-09T09:12:42+05:30 IST