Abn logo
Nov 25 2021 @ 02:45AM

ధనదాహ ధరణి!

  • కోట్ల సొమ్ము సర్కారు వద్దే.. 
  • రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్నా వెనక్కి రాని డబ్బు 
  • కొనుగోలుదార్లు లబోదిబో 
  • అధికారులు, మీ సేవల చుట్టూ ప్రదక్షిణలు
  • మ్యూటేషన్‌ దరఖాస్తు తిరస్కరించినా అంతే


హైదరాబాద్‌/ ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌  : ‘మూడు నెలల క్రితం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం మెన్నిపాడు గ్రామ శివారులో ఆరెకరాలు కొన్నాను. స్లాట్‌ బుక్‌ చేసుకొని, రెండెకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. అనివార్య కారణాల వల్ల మిగతా భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. నాలుగెకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 54,840 తిరిగి ఇవ్వాలని మూడు నెలలుగా తిరుగుతున్న. అధికారులేమో మాకు తెల్వదని అంటున్నరు’ గద్వాల జిల్లా మావనపాడు మండలం చిన్నపోతులపాటు గ్రామానికి చెందిన బంగారి శేషన్న అనే రైతు ఆవేదన ఇది.


‘రెండెకరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రూ.22వేలు చెల్లించాను. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్నాను. అయితే ఆరు నెలలైనా డబ్బులు రావడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయంలో వివరాలు అందించినా.. ఇప్పటి వరకు ఖాతాలో డబ్బులు జమకాలేదు’ నిజామాబాద్‌ జిల్లా  తొర్తి గ్రామానికి చెందిన  రాజేశ్వర్‌ అనే రైతు ఆవేదన ఇది. 


ఇలా ఇబ్బందులు పడుతున్న రైతులు ఎందరో. రైతు నేస్తంగా ఉంటుందని చెబుతున్న ధరిణి, ఉల్టా అన్నదాతలను సమస్యల్లో పడేస్తోంది! సాధారణంగా ఏటీఎంలో లావాదేవీలో తేడా జరిగి డబ్బు చేతుల్లోకి రాకున్నా ఖాతా నుంచి డెబిట్‌ అయితే గరిష్ఠంగా వారం రోజుల్లో డబ్బు తిరిగి ఖాతాల్లో పడుతుంది. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్లలో ఏదైనా ఆర్డర్‌లో గందరగోళం జరిగినా, ఆర్డర్‌ను రద్దు చేసుకున్నా.. ఒకట్రెండు రోజుల్లో డబ్బు, వినియోగదారుడి ఖాతాకు క్రెడిట్‌ అవుతుంది. గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిర్భవించిందని చెబుతున్న ధరణిలో ఈ వ్యవస్థ లేదు. ధరణికి ధనదాహం పట్టుకుందా? అన్నట్లుగా రద్దయిన రిజిస్ట్రేషన్ల స్లాట్లు, మ్యుటేషన్‌, సక్సెషన్‌కు సంబంఽధించిన డబ్బు కొనుగోలుదారు ఖాతాలో పడట్లేదు. ధరణి ఆవిర్భవించి ఏడాది గడిచింది. సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ధరణిలో రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే అందుకు చెల్లించిన సొమ్ము కొన్నిసందర్భాల్లో తిరిగి వారి ఖాతాల్లో పడటం లేదు. 


కొన్నిసార్లు ఒక డాక్యుమెంట్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు రెండుసార్లు చలానా కట్టాల్సి వస్తోంది. అంటే రెండింతలు కట్టిన సొమ్ములో న్యాయంగా వెనక్కి రావాల్సిన డబ్బు నెలలు గడిచినా ఖాతాల్లో పడట్లేదు! అలాగే ఏదో కారణాలతో మ్యూటేషన్‌, సక్సేషన్‌ దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరిస్తే ఆ సొమ్మును తిరిగి పొందేందుకు కనీసం ధరణిలో ఆప్షన్‌ కూడా లేదు. ఇలా ధరిణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ధరణిలో స్లాట్‌ క్యాన్సిల్‌ ఆప్షన్‌ను ఆరు నెలల క్రితమే ఇచ్చారు. ఆ మేరకు స్లాట్‌ క్యాన్సిల్‌కు ధరణిలో దరఖాస్తు చేసుకొని తమ బ్యాంకు వివరాలు నమోదు చేస్తే స్లాట్‌ కోసం చెల్లించిన చలాన్‌ డబ్బు తిరిగి రైతుల ఖాతాలో జమకావాలి. పలువురి ఖాతాల్లో జమ కావడం లేదు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో రోజూ ఎందరో బాధితులు స్లాట్‌ క్యాన్సిల్‌ స్లిప్పులతో తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చే వరకు తాము ఏమీ చేయలేమని తాహసీల్దార్‌ల నుంచి కలెక్టర్‌ల వరకు చేతులెత్తేస్తున్నారు. లావాదేవీల్లో తేడా వస్తే క్షణాల్లో సరిచేయగల సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ఈ రోజుల్లో ధరణిలో ఈ లోపభూయిష్టమైన విధానం ఏమిటి? అని డబ్బు  వెనక్కి ఎప్పుడొస్తుందో తెలియక కొనుగోలుదార్లు ఎదురుచూడాల్సిందేనా? అని లావాదేవీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ ఉండదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. 


ప్రతి జిల్లాలోను వేలల్లో బాధితులు 

ప్రతి మండలంలో రోజుకు సుమారు 10-20 వరకు దరఖాస్తులు తిరస్కరించడం జరుగుతోంది. అలాగే ప్రతి జిల్లాలో అనివార్య కారణాలతో రోజులో 10-15 వరకు రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మ్యూటేషన్‌, సక్సేషన్‌ దరఖాస్తులు ఒక్కో జిల్లాలో ప్రతి రోజు సుమారు 50-75 వరకు పలు కారణాలతో తిరస్కరణ అవుతున్నట్లు తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రతి జిల్లాలోను పెద్ద సంఖ్యలో బాధితులుండగా, ప్రభుత్వం వద్ద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము రూ.కోట్లలో ఉంది. అయితే ఏడాది కాలంగా రైతులు ఇబ్బదులు పడుతున్నా ప్రభుత్వం ఆప్షన్‌లు ఇవ్వడం లేదు, ఆప్షన్‌లు ఇచ్చిన వాటికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. 


ఒకే డాక్యుమెంట్‌కు రెండు సార్లు ఫీజు 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిఽధిలో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో రూ.3లక్షల వరకు ఫీజును చెల్లించాడు. కానీ ఆన్‌లైన్‌లో స్లాట్‌బుకింగ్‌కు సంబంధించిన చలానా జనరేట్‌ కాలేదు.. మీరు చెల్లించిన డబ్బులు మళ్లీ మీ ఖాతాలోకి వస్తాయి.. మీరు మళ్లీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని మీ-సేవ నిర్వాహకుడు సూచించడంతో రెండో సారి రూ.3లక్షలు చెల్లించాడు. ఇలా ఒకే డాక్యుమెంట్‌కు రెండు సార్లు రూ.3లక్షల చొప్పున రూ.6లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఆ వ్యక్తికి భూమి రిజిస్ర్టేషన్‌ జరిగింది, పట్టాదారు పాసుబుక్‌ కూడా వచ్చింది. కానీ ఐదు నెలల నుంచి తిరుగుతున్నా.. తిరిగి ఇవ్వాల్సిన రూ.3లక్షలను మాత్రం ఇవ్వడం లేదు. మీ సేవ నుంచి తహసీల్దార్‌, అక్కడి నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. 

తరుచూ సమస్యలు ఇవీ


ధరణిలో భూమి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసే సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించినపటికీ సర్వర్‌ నెమ్మదించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొన్నిసార్లు చలానా జనరేట్‌ కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఫీజును మళ్లీ ఆన్‌లైన్‌లో చెల్లిస్తేనే  చలానా జనరేట్‌ కావడంతో పాటు స్లాట్‌బుక్‌ అవుతుంది. చలానా జనరేట్‌లో జాప్యం జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. అదనంగా చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చే అధికారం తమకు లేదని చెబుతున్నారు. 


ఒక వ్యక్తి భూమిని కొనుగోలు చేసి ధరణిలో రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వలన రద్దు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అతను చెల్లించిన స్టాంపు డ్యూటీ,  రిజిస్ట్రేషన్‌ ఫీజులను తిరిగి ఇవ్వడం లేదు. కానీ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటే.. చెల్లించిన స్టాంపుడ్యూటీ ఫీజులో 10శాతం సొమ్మును సర్వీసు చార్జీల కింద తీసుకొని మిగిలిన సొమ్మును తిరిగి క్రయవిక్రయదారులకు సుమారు 3 నెలల లోపు ఇస్తున్నారు.


పెండింగ్‌ మ్యూటేషన్‌ దరఖాస్తులు, సక్సేషన్‌ దరఖాస్తులను పత్రాలు సక్రమంగా లేకపోవ డం, భూముల లెక్కల్లో గందరగోళం ఉండటం, భాగపంపిణీలో సరైన హద్దులు రాయలేకపోవడంతో పాటు మరేదైనా కారణంతో కలెక్టర్లు తిరస్కరిస్తున్నారు. సరైన పత్రాలు జతచేసి మళ్లీ దరఖాస్తు చేయాలని ఫోన్‌లకు మెసేజ్‌ల ద్వారా సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఒక్కో మండలంలో వారానికి 5-6 వరకు వస్తున్నాయని, ప్రతి జిల్లాలోను సుమారు 10 వేల నుంచి 15 వేల మంది  రైతులు ఇబ్బంది పడుతున్నారు.