ధనలక్ష్మీ బ్యాంక్‌ మునుగుతోంది!

ABN , First Publish Date - 2020-09-30T07:05:36+05:30 IST

కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ధనలక్ష్మీ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితులపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు విషమించక ముందే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి...

ధనలక్ష్మీ బ్యాంక్‌ మునుగుతోంది!

  • వెంటనే జోక్యం చేసుకోండి.. ఆర్‌బీఐకి ఉద్యోగ సంఘాల వినతి 


న్యూఢిల్లీ: కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ధనలక్ష్మీ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితులపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు విషమించక ముందే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అఖిల భారత బ్యాంకింగ్‌ అధికారుల సమా ఖ్య (ఏఐబీఓసీ) ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు లేఖ రాసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉద్యోగులు, డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నుంచి బ్యాంక్‌ గత ఏడాది బయటపడిన విషయాన్ని గుర్తు చేసిం ది. అయినా ఎడాపెడా రుణాల మంజూరు, నిర్వహణ ఖర్చు ల భారంతో బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి మళ్లీ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్‌ ఆర్థిక  పరిస్థితులపై అఖిల భారత బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఓ) ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే బ్యాంకింగ్‌ అధికారుల సమాఖ్య ఏఐబీఓసీ కూడా లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


బోర్డులో ఆర్‌బీఐ నామినీ డైరెక్టర్‌

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని తన ప్రాంతీయ కార్యాలయం జనరల్‌ మేనేజర్‌ డీకే కాశ్య్‌పను రెండేళ్ల కాలానికి ధన లక్ష్మి బ్యాంక్‌ అదనపు డైరెక్టర్‌గా నామినేట్‌ చేసింది. ఆర్‌బీఐ  సోమవారమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు బ్యాంకు మంగళవారం రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. అయితే ఈ నియామకానికి కారణాలు మాత్రం బ్యాంక్‌ వెల్లడించలేదు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఆర్‌బీఐ సాధారణంగా ఏ ప్రైవేటు బ్యాంకు బోర్డులోనూ తన నామినీలను నియమించదు. ఆర్‌బీఐ తాజా చర్యతో ధనలక్ష్మీ బ్యాంక్‌లో ఏవో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


Updated Date - 2020-09-30T07:05:36+05:30 IST