స్త్రీ చెంత తీర్పులివ్వని అండ ధనికొండ

ABN , First Publish Date - 2020-02-24T06:58:26+05:30 IST

‘‘లోకమేదో మనల్ని మోసం చేస్తోందని అనుకుంటాంగానీ, మనల్ని మనం చేసుకునే మోసం ముందు లోకం చేసేది ఏ పాటి?’’ - అంటారు ధనికొండ హనుమంతరావు (‘గుడ్డివాడు’ నవలలో). ఇలాంటి జీవితసత్యాలు ఎన్నిటినో తన నవలల్లో, కథల్లో పొందుపరచి ఇచ్చిన ధనికొండ...

స్త్రీ చెంత తీర్పులివ్వని అండ ధనికొండ

తెలుగులో గానీ, ఆ మాటకొస్తే ఏ భారతీయ భాషలోగానీ, లైంగిక సంబంధాలను ఇంత మామూలుగా, సహజమైందిగా చిత్రించిన రచయితలు లేరేమో. ఆయన దానికి ఏమీ రంగులు పులమలేదు. స్త్రీపురుషుల సంబంధాల్లో సెక్స్‌కి ఉన్న ప్రాముఖ్యాన్ని ఏ మాత్రం ముసుగల్లేకుండా, నగిషీలు లేకుండా, ఆదర్శాలూ, ద్వంద్వ ప్రమాణాలూ లేకుండా నిస్సంకోచంగా రాయడం ఈయన పద్ధతి.


తెలుగు సాహిత్యంలో స్త్రీల హక్కులు, లైంగిక స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం అనే మాటలు వచ్చినప్పుడల్లా గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావుల పేర్లే చెప్పుకోవడం రివాజు. ఇకపై ఈ ముగ్గురితోపాటు ధనికొండ హనుమంతరావు పేరు కూడా చేర్చుకోకుండా మాట్లాడడం కుదరదు. ఇన్నేళ్లుగా పాఠకుల దృష్టికి తక్కువగానూ, విమర్శకుల దృష్టికి అసలే రాకుండానూ ఉన్న ధనికొండను ఇప్పటికైనా మనం చదువుకుంటూ, చర్చించుకోవటం చాలా అవసరం.


‘‘లోకమేదో మనల్ని మోసం చేస్తోందని అనుకుంటాంగానీ, మనల్ని మనం చేసుకునే మోసం ముందు లోకం చేసేది ఏ పాటి?’’ - అంటారు ధనికొండ హనుమంతరావు (‘గుడ్డివాడు’ నవలలో). ఇలాంటి జీవితసత్యాలు ఎన్నిటినో తన నవలల్లో, కథల్లో పొందుపరచి ఇచ్చిన ధనికొండ హనుమంత రావుగారి గురించి తెలుగు సాహిత్య విమర్శకులు పెద్దగా పట్టించుకోలేదన్నది చేదు నిజం. హనుమంతరావుగారు రాసిన అన్ని నవలలూ గొప్పవీ, అసాధారణమైనవీ కాకపోవచ్చు కానీ మానవ సంబంధాల గురించి, స్త్రీల లైంగికత్వం గురించి, స్త్రీపురుష సంబంధాల్లో నీతి అవినీతుల గురించి ఇంత లోతుగా, వినూత్నంగా ఆలోచించిన రచయితలు తక్కువ. 


స్త్రీపురుషుల శృంగార సంబంధాలను స్త్రీల అస్తిత్వానికి సంబంధించిన ఒక తిరుగుబాటుగా చలం అభివర్ణించడం తెలిసిందే. ఈ విషయంలో సమాజంలో ఉన్న ద్వంద్వనీతిని చలం, కుటుంబరావు ఖండించిన విషయం కూడ తెలిసిందే. కానీ ధనికొండ చూపులోని విశేషమేమిటంటే ఆయన ఈ శృంగార సంబంధాలను స్త్రీల తిరుగుబాటుగా చూడలేదు, జీవితంలోని అతిసహజమైన విషయంగా చూశారు. తెలుగులో గానీ, ఆ మాటకొస్తే ఏ భారతీయ భాషలోగానీ, లైంగిక సంబంధాలను ఇంత మామూలుగా, సహజమైందిగా చిత్రించిన రచయితలు లేరేమో. ఆయన దానికి ఏమీ రంగులు పులమలేదు. స్త్రీపురుషుల సంబంధాల్లో సెక్స్‌కి ఉన్న ప్రాముఖ్యాన్ని ఏ మాత్రం ముసుగల్లేకుండా, నగిషీలు లేకుండా, ఆదర్శాలూ, ద్వంద్వ ప్రమాణాలూ లేకుండా నిస్సంకోచంగా రాయడం ఈయన పద్ధతి. స్త్రీలు కూడ పురుషుల్లాగే తమ లైంగికత్వం గురించి ఆలోచిస్తారని 1940లలోనే రాయడం చెప్పుకోదగ్గ విషయం. అలాగే వివాహేతర సంబంధాలు అసాధారణమేమీ కాదని అంటూ, శారీరక వ్యభిచారం ఆపగలిగినా, మానసిక వ్యభిచారాన్ని అరికట్టలేమన్న సత్యాన్ని చెప్పడం ధనికొండ తన రచనల్లో వాస్తవికతకు ఎంత సన్నిహితంగా ఉన్నారో చెప్పే విషయాలు. ఎక్కువమంది పాఠకులకు, విమర్శకులకు అంత సులభంగా కొరుకుడు పడని విషయాలు. 


ధనికొండ రచనల్లో శృంగార సన్నివేశాల వర్ణన అధికంగా ఉంటుంది. ఈ సంబంధాల్లో ఒకరి ఆధిక్యం, మరొకరి తిరుగు బాటు తరహా రచన ఆయనలో కనిపించదు. అది అత్యంత సహజమూ, వాస్తవమూ అయిందిగా రూపుదిద్దుకుంది ఆయన రచనలో. ‘దూతికా విజయం’లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా అందువల్లే శృంగార వర్ణన ఈ నవలలో అమితంగా ఉంటుంది. అలాగే వివాహితుడైన పురుషుడు మరో స్త్రీ పట్ల ఆకర్షితుడు కావడం సహజమేనని అందరూ అంగీకరించే సమాజంలో స్త్రీ కూడ అంతే సహజంగా మరో పురుషుడి గురించి భావించవచ్చు అని రాయడం ఆయన అంత సహజం గానూ చేసే పని. ఆయన తన కాలం కంటే ఎంత ముందు న్నాడో చెప్పే విషయమిది. అలాంటి స్త్రీని గురించి తీర్పులు చెప్పడంగానీ, ఆమెను తిరుగుబాటుదారుగా భావించడంగానీ ఉండదు. ఆ కథనం మొత్తం చాలా సహజంగా (కాజువల్‌గా) చేస్తారు; అంతేకానీ ఇదో గొప్ప విషయం, ఆదర్శప్రాయ మైంది అన్నట్టుగా కాదు (‘అంచనా-వంచనా’). చలం ప్రమాద కరమైన రచయిత అని భావించిన సంప్రదాయప్రియులకు ధనికొండ కనిపించకపోవడం ఆశ్చర్యమే. చలాన్ని తిట్లతో విమర్శించినవారు, ధనికొండను పట్టించుకోకపోవడం ద్వారా విమర్శించారేమో అనుకోవాలి.


ధనికొండ రచనలో మరో ప్రత్యేకత - మనకు బాగా తెలుసుననుకుని, స్థిరంగా నమ్ముతూ వచ్చిన విషయాలనే పూర్తిగా వేరే కోణం నుంచి మనకు చూపడం. ప్రతి విషయానికీ మనం విశ్వసించే కోణం కంటే భిన్నమైన మరో కోణం ఉంటుందని గుర్తించడం ఎంత అవసరమో ఆయన నవలలు చెప్తాయి. ‘శరీర సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది. సౌందర్యమన్నది చూసేవాడి కళ్లలోనే ఉంటుంది’ వంటివన్నీ ఉత్తుత్తివేననీ, వాస్తవ జీవితానికి వచ్చేసరికి కళ్లులేని కబోదికి కూడ శరీరసౌందర్యమే ముఖ్యమవుతుందనీ ఢంకా బజాయించి చెప్పారాయన. (‘గుడ్డివాడు’) 


ఆయన చర్చకుపెట్టిన మరో విషయం డబ్బుకూ, స్త్రీపురుష అనుబంధాలకూ ఉన్న సంబంధం. ‘సేవిక’ నవలలో ఈ విషయంలో ఆయన చూపిన కోణం నిర్ఘాంతపరుస్తుంది. కేవలం పేదరికం నుంచి బయటపడడానికి తనకు ఏ మాత్రం ఇష్టం లేని ధనికుడితో వివాహం చేసుకునే స్త్రీని జాలితో చూస్తుంది ప్రపంచం; కొద్దో గొప్పో గౌరవిస్తుంది కూడా; కానీ అదే డబ్బుకోసం పురుషుడికి ఒళ్లు అమ్ముకునే వేశ్యను వెలివేస్తుంది. కానీ వీళ్లిద్దరి మధ్యా తేడా ఏమిటని ప్రశ్ని స్తాడు రచయిత. ఇద్దరూ డబ్బుకోసమే అమ్ముడుపోతు న్నారు; వేశ్య కనీసం నిజాయితీగా పెళ్ళయిన పురుషుడితో డబ్బుకోసం సంబంధం పెట్టుకుంటుంది; కానీ పేదరాలైన యువతి అదే డబ్బుకోసమే పెళ్లి పేరిట, అమ్ముడుపోతుంది కదా. ఇక్కడ వేశ్య కంటే వివాహితురాలిగా చలామణీ అయ్యే ఈ స్త్రీ ఎంతవరకు గొప్పది? అని ప్రశ్నిస్తారు ధనికొండ. ఇక్కడ ఇద్దరిదీ పేదరికమే. ఒకరు డబ్బుకోసం ఆ వృత్తిని ఎంచుకు న్నారు. మరొకరు వివాహం పేరిట ఒకే పురుషుడితోనైతేనేం, అయిష్టంగా కాపురం చేస్తున్నారు. కనక ఇద్దరూ డబ్బు కోసమే పురుషుడిని భరిస్తున్నారు. ఇక్కడ ఆయన అభి ప్రాయం ఆ ఇద్దరు స్త్రీలనూ తప్పుపట్టడం కాదు. ఇద్దరికీ నిజంగా తేడా ఉందా అన్న సందేహం. స్త్రీల మీద, ముఖ్యంగా వారి లైంగికేచ్ఛ, అవసరాల విషయంలో ధనికొండ ‘తీర్పు చెప్పనితనం’ ఎంత దూరం వెళ్లిందంటే, చివరకు తన లైంగికేచ్ఛ కోసం ఇంకా బాల్యం వీడని కుర్రవాడిని లొంగ దీసుకున్న స్త్రీ గురించి రాస్తున్నప్పుడు కూడ అదే యథాలాపధోరణినే అవలంబించారు (‘ప్రమాదం’).


భార్యల శృంగార సంబంధాల విషయంలో భర్తలు అవలంబించవలసిన వైఖరిని కూడా ఆయన చిత్రించారు. తన భార్య పాత ప్రేమికుడు ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడా నికి వచ్చినపుడు, సగటు భర్తలా భార్యను శంకిస్తూ కూర్చోక, ఆ బ్లాక్‌మెయిలర్‌కే బుద్ధిచెప్పి తరిమేసిన ఒక న్యాయమూర్తి కథ ‘తీర్పు’. ఎక్కువగా బలహీన మనస్కులైన పురుషుల్ని చిత్రించిన ధనికొండ ఈ కథలో ఒక నిజమైన న్యాయ మూర్తిని చూపించారు. తను ఎప్పుడూ స్త్రీల పక్షమేనని ఇక్కడ మరోసారి ధనికొండ నిరూపించుకున్నారు.


ధనికొండగారి పేరు చారిత్రక నవలాకారుల్లో కనిపించదు గానీ, హిస్టారికల్‌ రొమాన్సు నవలల్లో అగ్రశ్రేణికి చెందిన నవల ‘జగదేకసుందరి క్లియోపాత్రా’. ఒక తెలుగు రచయిత ఈజిప్టురాణి, రోమన్‌ రాజుల కథ చెప్పాలనుకోవడమే వింత. దానికి పరిశోధన కూడ తగినంతగా చెయ్యడం, కానీ అది పరిశోధనలా, డాక్యుమెంట్‌లాకాక నవలలా రాయడం చాలా గొప్ప విషయం. అందులోనూ క్లియోపాత్రా పాత్రను ఎక్కువ రొమాంటిసైజ్‌ చెయ్యకుండానే, వాస్తవాలను కనుమరుగుపరచ కుండానే, ఆమె మీద సానుభూతి, గౌరవం కలిగేలా చిత్రిం చడం గొప్ప విషయం. భాష, శైలి పూర్తిగా తెలుగుదనం నింపుకున్న పద్ధతి చూస్తే, సంభాషణల్లో తెలుగు నుడికారం చూస్తే, క్లియోపాత్రా తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. ఒక అసాధారణమైన రచన ఇది. క్లియోపాత్రాని ధనికొండ చూసినంత సానుభూతితో, అవగాహనతో ఎవ్వరూ చూడలే దనిపిస్తుంది. కొంతవరకు షేక్‌స్పియర్‌ ఆమె బలాన్ని కూడ చూపిస్తాడు. కానీ విమర్శకులు ఎక్కువగా ఆమెను భోగ లాలసత కలిగిన స్త్రీగా, లైంగికేఛ్ఛ మితిమీరిన స్త్రీగా మాత్రమే చూశారు. టి.ఎస్‌. ఎలియట్‌ తన విమర్శలో క్లియోపాత్రాను గురించి ‘అది’ అని ఒక వస్తువును ప్రస్తావించినట్టు ప్రస్తా వించాడు. ఆమెలో ఒక్క మంచి గుణమైనా అతను చూడలే దంటే ధనికొండ చూపు ఎంత విశాలమైందో తెలుస్తుంది.


తెలుగు నవలావికాసంలో ధనికొండ హనుమంతరావు గారి పేరు చెప్పగానే ఒకే ఒక నవల ప్రస్తావన వస్తుంది. ‘మగువ మనసు’ అన్న నవల ఒక్కటే విమర్శకులందరూ పేర్కొంటారు. తక్కిన నవలలు ఎవరికీ దొరకలేదో లేక అవి ప్రస్తావనకు తగనివనో. ‘మగువ మనసు’లో కథానాయకుడు రాజారావుకి తన పేదరికం ఒక అబ్సెషన్‌. అన్ని అనుభూతు లనూ, అనుభవాలనూ తన పేదరికం దృష్టి నుంచే చూడడం వల్ల, అది తక్కిన వాటికంటే పెద్ద సమస్య అయినందువల్ల, హృదయసంబంధమైన సమస్యలు, ఇష్టాలూ అన్నీ వెనక్కి పోతాయి. వాస్తవచిత్రణ పుష్కలంగా ఉండే రచన ఇది. అదే సమయంలో మనిషన్నాక మనసుంటుంది కనక, దానికి ఆనందం, ఉత్సాహం అవసరం కనక, అవి లభించినపుడు అది వదులుకోదు కనక మనిషికి మానసిక జీవితమూ అవసరమే. ఈ ద్వైధీభావం మొత్తం నవలంతా పరుచుకుని, చదివిన ప్రతిఒక్కరూ దానితో ఐడెంటిఫై అయ్యేలా చేస్తుంది. మనకు లలిత, తల్లి, రమణమ్మ, జయ వంటి వారు ఏమ నుకున్నదీ తెలీదు. కథానాయకుడి కోణం నుంచే కథంతా నడుస్తుంది. చేజేతులా అన్ని ఆనందాలనూ తన సంశయా లతో వదులుకున్న రాజారావు చివరకు పాపతో అనుబంధం పెంచుకోవడంతో కథ సుఖాంతం. మనిషి బాహిరాంతర జీవితాల సంఘర్షణను నిపుణంగా చిత్రించిన నవల ఇది. 


బహుశా ధనికొండ నవలలన్నిటిలోకీ గౌరవప్రదమైన, ‘సంస్కారవంతమైన’ పాత్రలు, చిత్రణ ఉన్న నవల ఇదే కనక, నవలా చరిత్రలో ఇదొక్కటే స్థానం సంపాదించుకుని వుంటుంది. ధనికొండను అర్థం చేసుకోవాలంటే ముందుగా పాఠకులు తమ సంశయాలనూ, పూర్వనిర్ధారిత అభిప్రాయా లనూ, సంకోచాలనూ వదులుకోవాలి. స్త్రీపురుషుల సంబంధం గురించి ఇంత యథాలాపంగా రాయగలిగిన ఆయన సాహసాన్ని అర్థంచేసుకోగల వివేచనని అలవరచుకోవాలి. మనిషి మానసిక జీవితచిత్రణలో గోపీచంద్‌, రావిశాస్త్రి, ఆల్ఫడ్ర్‌ ఆడ్లర్‌ను స్వీకరించినంత అవగాహనతో ఫ్రాయిడ్‌నీ, హావ్‌లాక్‌ ఎల్లిస్‌నీ స్వీకరించడంలో ఆయన చూపిన సాహ సాన్ని గుర్తించాలి. స్వప్నాలను ఆయన నవలల్లో వాడుకున్న తీరును అర్థం చేసుకోడానికి మరోసారి స్వప్న సిద్ధాంతాలను చదువుకోవాలి. మొత్తం మీద ధనికొండ ఆలోచించగల, వివే చించగల, ఎటువంటి ఆలోచనలనైనా స్వీకరించే ‘తెరిచిన’ మనస్సుగల పాఠకులకు నచ్చే రచయిత. ఆయనను చదివి నపుడు తెలియని విషయాలెన్నో తెలుస్తాయి. తెలిసిన విషయాలే మరో రకంగా అర్థమవుతాయి. 


తెలుగు సాహిత్యంలో స్త్రీల హక్కులు, లైంగిక స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం అనే మాటలు వచ్చినప్పుడల్లా గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావు పేర్లే చెప్పుకోవడం రివాజు. ఇకపై ఈ ముగ్గురితోపాటు ధనికొండ హనుమంతరావు పేరు కూడా చేర్చుకోకుండా మాట్లాడడం కుదరదు. ఇన్నేళ్లుగా పాఠకుల దృష్టికి తక్కువగానూ, విమర్శకుల దృష్టికి అసలే రాకుండానూ ఉన్న ధనికొండను ఇప్పటికైనా మనం చదువు కుంటూ, చర్చించుకోవటం చాలా అవసరం. స్త్రీ పురుష సంబంధాలపై ఎన్నో మౌలిక వ్యాఖ్యలు చేసిన రచయితగా, స్త్రీల గురించి ఎంతో నిగూఢంగా ఆలోచించిన రచయితగా, స్త్రీవాదం ఉద్యమంగా రూపుదిద్దుకున్న ఇన్ని దశాబ్దాల తర్వాత నయినా ధనికొండను గురించి మాట్లాడుకోకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేకపోవచ్చుగానీ, మనకే నష్టం. 

మృణాళిని

(ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరం సందర్భంగా)



Updated Date - 2020-02-24T06:58:26+05:30 IST