అయిష్టంగానే ‘ఓటీటీ’కి ధనుష్‌ సమ్మతం

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరమ్‌’. ఈ చిత్రంలో హీరో ధనుష్ తొలిసారి డాన్‌గా నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. అదేస మయంలో ఈ చిత్రం ఈనెల 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో విడుదలకానుంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాది మే నెలలోనే విడుదలకావాల్సివుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ వాయిదాల పరంపర ఈ యేడాది వరకు కొనసాగింది. ఈ సమయంలోనే ధనుష్‌ - మారి సెల్వరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కర్ణన్‌’ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. దీంతో ‘జగమే తందిరమ్‌’ కూడా థియేటర్లలోనే విడుదల చేస్తారనే చిన్న ఆశ ఆయన అభిమానుల్లో ఉండేది. ధనుష్‌ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలన్న పట్టుదలతోనే ఉన్నారు. 

ఇదే విషయాన్ని ఆయన తాజాగా కూడా అంటే.. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల సమయంలోనూ బయటపెట్టారు. థియేటర్లలో విడుదల కావాల్సిన ‘జగమే తందిరమ్‌’ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుందని, అయినప్పటికీ సినీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించి, విజయం చేకూర్చిపెట్టాలంటూ ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ధనుష్‌కు ఏమాత్రం ఇష్టంలేకపోయినా.. నిర్మాత కోరిక మేరకు ఆయన సమ్మతించారన్నది జగమెరిగిన సత్యం. 

Advertisement