దళారులకు విక్రయించి నష్టపోవద్దు

ABN , First Publish Date - 2021-05-12T07:16:00+05:30 IST

జిల్లాలో రబీ సీజన్లో ఇప్పటి వరకు 1.15 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దళారులకు విక్రయించి నష్టపోవద్దు

  • నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
  • జిల్లాలో 1.15 లక్షల టన్నుల సేకరణ
  • జాయింట్‌ కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు ప్రకటన
  • ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

అమలాపురం, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సీజన్లో ఇప్పటి వరకు 1.15 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు శ్రమించి పండించిన ధాన్యం దళారులపాలు కాకుండా తక్కువ ధరకు అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రబీలో ఖరీఫ్‌ ధాన్యం క్వింటాలు గ్రేడ్‌-ఎ రకం రూ.1888, సాధారణ రకం రూ.1868, గ్రేడ్‌-ఎ రకం 75 కిలోల బస్తా రూ.1416, సాధారణ రకం రూ.1401కు అన్ని మండలాల్లో ఏర్పాటుచేసిన 375 ధాన్యం సేకరణ కేందాల్ర ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ’రైతుల శ్రమ దోపిడీ’ పేరిట మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. జిల్లాను ఒక యూనిట్‌గా  తీసుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 86 బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు అనుసంధానం చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 341 కేంద్రాల ద్వారా లక్షా  పదిహేను వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఎంటీయూ-3626 రకం బొండాలు ధాన్యాన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో రైతుల సౌకర్యార్థం 1,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల పేర్లు వంద శాతం నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. 885 రైతుభరోసా కేంద్రాల్లో తేమ కొలిచే యంత్ర పరికరాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. రైతులు కనీస  మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు విక్రయించే అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు  ఎదుర్కొనే సమస్యలపై 8886613611 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామని తెలిపారు.  ధాన్యం నాణ్యతా ప్రమాణాల ప్రకారం 17 శాతం మించకుండా ఆరుదల ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ్ద


Updated Date - 2021-05-12T07:16:00+05:30 IST