ధరణిలోనే దస్తావేజు

ABN , First Publish Date - 2020-10-21T08:33:42+05:30 IST

భూమి క్రయవిక్రయాలకు సంబంధించి కీలకమైన ప్రక్రియ దస్తావేజును సిద్ధం చేసుకోవడం! డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గరకు వెళ్లడం...

ధరణిలోనే దస్తావేజు

డాక్యుమెంట్‌ రైటర్‌ అవసరమే లేదు

పోర్టల్‌లో క్రయవిక్రయాల వివరాల నమోదు

సాక్షుల పేర్లు, వారి ఆధార్‌ ఆన్‌లైన్‌లోనే

నాన్‌జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై ప్రింట్‌ 

ఆన్‌లైన్‌లోనే ఈ-చలాన్‌ .. తర్వాత స్లాట్‌ బుక్‌  

ఆ వెంటనే వివరాలన్నీ తహసీల్దార్‌ లాగిన్‌లోకి 

దస్తావేజుతో కార్యాలయానికి వెళితే రిజిస్ట్రేషన్‌ 

తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో మ్యుటేషన్‌ 

క్రయవిక్రయాల మేరకు ధరణి రికార్డు అప్‌డేట్‌ 

కొనుగోలుదారు ఇంటికి పోస్టులో పాస్‌బుక్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): భూమి క్రయవిక్రయాలకు సంబంధించి కీలకమైన ప్రక్రియ దస్తావేజును సిద్ధం చేసుకోవడం! డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గరకు వెళ్లడం... వివరాలు చెప్పి రాయించడం.. అమ్మకం, కొనుగోలు దార్లకు సంబంధించి ఫొటోలను అతికించడం.. సంతకాలు.. ఇలా అంతా పెద్ద ప్రహసనం!! ధరణి పోర్టల్‌తో ఈ ఇబ్బంది తప్పనుంది. దస్తావేజును రాసేందుకు లేఖరులను, మధ్య దళారులను సంప్రదించాల్సిన పనేలేదు.  ధరణి వెబ్‌సైట్‌లోనే ‘దస్తావేజు’ను సిద్ధం చేసుకోవచ్చు. భూమిని అమ్మేవారు, కొనేవారు తమ వివరాలను పక్కాగా నమోదు చేసుకొని.. స్కాన్‌ చేసిన అఫిడవిట్లను అప్‌లోడ్‌ చేస్తే చాలు దస్తావేజు సిద్ధమవుతుంది. ఆ దస్తావేజును నాన్‌జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై ప్రింట్‌ తీసుకొని నిర్ణీత సమయంలో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళితే... భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. దస్తావేజును ఆన్‌లైన్‌లోనే రూపొందించుకునే వెసులుబాటును ఇప్పటికే తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో ఉండగా... దీన్ని ఉన్నదున్నట్లుగా ధరణి వెబ్‌సైట్‌లోకి బదలాయించారు. మూడురోజులుగా నమూనా రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించిన విషయం విదితమే. దీంతో ఆ వివరాలన్నీ పరిశీలిస్తున్న సిబ్బంది, డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో సిద్ధం చేసుకునే ప్రక్రియ.. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


డాక్యుమెంట్‌ జనరేషన్‌ ఇలా.. 

సిటిజన్‌ లాగిన్‌ను క్లిక్‌ చేయాలి. అం దులో మొబైల్‌ నంబర్‌ను పొందుపరిచి పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. ఆ తర్వాత కింద క్యాప్చాకోడ్‌ను పొందుపర్చగానే సదరు ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ నమోదు చేయాలి.


రెండో దశలో సేల్‌డీడ్‌/పార్టిషన్‌/గి్‌ఫ్ట/సక్సెషన్‌... వీటిలో ఏ తరహా రిజిస్ట్రేషన్‌కు వెళుతున్నారో ఆ వివరాలను క్లిక్‌ చేసుకోవాలి. సేల్‌డీడ్‌ అని రాగానే ఆ తర్వాత భూములు అమ్మే రైతు తన ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌పుస్తకం నంబర్‌ను పొందుపర్చాలి. 


మూడో దశలో పాస్‌పుస్తకంలోని భూ ముల సర్వేనంబర్లు, విస్తీర్ణం వివరా లుంటాయి. ఏ సర్వేనంబరు లో ఎంత భూమిని విక్రయిస్తున్నారో క్లిక్‌ చేయాలి. 


నాలుగో దశలో విక్రయించేవారి వివరాలు(ఆధార్‌ నంబర్‌, పేరు, తండ్రి/తల్లి పేరు, సామాజిక హోదా, వృత్తి, వయసు, లింగం(ఆడ, మగా), పాన్‌నంబర్‌తో పాటు ఇంటి చిరునామా, రాష్ట్రం, మండలం, పిన్‌కోడ్‌, ఈమెయిల్‌ ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి. కొనుగోలుదారులకు సంబంధించిన ఇవే వివరాలనూ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.


ఐదో దశలో విక్రయదారుల పాస్‌బుక్‌, ఆధార్‌, వారి కుటుంబసభ్యుల పేర్లు, ఆధార్‌ వివరాలు, మొబైల్‌ నంబర్లు నమోదు చేయాలి. ఇందులో కొనుగోలుదారులకు సంబంఽధించిన వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు చేర్చాలి. 


ఆరో దశలో అప్పటిదాకా న మోదు చేసిన వివరాలన్నీ సరైనవేనా? కావా? అని నిర్ధారించుకునే వెసులుబాటు ఉంటుంది. సరైనవి కాకపోతే ఎటిట్‌ ఆప్షన్‌ ఉంటుంది.  వివరాలు సరైనవేనని భావిస్తే... ఫీజుల చెల్లింపు దిశగా ముందుకెళ్లాలి. ఆపై రసీదు వస్తుంది. 


ఏడో దశలో చెల్లింపుల సమాచారం వస్తుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, మ్యుటేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, పాస్‌పుస్తకం చార్జీలన్నీ చెల్లిస్తూ ముందుకెళితే ఈ-చలాన్‌ జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత వివరాలన్నీ సరైనవేనని, ముందుకెళితే చాలు... చలాన్‌కు డబ్బులు కట్టేందుకు వివరాలు కనిపిస్తాయి. క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ఆధారంగా ఈ చలాన్‌ కట్టే అవకాశం ఉంటుంది. 


8వ దశలో సిద్ధంగా పెట్టుకున్న నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌, సాక్షుల వివరాలను నమోదు చేయాలి.  


తొమ్మిదో దశలో ఈ-చలాన్‌, లావాదేవీల సమాచారం వస్తుంది. ఆ తర్వాత డాక్యుమెంట్‌ జనరేట్‌ కోసం క్లిక్‌ చేసి, నిర్ధారణ చేసుకోగానే  స్లాట్‌ బుకింగ్‌ వివరాలు కోసం క్లిక్‌ చేయాలి. దానికన్నా ముందే జనరేట్‌ అయిన డాక్యుమెంట్‌ను నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై ప్రింట్‌ తీసుకోవాలి.


ఆ తర్వాతి దశ తహసీల్దార్‌కే 

భూముల క్రయవిక్రయాల కోసం స్టాట్‌ తీసుకున్న తర్వాత వివరాలన్నీ ధరణి ఆపరేటర్‌, తహసీల్దార్‌ లాగిన్‌లోకి వెళతాయి. ఈ క్రమంలో ధరణి ఆపరేటర్ల పని ప్రారంభమవుతుంది. సాక్షుల వివరాలు, ఫొటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఆ తర్వాత తహసీల్దార్‌ స్టాంపు డ్యూటీ, బయోమెట్రిక్‌ వివరాలు, చలాన్‌ రూపేణా కట్టిన నిధులను ప్రభుత్వ ఖజానాలోకి బదలాయించి, రిజిస్ట్రేషన్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం తెలిపిన డాక్యుమెంట్‌ను స్కానింగ్‌ చేస్తారు. రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. కొనుగోలు చేసిన ఖాతాదారు పేరిట వివరాలన్నీ నమోదుచేసి, విక్రయించిన వారి ఖాతాలో నుంచి ఎంత మేర విక్రయించారో ఆ విస్తీర్ణం తగ్గిం చి, ధరణి రికార్డును నవీకరించాలి. ఈ క్రమంలో తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేయగానే మ్యుటేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం కొనుగోలుదారు చిరునామాకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా చేరతాయి. ఈ క్రమంలో సేల్‌డీడ్‌ ను స్కానింగ్‌ చేసి, స్టాంపులు వేసి, సంతకాలు చే సి... రైతు చేతికి ఇచ్చేస్తారు. 

Updated Date - 2020-10-21T08:33:42+05:30 IST