రైతులకు భారంగా మారిన ‘ధరణి’

ABN , First Publish Date - 2021-04-07T05:38:01+05:30 IST

ధరణి విధానం భూస్వాములకు వరంగాను, పేద రైతులకు శాపంగాను మారింది. భూమి సమస్యలన్నింటికీ పరిష్కారంగా తీసుకొచ్చిన ధరణిలో చాలా లోపాలున్నాయి..

రైతులకు భారంగా మారిన ‘ధరణి’

ధరణి విధానం భూస్వాములకు వరంగాను, పేద రైతులకు శాపంగాను మారింది. భూమి సమస్యలన్నింటికీ పరిష్కారంగా తీసుకొచ్చిన ధరణిలో చాలా లోపాలున్నాయి. వీఆర్వోలు వెంటబడి తీసుకున్న సమాచారం ధరణిలో తప్పుల తడకగా మారింది. ధరణికి ముందు అందరికీ తెలిసి రెండు పుస్తకాలుగా ఉండేవి. ఒకటి రైతు పాస్‌ పుస్తకం, రెండవది యాజమాన్య హక్కుల పుస్తకం. ఈ పుస్తకంలో భూమి రకం, భూమి స్వభావం అని స్పష్టంగా రాసి వుండేది. ధరణిలో ఇవేవీ కనపడవు. రైతు పాస్‌ బుక్‌లో వున్న సమాచారం మాత్రమే ధరణిలో వుంటుంది. దీనిలో పహానిలో ‘డి’ కాలమ్ తొలగించారు. స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఉన్న కాలమ్- కౌలుదార్ల కాలమ్. దీన్ని తీసివేసి, తెలంగాణ ప్రభుత్వం కౌలుదార్లని గుర్తించదని బహిరంగంగానే ప్రకటించారు. రైతు ఆత్మహత్యలలో మెజార్టీగా చనిపోతుంది కౌలు రైతులే. అయినా ప్రభుత్వం కౌలు రైతును గుర్తించడం లేదు. రైతు బంధు పథకం భూమి యజమానులకే ఇస్తున్న కారణంగా కౌలు రైతులు చనిపోతున్నారు. 


ధరణి రాకముందు చాలా పనులు మండల పరిధిలోనే అయ్యేవి. చిన్న చిన్న సమస్యల విషయంలో తహశీల్దారుకూ రైతుకూ మధ్య వీఆర్వోలు ఉండేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేసారు. దాంతో భూమి సమస్యలకు సంబంధించి రైతు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైతులు తహశీల్దారుని కలిస్తే, తహశీల్దారులు కలెక్టర్‌ని కలవమంటున్నారు. సామాన్య రైతు కలెక్టరుని కలవటం సాధ్యమయ్యే పనేనా?


ప్రస్తుత పరిస్థితుల్లో తహశీల్దారు కాస్తా జాయింట్‌ రిజిస్ట్రారుగా మారిపోయారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే, తాము రిజిస్ట్రేషన్‌ పనుల్లో బిజీగా ఉన్నామంటూ తప్పించుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే "వెళ్ళి కలెక్టరుగారిని కలవండీ" అని చెపుతున్నారు. లేదా "మీ సేవ"కు వెళ్ళండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. "మీ సేవ" అనేది ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేని లైసెన్సుడు బ్రోకర్ వ్యవస్థ. రైతుల నుంచి డబ్బులు పిండుకోవటానికి ఇదొక ఆదాయ వనరుగా మారింది. ధరణిలో భూమి విస్తీర్ణం ఆప్షన్‌ లేదు, భూమి స్వభావం వివరం లేదు. ఈ కారణంగా రాష్ట్రంలోని ఒక్కో కలెక్టరు దగ్గరా ఆరు నుండీ ఎనిమిది లక్షల వరకు దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.


రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విషయాలలో అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. ధరణి విషయంలో కూడా అదే జరిగింది. రైతుల కష్టాలన్నీ తీరుతాయని చెప్పారు. కానీ ధరణి కారణంగా ఇబ్బందులు మరింత పెరిగాయి. ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వెంటనే ధరణి సర్వీసు ప్రొవైడరుని మార్చాలి. తెలంగాణాలోని ప్రతి ఎకరాకు అద్దుబందులు బిగించాలి. దీని కోసం వ్యవసాయ భూముల సర్వే చేయాలి. తహశీల్దారుల వద్ద నుంచి జాయింటు రిజిస్ట్రార్‌ అధికారాలను తొలగించి, వారు ప్రధానంగా తహశీల్దారు విధులను నిర్వహించేలా చేయాలి. ప్రతి గ్రామానికీ ఒక రెవిన్యూ కార్యదర్శి, లేదా రెవిన్యూ వర్కర్‌... ఇలా ఏదో ఒక పేరుమీద రెవిన్యూ పనుల కోసం ఒక అధికారిని సత్వరం నియమించాలి. ప్రస్తుతం వున్న పహాణి జిరాక్స్‌ కాపీ తీసి, గ్రామ చావిడి వద్ద పేర్లు చదివి, అందులోని తప్పులు తెలుసుకొని కరెక్షన్‌ చేసి తిరిగి కంప్యూటర్లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ జరిగితే తప్ప ధరణి బాగుపడదు.

వి. బాలరాజు

రిటైర్డు తహశీల్దారు

Updated Date - 2021-04-07T05:38:01+05:30 IST