ధరణి పట్టా.. సమస్యల చిట్టా..

ABN , First Publish Date - 2021-11-28T04:24:26+05:30 IST

రెవిన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ధరణి ఆచరణలో అభాసు పాలవుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను కుదించి తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల అధికారాన్ని కట్టబెట్టిన ధరణి వెబ్‌పోర్టల్‌లో లోపభూష్టమైన సమాచారం కారణంగా దరఖాస్తు దారులు నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి.

ధరణి పట్టా.. సమస్యల చిట్టా..

-ఒక్కసారి స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఇక అంతే 

-డబ్బులు రావు, సమస్య పరిష్కారం కాదు

-తప్పుల సవరణకు కలెక్టర్‌కూ అనుమతి ఇవ్వలేదు

-కొలిక్కిరాని ఇళ్లు/ఇళ్ల స్థలాల సమస్య 

-కొత్త ఆప్షన్లు ఇచ్చినా వెబ్‌సైట్‌లో కనబడని సమాచారం

-ఏజెన్సీలో విరాసత్‌కు చిక్కులు అన్నీ ఇన్నీ కావు

ఆసిఫాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెవిన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ధరణి ఆచరణలో అభాసు పాలవుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను కుదించి తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల అధికారాన్ని కట్టబెట్టిన ధరణి వెబ్‌పోర్టల్‌లో లోపభూష్టమైన సమాచారం కారణంగా దరఖాస్తు దారులు నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి. రిజిస్ట్రేషన్ల కాలయాపన బాదరబంది తగ్గిన సవరణలు, మార్పులు, వారసత్వ హక్కులు, స్లాట్‌ రద్దు వంటి అంశాల విషయంలో వెబ్‌సైట్‌లో ఎలాంటి ఆప్షన్లు ఇవ్వక పోవడం రైతులు, ఇతర దరఖాస్తుదారులకు శాపంగా మారింది. ఫలితంగా నెలలు, వారాల తరబడి మునుపటి లాగే తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 15మండలాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ధరణి ప్రారంభించడానికి జిల్లాలో భూముల సమగ్ర సర్వే, రికార్డుల వడపోత, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండానే అరకొర సమాచారాన్ని వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. దీని ఫలితమే తాజాగా జిల్లాలో సమస్యలను సృష్టిస్తోందన్నది అధికారుల అభిప్రాయం. ఇది కేవలం ఒక్క కుమరం భీం జిల్లాకే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ధరణి సమస్యలపై పెద్దఎత్తున దుమారం రేగడంతో ప్రభుత్వం ఆదర, బాదరగా సమీక్షలు నిర్వహించి కొత్త ఆప్షన్లు ఇస్తున్నట్టు ప్రకటించినా అవి ఇంకా అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా వివిధ సమస్యలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు అధికారుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. 

ఆరంభం నుంచి ఇదే తంతు..

రిజిస్ట్రేషన్‌ అధికారులను మండలస్థాయిలో తహసీల్దార్లకు కట్టబెడుతు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ధరణి వెబ్‌పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇతర కార్యకలపాలను చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2020 అక్టోబరు 28న ధరణి సేవలను ప్రారంభిస్తున్నట్టు జీవో జారీచేసింది. నాటి నుంచి నేటివరకు ధరణి ద్వారా కార్యకలపాలు జరుగుతున్నా రిజిస్ట్రేషన్‌ కార్యకలపాలతో పోలిస్తే అంతంత మాత్రమే. ధరణి ప్రారంభించి ఏడాది కాలం పూర్తైనా ఇప్పటి వరకు భూములకు సంబంధించి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకున్న పరిస్థితి కన్పించడం లేదు. తెలంగాణ జిల్లాల్లో వివిధ రకాల భూములకు సంబంధించి సాంకేతికంగా ఇవ్వాల్సిన ఆప్షన్లు వెబ్‌సైట్‌లో ఇవ్వక పోవడం వల్ల స్లాట్‌ బుకింగ్‌ వరకు అంతా సవ్యంగా కన్పించినా ఆ తర్వాతే సమస్యలు మొదలువుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూముల బదలాయింపులో ధరణిలో ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. ఏజేన్సీ ప్రాంతంలో కేవలం గిరిజనులే కాకుండా శతాబ్ధాలుగా నివాసం ఉంటున్న గిరిజనేతరులకు సంబంధించిన ఆస్తులు వారసులకు బదలాయించే ప్రక్రియకు ఎలాంటి ఆప్షన్‌ లేక పోవడంతో విరాసత్‌ల ప్రక్రియ స్తంభించింది. అలాగే స్లాట్‌బుకింగ్‌ సందర్భంగా చిన్న చిన్న తప్పులు దొర్లితే దానిని సరి చేసుకునే అవకాశం పోయింది. ఇందుకు సంబంధించి తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్లకు కూడా ఎలాంటి అధికారులు లేక పోవడంతో ధరణి సమస్యల చిట్టా కొండలా పేరుకు పోతున్నట్టు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అలాగే సమగ్ర భూ సర్వే సందర్భంగా అప్పట్లో కార్యదర్శులు మొక్కుబడిగా చేసిన రికార్డుల తనిఖీ కారణంగా పార్టు బిలో చేర్చిన భూముల వివరాలు ధరణిలో చూపకపోవడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. ధరణిలో ఆయా భూముల సమాచారం కన్పించకపోవడంతో వాస్తవ పట్టేదారులు అనుభవదారుల మధ్య సంఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ధరణి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 

కొత్త ఆప్షన్లు ఇచ్చినా అదే సమస్య..

ధరణిలో సైట్‌లో కొత్తగా ఆప్షన్లు ఇచ్చినా సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. గత నెల 12న ధరణిలో పట్టేదారు కాలంలో ఇళ్లు/ఇళ్ల స్థలాల తప్పులుంటే సవరణ చేసుకోవాలని ప్రత్యేక ఆప్షన్‌ ఇచ్చింది. ఈ ఆప్షన్లలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేకంగా రుసుము కూడా కట్టారు. అయితే మీ సేవా నుంచి దరఖాస్తులు చేసుకున్న తర్వాత సీసీఎల్‌ఎ విభాగం అనుమతి పొందిన తర్వాత నేరుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలకు పంపించి ఆమోదించేందుకు వీలుంటుంది. ఈ ప్రక్రియ ఆశయం బాగానే ఉన్నప్పటికీ దరఖాస్తుదారులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. మీ సేవలో వెళ్లి అడిగితే కలెక్టర్‌ అనుమతి ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల్లో వాకాబు చేస్తే తమ లాగిన్‌లో ఆప్షన్‌ లేదనే సమాధానం వస్తుండటంతో అర్జిదారులు ఖంగుతింటున్నారు. అటు పనికాక, ఇటు డబ్బులు వస్తాయో రావో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే తరహాలో ఏజెన్సీ ల్యాండ్స్‌ సమస్యల పరిస్థితి కూడా ఉంది. 

ధరణి పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత ఉత్పన్నవుతున్న సమస్యలు..

-ధరణిలో పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం, మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ మాత్రం చిన్నపాటి తప్పులు దొర్లినా వాటిని సవరించుకునేందుకు ఎలాంటి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. 

-మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తులోని అంశాలే ఫైనల్‌, ఎలాంటి మార్పులుచేర్పులు కావాలన్నా సీసీఎల్‌ఎ ఆప్షన్‌ ఇస్తే సాధ్యమయ్యే పరిస్థితి లేదు

-భూమి రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక వేళ చనిపోతే ఆ దరఖాస్తు పెండింగ్‌లో ఉంచి అతని వారసులు తాజాగా రుసుము చెల్లిస్తేనే మళ్లీ స్లాట్‌ బుక్‌ అవుతుంది.

-ఇందుకు ప్రత్యామ్నాయ ఆప్షన్‌ ఇవ్వక పోవడం ఇబ్బందిగా మారింది. 

-ఒక్కసారి ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకొని మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే రద్దు చేసుకునే ఆప్షన్‌ లేదు

-పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదయితే సవరణకు అవకాశం లేదు.

-ఏజెన్సీ ఏరియాలో పట్టా మార్పు(గిరిజనేతరుల)కు ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు.

-ఏజెన్సీ ఏరియాలో విరాసత్‌ అవకాశం ఇవ్వలేదు.

-రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవాలంటే మీ సేవలో దరఖాస్తు చేసుకొని బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయించుకునే అవకాశం కల్పించినప్పటికీ డబ్బులు తిరిగి ఎప్పుడు చెల్లిస్తారన్నది సమాచారం లేదు. 

ధరణితో సమస్యలే అధికంగా ఉన్నాయి..

-ఎల్ముల వెంకయ్య, కాగజ్‌నగర్‌ 

ధరణిలో సైట్‌లో సమస్యలే అధికంగా ఉన్నాయి. గతంలో చిన్నపాటి సమస్యలు తహసీల్దార్‌ కార్యాలయంలోనే పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. మీ సేవలో దరఖాస్తులు చేసుకున్న తర్వాత సీసీఎల్‌ఎ పరిశీలన, కలెక్టర్‌ పరిశీలన, తహసీల్దార్‌ అనుమతి ప్రక్రియ పూర్తి అయితే సమస్య కొలిక్కి వస్తుంది. ఏజేన్సీ ఏరియాలో భూముల సమస్యలు ఇంకా కొలిక్కి రావడం లేదు. కనీసం విరాసత్‌ కూడా ఇవ్వడం లేదు. కొత్త ఆప్షన్లు ఇచ్చినా కూడా ఇదే పరిస్థితి. 

Updated Date - 2021-11-28T04:24:26+05:30 IST