Abn logo
Oct 28 2020 @ 00:14AM

రెవెన్యూ పాలనలో ‘ధరణి’ విప్లవం

Kaakateeya

ప్రస్తుతం ఉన్న భూరికార్డులన్నీ సామాన్యుడికి ఒక పజిల్ లాంటివి. అవినీతి, విచ్చలవిడితనం వల్ల రెవెన్యూ రికార్డులను ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థంలా మార్చేశారు. భూచట్టాలు ఎన్ని ఉన్నా పేదలు, సామాన్య జనాలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూకష్టాలు తొలగించాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ అవినీతికి తావివ్వని సరళమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు. విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఐటీని, రెవెన్యూను అనుసంధానించి ధరణి పోర్టల్‌ను రూపొందించారు.


నాటి ద్వాపరయుగం నుంచి నేటి కలియుగం వరకు ఈ ధరణిపై గుత్తాధిపత్యం కోసం ఎన్నో మారణ హోమాలు జరిగాయి. ద్వాపరయుగంలో పాండవ కౌరవ కురుక్షేత్ర యుద్ధం నుంచి, నేటి కలియుగంలో ప్రపంచ యుద్ధాలు, దాయాది దేశాల మధ్య యుద్ధాల వరకు జరిగినవన్నీ ధరణిపై గుత్తాధిపత్యం కోసమే. పంచభూతాల్లో ఒకటైన నేలపై ఆధిపత్యం అన్నింటికన్నా గొప్ప ఆధిపత్యమని భావించడమే ఈ యుద్ధాలకు పునాది. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా భూమి అనేది ప్రధాన వనరు. అలాంటి భూమికి సంబంధించి పటిష్టమైన చట్టాలు నేటికీ లేకపోవడం గత పాలకుల్లో చిత్తశుద్ధిలేమికి అద్దం పడుతుంది. నేడు మన దేశంలో జరిగే మరణాలలో అత్యధికం రోడ్డు ప్రమాదాలైతే, ఆస్తి తగాదాలతో జరిగే హత్యలు, ఆత్మహత్యలు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. వీటికి చరమగీతం పలకడం కోసమే ఉన్న చట్టాలను పునర్వ్యవస్థీరించి ఎటువంటి సమస్యలు లేకుండా పారదర్శకతతో ప్రజల జీవితాలను గుణాత్మక అభివృద్ధి దిశలో నడిపే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేత, విప్లవాత్మక నిర్ణయం రెవెన్యూ చట్ట ప్రక్షాళన. అందులో భాగమే ‘ధరణి’ పోర్టల్.


నిన్నటి వరకు భూ కబ్జాలు, అక్రమ కేసులు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, భూ సంబంధ హత్యలతో రక్తపు మరకలతో అల్లాడిన తెలంగాణ ధరణిని కొత్త రెవెన్యూ చట్టంతో పాప ప్రక్షాళన చేయడంతోపాటు బీడు భూములతో బోసిపోయిన ఈ రాష్ట్ర పుడమిని కాళేశ్వరం నీటితో తడిపి పునీతం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజల ముఖ్యమంత్రి కేసీఆర్. నాదంటే నాదని భూమాతకు సంకెళ్లు బిగించి కోర్టుల చుట్టూ తిప్పే రోజులకు స్వస్తి పలుకుతూ ప్రజలకు అనుకూలమైన పటిష్టమైన రీతిలో రూపొందించినదే ఈ ధరణి. 


తెలంగాణలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఒక కోటి అరవై లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా, దాదాపు అరవై ఏడు లక్షల ఎకరాలు అటవీ భూమి. మిగిలినది ప్రభుత్వ భూమిగానో, గ్రామ కంఠాలు, పట్టణాల కింద ప్రజా ఉమ్మడి ఆస్తులగానో నమోదై ఉంది. ప్రస్తుతం ఉన్న భూరికార్డులన్నీ సామాన్యుడికి ఒక పజిల్ లాంటివి. అవినీతి, విచ్చలవిడితనం వల్ల రెవెన్యూ రికార్డులను ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థంలా మార్చేశారు. భూచట్టాలు ఎన్ని ఉన్నా పేదలు, సామాన్య జనాలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూకష్టాలు తొలగించాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ అవినీతికి తావివ్వని సరళమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు. విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఐటీని, రెవెన్యూను అనుసంధానించి ధరణి పోర్టల్‌ను రూపొందించారు.


కేంద్రం పరి‌ధిలోని భూచ‌ట్టాలు మినహా రాష్ట్ర చట్టాల పరిధిలోని అంశా‌లన్నింటినీ ఇది పరిష్కరిస్తుంది. వ్యవ‌సాయ, వ్యవసా‌యే‌తర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్ట‌ల్‌లో నమోదు కాను‌న్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్ట‌ల్‌లో నమోదవుతాయి. తద్వారా భవిష్యత్తులో క్రయవిక్రయాలు సుల‌భంగా జరు‌గు‌తాయి. అంతేగాక వ్యవసాయే‌తర ఆస్తులు, కుటుంబ వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటే పంప‌కాల సమ‌యంలో ఎలాంటి గొడ‌వ‌లకు ఆస్కారం ఉండదు. కుటుంబం ఇచ్చే డిక్లరేషన్‌తో పంప‌కాలు సులు‌వుగా జరు‌గు‌తాయి. తద్వారా ఆ ఆస్తికి ప్రభుత్వం రక్ష‌ణగా ఉంటుంది. రికా‌ర్డు‌లన్నీ డిజి‌టైజ్‌ కావ‌డంతో తప్పుడు డాక్యు‌మెంట్లు సృష్టించే అవ‌కాశం ఉండదు. కులం వివ‌రాలు సేక‌రిం‌చడం ద్వారా సామా‌జిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభు‌త్వానికి స్పష్టత ఉంటుంది. సబ్సి‌డీలు వంటివి ఏ ఇంటికి చేరు‌తు‌న్నాయో తెలు‌స్తుంది. కరెంటు, నల్లా కనె‌క్షన్ల వివ‌రాలు తెలు‌సు‌కో‌వడం ద్వారా కనె‌క్షన్లు లేనివారికి వాటినందించే వీలుంటుంది. గృహ అవ‌స‌రాల కోసం అను‌మతి తీసు‌కొని వాణిజ్యపరంగా వాడటం వంటి అక్రమాలు, నిబం‌ధ‌న‌లకు విరు‌ద్ధంగా జరిపిన నిర్మా‌ణాల వివరాలు బయ‌ట‌ప‌డుతాయి. ఏ గ్రామం, ఏ ప‌ట్టణంలో అవ‌స‌రాలు ఎంత, భవి‌ష్యత్తులో ఎంత అవ‌సర పడొచ్చు– వంటి వివరాలపై ఓ అంచనా వస్తుంది. దానికి అను‌గు‌ణంగా వస‌తుల కల్పన జరు‌గు‌తుంది.


ఇలా ఒకే చోటకు, ఒకే గొడుగు కిందకు భూ సంబంధ శాఖలన్నీ రావడంతో పాటు ధరణి వేదికగా భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌లు, టైటిల్ జారీ చేయడం జరుగుతాయి. పేదలకు ఆస్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుని, వారి చేతి బ్రహ్మాస్త్రంగా ధరణిని తీర్చిదిద్దడమే కేసీఆర్‌ అభిమతం. ‘ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల కోసం కాదు, ఐదు తరాల అభివృద్ధి కోసమే నా తాపత్రయం’ అనే కేసీఆర్‌ మాటలకు, ఆయన చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా రెవెన్యూ సంస్కరణలు, ధరణి వంటివే అసలైన నిదర్శనాలు. ఈ ధరణి పేదోడి బ్రహ్మాస్త్రం కాబోతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచి మన తెలంగాణ గౌరవాన్ని నలుదిశలా చాటబోతోంది.

కాసర్ల నాగేందర్ రెడ్డి

అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా

Advertisement
Advertisement