సన్నద్ధత లేకుండానే ధరణి

ABN , First Publish Date - 2021-10-19T08:00:45+05:30 IST

పూర్తిస్థాయి సన్నద్ధత లేకుండా ధరణి పోర్టల్‌ను ప్రారంభించడం వల్లే ప్రతిసారీ సాంకేతిక సమస్యలు వస్తున్నాయని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

సన్నద్ధత లేకుండానే ధరణి

  • అందుకే పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు 
  • ధరణిపై వివరణ ఇవ్వండి: హైకోర్టు ప్రభుత్వానికి బెంచి నోటీసులు


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయి సన్నద్ధత లేకుండా ధరణి పోర్టల్‌ను ప్రారంభించడం వల్లే ప్రతిసారీ సాంకేతిక సమస్యలు వస్తున్నాయని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ధరణిలో సాంకేతిక సమస్యల వల్ల రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతున్నారంటూ న్యాయవాది ఇంద్ర ప్రకాశ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై సీజే సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. సాంకేతిక సమస్యల వల్ల భూము ల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. పాత పద్ధతిలో ప్రభు త్వం భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపేయడం వల్ల రైతులు, సామాన్యులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. 


పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసే విధానాన్ని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సాంకేతిక సమస్యలు, పూర్తిస్థాయిలో వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది రైతుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, స్థోమత ఉన్న వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. తక్కినవారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ధరణి సాంకేతిక సమస్యలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి నోటీసులు జారీచేసింది. పూర్తిస్థాయి సన్నద్ధత, మౌలిక సదుపాయాల కల్పన లేకుండా ధరణి ప్రాజెక్టును అమలులోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించింది. విచారణను వచ్చేనెల 22కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-10-19T08:00:45+05:30 IST