ధర్మ సంస్థాపనార్థాయ...

ABN , First Publish Date - 2021-01-17T05:49:38+05:30 IST

అమెరికాలో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వగైరాలు పటిష్ఠంగా ఉన్నాయి. కనుక మీడియా సైతం లొంగుబాటుకు నిరాకరించింది....

ధర్మ సంస్థాపనార్థాయ...

అమెరికాలో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వగైరాలు పటిష్ఠంగా ఉన్నాయి. కనుక మీడియా సైతం లొంగుబాటుకు నిరాకరించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటలు సాగలేదు. కానీ, అవి బలహీనంగా ఉన్న చాలా దేశాల్లో నియంతలు రాజ్యాన్ని వీరభోజ్యం చేసుకున్నారు. పౌరుల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా బాధ్యతగా మెలగడం నేర్చుకోనివారు ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన పరాభవం నుంచి పాఠం నేర్చుకోగలిగితే అది ప్రపంచంలో ప్రజాస్వామ్యం బలపడడానికి దోహదపడుతుంది. ‘‘సమాజంలో విద్వేషాలు పెంచి పోషించడం, అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధం కావడం, తప్పుడు సమాచారంతో ప్రత్యర్థులను అధిగమించాలనుకోవడం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులలో ఇప్పుడొక ధోరణిగా మారింది’’.... ఆణిముత్యాల వంటి ఈ వ్యాఖ్యలను కొద్దిరోజుల కిందట ఒక మిత్రుడు నాకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఈ సుభాషితాలు సరిపోవచ్చన్నది ఆయన భావన. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సొంత పత్రికలో ఈ మధ్య రాసిన సంపాదకీయంలో ఈ సూక్తులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురించి రాసిన ఈ సంపాదకీయం, జగన్‌రెడ్డికి కూడా వర్తించేలా ఉండడమే ఇక్కడ గమనార్హం. జగన్‌కు చెప్పి రాశారో, చెప్పకుండా రాశారో గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించిన ఎత్తుగడలు, వ్యవహరిస్తున్న తీరును సదరు సంపాదకీయం ఎత్తిపొడుస్తున్నట్టు ఉంది. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థలు బలహీనపడిపోయాయి. దీంతో ఒకటీ అరా మీడియా సంస్థలు మినహాయిస్తే మిగతా మీడియా అంతా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి దాసోహమైపోయింది. ఫలితంగా పై నుంచి కిందిస్థాయి వరకు అధికారపార్టీ పెద్దలు, నాయకులు ‘రాజ్యం వీరభోజ్యం’ అని భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాల మధ్య విద్వేషాలను పెంచి పోషించారు. జగన్‌రెడ్డికి ఇష్టం లేని ఆ కులంపై మిగతా కులాల వారిలో వ్యతిరేకత ఏర్పడేలా చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై విషప్రచారం చేయించారు. ఈ విధంగా అధికారం కోసం అన్నిరకాలుగా గడ్డి కరిచి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కులాల మధ్య విద్వేషాలను పెంచి పోషిస్తున్నారు. ఆ కులాన్నే దోషిగా చూపించి రాజధాని అమరావతిని చంపేశారు. మందబలంతో శాసనవ్యవస్థను నిస్సహాయంగా మార్చేశారు. పంటికింద రాయిలా మారిన శాసన మండలిని ఏకంగా రద్దు చేయడానికి పూనుకున్నారు. పాలనాయంత్రాంగాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వీర్యం చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులను సైతం బానిసలుగా మార్చిపడేశారు. రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ అంటే ఏమిటో తెలియకుండా చేశారు. తమ అధికారానికి లొంగని న్యూస్‌ చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నారు. తమ దారిలోకి రాని పత్రికలకు వ్యాపార ప్రకటనల జారీని నిషేధించారు. ఇలాంటి పద్ధతులు నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎడారిలో ఒయాసిస్సులా న్యాయవ్యవస్థ ప్రభుత్వ బాధితులకు ఉపశమనం కలిగిస్తూ వచ్చింది. న్యాయవ్యవస్థ బలంగా ఉంటే పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం కుదరదు గనుక ఏకంగా ప్రధాన న్యాయమూర్తి పైన ఫిర్యాదు చేసి ఆయన బదిలీకి కారణమయ్యారు. దీంతో ఆ వ్యవస్థలో కుదుపు ఏర్పడింది. నియంతలు ఇలాగే కోరుకుంటారని జగన్‌ పత్రికే తన సంపాదకీయంలో సెలవిచ్చింది గనుక, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా ఆ బాటనే ఎంచుకున్నారు.


యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం QR Code scan చేయండి


కులం రొచ్చు.. మతం ఉచ్చు

ఈ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో కులాల రొచ్చుతో పాటు మతాల రొచ్చు కూడా వచ్చి చేరింది. ‘నీవు నీర్పిన విద్యనే నీరజాక్షా’ అన్నట్టుగా రాష్ట్రంలో మతపరమైన వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రస్తుత ప్రతిపక్షం విమర్శించడం మొదలుపెట్టింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవ మతానికే చెందిన వారైనందున హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది విమర్శలు చేశారు. ఇది సహజం. పెట్టనమ్మ ఎటూ పెట్టదు రోజూ పెట్టే అమ్మకు ఏమొచ్చింది? అన్నట్టుగా ఇలాంటి విమర్శలు, ఆరోపణలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి చేసినప్పుడు పట్టించుకోని వారు కూడా ఇప్పుడు చంద్రబాబును తప్పుపట్టారు. 35 ఏళ్ల నా సర్వీసులో ఇలాంటి విమర్శలను వినలేదని డీజీపీ గౌతం సవాంగ్‌ నొచ్చుకున్నారు. పోలీసు శాఖలో ఫలానా కులం వారికే డీఎస్పీ ప్రమోషన్లలో ప్రాధాన్యత ఇచ్చారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఒక్కరు కూడా అదేమిటని అనలేదు. ‘మాది ఖాకీ కులం’ అని పోలీసు అధికారుల సంఘం, ఐపీఎస్‌ అధికారుల సంఘం ఇప్పటిలా అప్పుడు అనలేకపోయిందెందుకో! రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ప్రకటించిన వైసీపీ నాయకులు అప్పట్లో తెలంగాణ పోలీసులను ఆశ్రయించడం సదరు సంఘాలకు తప్పుగా అనిపించలేదు ఎందుకో? వ్యవస్థలు బలహీనపడిపోతే ఇలాగే ఉంటుంది. ఉద్యోగులు, పోలీసుల ప్రయోజనాలను కాపాడాల్సిన ఆయా సంఘాలు తమ బాధ్యతలను విస్మరించి ప్రభుత్వ ేసవలో తరించిపోతుంటాయి. 


స్థానికంపై సమరం...

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం. స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం అనేక మలుపులు తిరిగి వ్యక్తుల మధ్య ఘర్షణగా మారింది. ఉభయ పక్షాల మధ్య పంతాలూ పట్టింపులూ పెరిగిపోయి వాస్తవాలు మరుగునపడిపోయాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ఏమాత్రం వెరపులేకుండా ఆయనకు కులాన్ని ఆపాదించారు. ఎన్నికలు వాయిదాపడినప్పుడు కరోనా లేదు గీరోనా లేదు అన్నవాళ్లు ఇప్పుడు కరోనా తగ్గుతున్న దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఎన్నికల కమిషన్‌ అంటే, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలా? అని నిలదీస్తున్నారు. మొత్తం జనాభాలో రెండు మూడు శాతం మందికి ఇస్తున్న వ్యాక్సిన్‌ను సాకుగా చూపి ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసింది. ఉద్యోగ సంఘాల నాయకులుగా చలామణి అవుతున్న వారు కూడా ‘మా ప్రాణాలతో చెలగాటమాడతారా?’ అని ఎన్నికల కమిషనర్‌ను తిట్టిపోశారు. తెలంగాణలో కరోనా ఉన్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరిపిన విషయం మర్చిపోయి విమర్శలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది ఎవరికీ కరోనా వైరస్‌ సోకిన దాఖలాలు రిపోర్టు కాకపోవడం గమనార్హం. మొత్తానికి వివాదం అటుతిరిగీ ఇటుతిరిగీ హైకోర్టుకు చేరడం, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలిపివేయడం జరిగింది. ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ మంత్రులు పోటీపడి మరీ ప్రకటనలు చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో పలు తీర్పులు వచ్చాయి. మరి అప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజీనామా చేయలేదే? ఎన్నికల కమిషన్‌ చేసుకున్న అప్పీల్‌పై హైకోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఒక్కటి మాత్రం నిజం. రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత కాలం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు. న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ జరిగేది ఇదే. ‘ప్రభుత్వాలే సుప్రీం. మిగతా రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ ప్రభుత్వ సుప్రిమసీని అంగీకరించాలి’ అని ప్రస్తుత పాలకులు కోరుకుంటున్నారు. ఈ ధోరణి కారణంగానే ప్రభుత్వాలకూ, రాజ్యాంగబద్ధ సంస్థలకు మధ్య తరచుగా ఘర్షణ ఏర్పడుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులను ఆదుకోవలసిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పదేపదే సూచించినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖాతరు చేయలేదు. పెట్టినా కొట్టినా ప్రభుత్వమే చేయాలిగానీ, మధ్యలో హైకోర్టు పెత్తనం ఏమిటన్న ధోరణి వల్లనే కేసీఆర్‌ కార్మికుల సమ్మె ముగిశాక, వారు అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు తనకు అధికారం కట్టబెడితే... మధ్యలో ఇలా చెయ్యి, ఇలా చెయ్యవద్దు అని అనడానికి మీరెవరు? అని జగన్‌ భావిస్తున్నట్టున్నారు.



‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీరు నియమితులయ్యేలా చూస్తాం! అయితే మీరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్‌ సూచనలకు అనుగుణంగా నడుచుకోవలసి వస్తుంది’ అని కేరళకు చెందిన ఒక న్యాయమూర్తికి వైసీపీ నాయకులు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. దళితవర్గానికి చెందిన ఆ న్యాయమూర్తి వైసీపీ నాయకుల ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘నేను నా మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటాను’ అని వారికి ముఖం మీదే చెప్పారు. దళితుల నిబద్ధత, నిజాయితీ విషయంలో దురభిప్రాయం ఉన్నవాళ్లు... ఇక్కడ పేర్కొన్న న్యాయమూర్తి ముక్కుసూటితనాన్ని చూసిన తర్వాతైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఈ ఉదంతాన్ని బట్టి న్యాయ వ్యవస్థను కూడా తమ దారిలోకి తెచ్చుకోవడానికి జగన్‌ అండ్‌ కో ప్రయత్నించినట్టు అర్థమవుతోంది. మరి ఆ పత్రికలో ప్రచురించిన సంపాదకీయంలోని సుభాషితాలు ట్రంప్‌కు మాత్రమే వర్తిస్తాయా? జగన్‌రెడ్డికి వర్తించవా? ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నీ సిల్లీ ప్రశ్నలుగా కనిపిస్తాయి. అవును, అధికారంలో ఉన్నవారు రాజ్యం వీరభోజ్యం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నో పరిమితులు, కట్టుబాట్లు ఉంటాయని గుర్తించడానికి సైతం పాలకులు నిరాకరిస్తున్నారు. ఈ కారణంగానే న్యాయ వ్యవస్థను సైతం టార్గెట్‌గా ఎంచుకున్నారు. ‘పౌరుల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది’ అని జగన్‌ సొంత పత్రిక చెప్పుకొచ్చింది కనుక, తాము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం తేల్చుకోవాలి. అయితే పౌరులు ఎక్కడ అప్రమత్తమవుతారోనని సోషల్‌ మీడియాను కూడా కట్టడి చేయడానికి పూనుకున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పరిస్థితులలో పాలకులు నియంతలుగా ముద్రపడకుండా ఎలా ఉంటారు?


సరికొత్త ఓటుబ్యాంకు రాజకీయం

నిజానికి కులమతాలు కూడు పెట్టవు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే ఉన్న కుల వైషమ్యాలను మరింత రగిలించడం వల్ల జగన్‌రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి పదవి లభించింది. ఇదేదో మంచి చిట్కానే అనుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే బాటలో మతం కార్డును వాడుతున్నట్టు అనిపిస్తోంది. రాష్ట్రంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నది అందరూ అంగీకరించే అంశమే. అయితే, ఇప్పటివరకు ఈ అంశం రాజకీయపార్టీల ఎజెండాలో లేదు. ఇప్పుడు ఇది కూడా రాజకీయపార్టీల ఎజెండాలో చేరిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులు ఓటు బ్యాంకుగా మారిపోయారు. వారంతా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మద్దతుదారులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారిపోయింది. హిందువుల ఓట్లకోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పోటీపడుతున్నాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి... హిందువులంతా సంఘటితమైతే తన అధికారాన్ని క్రైస్తవులు మాత్రమే కాపాడలేరని గ్రహించి నుదుట నామాలు పెట్టుకొని, పట్టువస్ర్తాలు కట్టుకుని అసలు సిసలైన హిందువుగా శుక్రవారంనాడు గోపూజ కూడా నిర్వహించారు. వేషం మార్చినంత మాత్రాన మతం మారిపోదు. మారిపోవాల్సిన అవసరం కూడా లేదు. దేవాలయాలలో జరుగుతున్న విధ్వంసంవల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని గ్రహించిన జగన్‌రెడ్డి నోరు విప్పారు. దాడులు చేస్తున్న వారే దేవాలయాల పరిరక్షణ అంటూ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై గెరిల్లా తరహా యుద్ధం చేస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. శాసనసభలో 151 మంది బలంతో తిరుగులేని అధికారాన్ని సంపాదించుకున్న జగన్‌రెడ్డిపై ఎవరైనా గెరిల్లా తరహా యుద్ధం మాత్రమే చేయాలి. నేరుగా తలపడ్డానికి ప్రతిపక్షాలకు ఉన్న బలం సరిపోదు కదా! దీనికితోడు నిర్వీర్యమైపోయిన వివిధ పాలనావ్యవస్థలు పాలకుడి వద్ద పాలేర్లుగా మారిపోయినప్పుడు ముఖాముఖీ యుద్ధం చేసి ఎవరు మాత్రం నిలవగలరు? డీజీపీ గౌతం సవాంగ్‌ ఒక్కరోజు వ్యవధిలో చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు చూసిన తర్వాత రాష్ట్రంలో పోలీసుశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం కావడం లేదా? పోలీసు శాఖపై ప్రజలకు గతంలోనే విశ్వాసం సన్నగిల్లింది. ఇప్పుడు డీజీపీనే ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం వల్ల పోలీసులను ప్రజలు ఇకపై విశ్వసించరు. ఈ కారణంగానే నేరస్థులు సులువుగా తప్పించుకుంటారు. దేవాలయాల్లో విధ్వంసానికి పాల్పడినది ఎవరు? అన్నది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతోంది. అధికారులు అంతరాత్మను చంపుకొంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన పత్రిక ద్వారా చెప్పించారు కనుక, ఆయన నిజంగా రాష్ట్రంలో కూడా అలాంటి పటిష్ఠమైన వ్యవస్థలే ఉండాలని కోరుకుంటున్నారేమో అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఒక ప్రయత్నం చేసి చూడండి! చెప్పేటందుకే నీతులు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే, కొద్దోగొప్పో మిగిలి ఉన్న వెన్నెముకను కూడా మరింత విరిచేసుకొని ఊడిగం చేసుకోండి. అయినా, గత జన్మలో మహాత్మా గాంధీగా, గౌతమ బుద్ధుడిగా, ఈ జన్మలో సాక్షాత్తూ దైవంగా కీర్తించబడుతున్న జగన్‌రెడ్డికి వ్యవస్థలను కాపాడాలి అన్న విషయం తెలియకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అన్నారుగా! దైవస్వరూపంగా మన మధ్య జన్మించిన జగన్మోహన్‌ రెడ్డికి ఇలాంటి స్వల్ప, అల్ప విషయాలను మనం గుర్తుచేయాలా?

ఆర్కే

Updated Date - 2021-01-17T05:49:38+05:30 IST