ధర్మ ఉషోదయం...

ABN , First Publish Date - 2021-01-08T06:09:51+05:30 IST

బౌద్ధం పుట్టింది ఉత్తర భారతదేశంలోనైనా అది విస్తరించింది తెలుగు నేల మీద. విశ్వవ్యాప్తం అయింది కూడా తెలుగు నదీ తీరాల

ధర్మ ఉషోదయం...

బౌద్ధం పుట్టింది ఉత్తర భారతదేశంలోనైనా అది విస్తరించింది తెలుగు నేల మీద. విశ్వవ్యాప్తం అయింది కూడా తెలుగు నదీ తీరాల నుంచే! తెలుగు నేలమీద, ముఖ్యంగా కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతం బౌద్ధ విహారాల కాణాచి. ప్రతి ఆరు చదరపు కిలోమీటర్లకూ ఒక బౌద్ధారామం ఉందని చరిత్రకారులు తేల్చారు. ఈ ఆరామాలలో విశాఖపట్నం సమీపాన, అనకాపల్లిని ఆనుకొని... శారదా నదీతీరాన ఉన్న బొజ్జన్న కొండ ఒకటి.


బౌద్ధం ప్రకృతిని కాపాడింది. పాడి పంటలను అభివృద్ధి చేసింది. తెలుగు నేల నుంచి చైనా, థాయిలాండ్‌, బర్మా ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన భిక్షువులు ఆయా దేశాలలోని కొత్త కొత్త వ్యవసాయ వంగడాలను తెచ్చారు. ఇక్కడి వంగడాలను అక్కడకు చేర్చారు. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి బుద్ధుడి కాలంలో చెరుకు పంటను విశేషంగా పండించేవారని తెలుస్తోంది.

చెరుకు రసాన్ని తీసి, బెల్లం, చక్కెరను తయారు చేసే యంత్రాలు ఉన్నట్టు చాలా బౌద్ధ జాతక కథల్లో ఉంది. నూతన వ్యవసాయక విప్లవానికి బౌద్ధం చేసిన కృషినీ, చూపిన చొరవనూ చరిత్ర లిఖించింది. దీనికి ఈనాటికీ మిగిలిన సాక్ష్యం బొజ్జన్న కొండ. ఆ పరిసర ప్రాంతాలు నేటికీ బెల్లం పరిశ్రమకు పట్టుకొమ్మలే. 


శాతవాహన రాజైన లంబోదరుడు ఈ బౌద్ధారామాన్ని నిర్మించినట్టు చెబుతారు. ఇవి జంట కొండలు. తూర్పు కొండ మీద ఆరామం, భిక్షువుల శిక్షణ కేంద్రం ఉన్నాయి. పశ్చిమాన ఉన్న కొండపై ఎన్నో స్తూపాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో హాలీవుడ్‌ చిత్రం సెట్టింగుల్లా కనిపిస్తాయి. కొన్ని వందల స్తూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం ఏమిటంటే... ఉత్తరాదిలోని బౌద్ధ క్షేత్రాల వద్ద జాతరలు జరుగుతాయి.

తెలుగు నేల మీద కూడా బౌద్ధం ఆనవాళ్ళు బలంగా ఉన్న చోట్ల వేరే రూపంలో ఈ జాతరలు జరుగుతున్నాయి. కానీ, బొజ్జన్న కొండ దగ్గర నిర్వహించే జాతరలో బౌద్ధం ఆనవాళ్ళు చెదిరిపోకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా నిలిచే ఉన్నాయి.


బౌద్ధ ఉపాసిక హారీతి. ఆమె మొదట్లో దుష్ట స్వభావి. బౌద్ధుని ప్రబోధం వల్ల మనసు మార్చుకొని, గొప్ప వైద్యురాలుగా మారింది. ప్రపంచంలో తొలి మాతా శిశు వైద్యురాలు హారీతి. ఆమె ఉపయోగించిన వనమూలికల్లో ప్రధానమైనది కరక్కాయ. అందుకే దానికి ‘హారీతికి’ అనే పేరు వచ్చింది. అలాగే, తల్లుల సంక్షేమానికి దానిమ్మ పండ్లను వైద్యంలో ఉపయోగించిన తొలి వ్యక్తి కూడా హారీతే!


ఆమె వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయింది. భిక్షువులు, భిక్షుణీల ద్వారా బౌద్ధం బర్మా, చైనా, థాయిలాండ్‌, జపాన్‌, కొరియాలాంటి తూర్పు దేశాలకే కాదు, ఈజిప్టు, గ్రీకు దేశాలకూ చేరింది. ఈ అన్ని దేశాల్లో హారీతి విహారాలు ఉన్నాయి. బొజ్జన్న కొండ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కూడా హారీతి విహారమే. చంటిబిడ్డతో ఉన్న హారీతి విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉంది. నాటి ‘బుద్ధన్నల’ కొండే ‘బొజ్జన్న కొండ’గా మారిందని కొందరు అంటారు. సంఘారామానికి గుర్తుగా ఇక్కడే ‘శంఖారం’ అనే ఊరు ఉంది. ఈ ప్రాంతంలో బుద్ధ, బుద్ధ వరపు, బోధి (బోడి) అనే ఇంటి పేర్లు ఉన్నవారు చాలా మంది ఉంటారు. అది సముద్ర తీరపు రేవు కాబట్టి ఆనాడు విదేశీ వ్యాపార కేంద్రంగా కూడా విలసిల్లింది. వరి, చెరకు పంటలు చేతికి వచ్చినప్పుడు రైతులు బొజ్జన్న కొండ వద్దకు చేరి ఉత్సవాలు జరుపుకొనేవారు.


బౌద్ధ గురువుల ప్రబోధాలు వినేవారు. మళ్ళీ ఇప్పుడు... గత దశాబ్దంగా కనుమ రోజున బౌద్ధులు, బౌద్ధ భిక్షువులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ధర్మ సందేశాలు ఇస్తున్నారు. ఇదో ప్రకృతి పండుగ. అందుకే... ‘ధర్మ పంటల పండుగ’గా ఈనాటికీ అది నిలబడే ఉంది. సంక్రాంతి వేడుకల అనంతరం... విశాఖ పర్వత కనుమల్లో కనుమనాడు జరిగే ధర్మ ఉషోదయం... ఈ బొజ్జన్న కొండ ఉత్సవం.


ఉత్తరాదిలోని బౌద్ధ క్షేత్రాల వద్ద జాతరలు జరుగుతాయి. తెలుగు నేల మీద కూడా బౌద్ధం ఆనవాళ్ళు బలంగా ఉన్న చోట్ల వేరే రూపంలో ఈ జాతరలు జరుగుతున్నాయి. కానీ, బొజ్జన్న కొండ దగ్గర నిర్వహించే జాతరలో బౌద్ధం ఆనవాళ్ళు చెదిరిపోకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా నిలిచే ఉన్నాయి.

 బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-01-08T06:09:51+05:30 IST