సంఘం పుట్టిన రోజు.. ధర్మం నడచిన రోజు!

ABN , First Publish Date - 2020-07-03T06:23:51+05:30 IST

శాక్య గణరాజ్యానికి చెందిన రాజు శుద్ధోధనుడి కుమారుడే సిద్ధార్థుడు. పదహారేళ్ళు వచ్చేసరికి విస్సమిత్రుడు అనే గురువు దగ్గర సకల క్షత్రియ విద్యలూ నేర్చాడు. మేటిగా నిలిచాడు. వాటితో పాటు తర్క, తత్త్వ శాస్త్రాలను అభ్యసించాడు. గణిత

సంఘం పుట్టిన రోజు.. ధర్మం నడచిన రోజు!

మూడు సింహాల ముద్ర మన జాతీయ చిహ్నం. ఇది ధర్మచక్ర ప్రవర్తనకు ప్రతిరూపం. మన రాజ్యాంగం ధరించిన కవచం ధర్మం. బుద్ధుడు మన కీర్తిపతాక. బౌద్ధం మానవీయ భూమిక. అలాంటి ధర్మాన్ని నేల నలుచెరగులా నడిపిన రోజు ఇది.


శాక్య గణరాజ్యానికి చెందిన రాజు శుద్ధోధనుడి కుమారుడే సిద్ధార్థుడు. పదహారేళ్ళు వచ్చేసరికి విస్సమిత్రుడు అనే గురువు దగ్గర సకల క్షత్రియ విద్యలూ నేర్చాడు. మేటిగా నిలిచాడు. వాటితో పాటు తర్క, తత్త్వ శాస్త్రాలను అభ్యసించాడు. గణిత శాస్త్రంలో విశేష ప్రావీణ్యం సంపాదించాడు. సిద్ధ్దార్థుడికి అతను పుట్టిన రాచరిక వ్యవస్థ చాలా అమానవీయంగా కనిపించింది. అధికారం కోసం, ఆస్తుల కోసం ఒకరిపై ఒకరు ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం, పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవడం చూశాడు. ఇలాంటి ప్రవర్తనే సమాజంలో అన్ని చోట్లా చూశాడు. చలించిపోయాడు. ‘ఈ అమానవీయ లక్షణాలు పెరిగి పెరిగి చివరకు మానవులు ఏమైపోతారు?’ అని ఆలోచించాడు. ధరణీతలాన్ని ముంచెత్తబోయే దుఃఖసాగరం అతని ఆలోచనలను అల్లకల్లోల పరచింది. ‘మానవజాతి దుఃఖ నివారణ మార్గం ఏమిటి?’ అని ఆలోచించాడు. తన ఇరవై తొమ్మిదో ఏట ఇల్లు విడిచాడు. కుటుంబాన్నీ, రాజ్యాన్నీ వదిలినా, సమాజాన్ని వదలలేదు. ‘నాకు సమాధానం సమాజం నుంచే దొరుకుతుంది’ అనుకొని బయలుదేరాడు. ఆరేళ్ళలో ఎందరెందరో తాత్త్వికులను కలిశాడు. ఎన్నెన్నో  యోగ సాధనలు చేశాడు.


చివరకు నిరంజనా నదీ తీరంలో ఉరువేళ అనే గ్రామ సమీపంలో దుష్కర హఠయోగానికి కూర్చున్నాడు. అప్పుడు ఆయనతో పాటు కొండణ్ణ (కౌండిన్య), బద్దియ (భద్రియ), కాశ్యప (వప్ప), అస్సజి (అస్వజిత్‌), మహానామ అనే అయిదుగురు సహచరులు చేరారు. కొన్నాళ్ళు వారి తపస్సు కఠోరంగా సాగింది. ఆహారం మానడం వల్ల సిద్ధ్దార్థుడు ఎముకల గూడుగా మారి, సొమ్మసిల్లి పడిపోయాడు. ‘నిరాహారం వల్ల దుఃఖనివారణ మార్గం దొరకదు’ అని గ్రహించి, తిరిగి ఆహారం తీసుకున్నాడు. దానితో ఇతను యోగ భ్రష్టుడు అని నిర్ణయించుకొని, సిద్ధార్థుణ్ణి వదిలి, మిగిలిన అయిదుగురూ రుషి పట్టణం (ఇసి పట్టణం) చేరారు. అక్కడ జింకల వనంలో తమ సాధన కొనసాగించారు. ఆ రుషి పట్టణమే- సారనాథ్‌!


మూడు నెలలు గడిచాయి. ఆరోజు ఆషాఢ పున్నమి. ఉషోదయం అయింది. పక్షుల కిలకిల రావాలతో వనం సంగీత నిలయంలా ఉంది. లేడి పిల్లలు ఛెంగు ఛెంగున గంతులు వేస్తూ ఉన్నాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆ వనంలో పెద్ద మోదుగు చెట్టు కింద కూర్చొని ఉన్నారు అయిదుగురు మిత్రులూ! వారికి దూరంగా... తమ వైపే వస్తున్న వ్యక్తి కనిపించాడు. వారు ఆయనను గుర్తు పట్టారు.


‘‘అదిగో... ఆ యోగభ్రష్టుడు వస్తున్నాడు. అతణ్ణి గౌరవించవద్దు. లేచి నిలబడవద్దు. సత్కరించవద్దు. అసలు మాట్లాడించవద్దు’’ అని అనుకున్నారు. 


ఆ వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో పుడమిని మించిన ప్రశాంతత, విప్పారిన విజ్ఞాన తేజస్సు! ఆ కళ్ళల్లో కారుణ్యం. అతణ్ణి చూసినవారంతా తమకు తెలియకుండానే లేచి నిలబడి- ‘‘వందనాలు మిత్రమా గౌతమా!’’ అన్నారు చేతులు జోడించి.


‘‘ఆయుష్మంతులారా! నేనిప్పుడు సిద్ధార్థ గౌతముణ్ణి కాదు, బుద్ధుణ్ణి! బుద్ధత్వాన్ని పొందాను. దుఃఖ నివారణ మార్గాన్ని సాధించాను’’ అని వైశాఖ పున్నమి నాడు పొందిన జ్ఞానోదయం గురించి చెప్పాడు. వారు వినమ్రులై... ఆయనకు ఉచిత ఆసనం వేశారు. తాను సాధించిన దుఃఖ నివారణ మార్గాలైన ‘ప్రతీత్య సముత్పదం’ (‘ప్రతీదీ మారుతుంది’ అనే కార్యకారణవాదం), ‘చతురార్య సత్యాలూ’, ‘అష్టాంగ మార్గం’ గురించి వారికి చెప్పాడు.


తాత్త్వికంగా అవి చాలా లోతైన, జటిలమైన అంశాలు. కాబట్టి వాటిని తేలికగా, ప్రజల భాషల్లోనే చెప్పాలని బుద్ధుడు నిర్ణయించుకున్నాడు. అలాగే అందరు తత్త్వవేత్తల్లా కాకుండా వనాలను వదిలి, జనాలలోకి వెళ్ళి తిరుగుతూ ప్రచారం చేయాలనుకున్నాడు. ఆ పని తానొక్కడే చేయలేడు కాబట్టి ఒక ధార్మిక సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా, ఎవరైతే తనను ఈసడించుకొని వెళ్ళిపోయారో వారికే చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు. రెండు నెలలు నిర్విరామంగా నడుచుకుంటూ సారనాథ్‌కు వచ్చాడు బుద్ధుడు.


అలా ఆ అయిదుగురితో ధార్మిక సంఘం ఆషాఢ పున్నమి రోజున సారనాథ్‌ పుట్టింది. ఇది బౌద్ధ సంఘం పుట్టిన రోజు. అక్కడి నుంచి ఒక్కొక్కరూ ఒక్కొక్క దారికి వెళ్ళి, ధర్మ ప్రచారం ప్రారంభించారు. కాబట్టి అది ధర్మం నడిచిన రోజు కూడా! దీన్నే ‘ధర్మచక్ర ప్రవర్తనం’ అంటారు. అందుకే దానికి గుర్తుగా అశోకుడు సారనాథ్‌లో నాలుగు దిక్కులకూ చూస్తున్న నాలుగు సింహాల ధర్మ స్తంభాన్ని నెలకొల్పాడు. ఆ సింహాలే - నేడు మన జాతీయ ముద్ర!

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-07-03T06:23:51+05:30 IST