ఉద్యోగులందరికీ ఒకే సర్వీస్‌ రూల్స్‌ వర్తింపచేయాలి

ABN , First Publish Date - 2021-03-03T06:44:44+05:30 IST

ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యవైఖరితో విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు రోడ్డెక్కారని తెలంగాణ స్టేట్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌-327 సెక్రటరీ జనరల్‌ శ్రీధర్‌ అన్నారు.

ఉద్యోగులందరికీ ఒకే సర్వీస్‌ రూల్స్‌ వర్తింపచేయాలి
మహాధర్నాలో పాల్గొన్న ఉద్యోగులు, ఆర్టిజన్లు

 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యవైఖరితో విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు రోడ్డెక్కారని తెలంగాణ స్టేట్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌-327 సెక్రటరీ జనరల్‌ శ్రీధర్‌ అన్నారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకే సర్వీస్‌ రూల్స్‌ వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఆధ్వర్యంలో మింట్‌ కాంపౌండ్‌లోని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు విలువలేకుండా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు.కొన్ని సంఘాలు యాజమాన్యాలకు తొత్తులుగా మారి సంఘాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. జేఎల్‌ఎంలకు బేసిక్‌ పే ఇచ్చేవరకూ ఉద్యమం ఆగదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు వైద్యసదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాలు జెండాలు పక్కన పెట్టి 30 వేల మంది ఉద్యోగుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. 

18న ‘చలో విద్యుత్‌ సౌధ’

తెలంగాణ విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గాంబో నాగరాజు మాట్లాడుతూ.. 23,668 కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న సీఎండీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అన్‌మ్యాన్డ్‌ వర్కర్స్‌, స్పాట్‌ బిల్లర్స్‌, బిల్‌ కలక్టర్స్‌, యస్‌పీఎం వర్కర్లతోపాటు స్టోర్‌లో పనిచేసే హమాలీలను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఖాళీలు వెంటనే భర్తీచేయాలన్నారు. ఆర్టిజన్లను జేఎల్‌ఎం, జూనియర్‌ అసిస్టెంట్‌, సబ్‌ ఇంజనీర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 5వ తేదీన వరంగల్‌ ఎన్పీడీసీఎల్‌ ఎదుట ధర్నా, 18న చలో విద్యుత్‌సౌధ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు ప్రకటించారు. మహాధర్నాకు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఆర్టిజన్లు, విద్యుత్‌ ఉద్యోగులు తరలిరావడంతో మింట్‌ కాంపౌండ్‌ పరిసరాలు నినాదాలతో మార్మోగాయి. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహాధర్నాలో కార్మికసంఘాల నేతలు సంతో్‌షరెడ్డి, ప్రభాకర్‌, తులసిరెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-03T06:44:44+05:30 IST