రైతులకు అండగా నిలుస్తాం..

ABN , First Publish Date - 2021-10-19T05:57:00+05:30 IST

వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసేవరకూ రైతు ఉద్యమానికి అండగా నిలుస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం అన్నారు.

రైతులకు అండగా నిలుస్తాం..
భీమవరం రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న సీఐటీయూ

భీమవరం క్రైం, అక్టోబరు 18: వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసేవరకూ రైతు ఉద్యమానికి అండగా నిలుస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం అన్నారు.  యూపీ ఘటనపై  భీమవరం టౌన్‌రైల్వే స్టేషన్‌ వద్ద దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి హారేరాం మాట్లాడుతూ   రైతులను కారుతో తొక్కించి హతమార్చడం దుర్మార్గానికి నిదర్శనం అన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా నల్లచట్టాలు రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. రామాంజనేయులు,  కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కె. కాంత్రిబాబు తదితరులు  మాట్లాడుతూ  రైతు ఉద్యమానికి ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.  

ఆకివీడు: దేశ సంపద అమ్మివేయడమే  బీజేపీ ధ్యేయమని సీపీఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు ఆరోపించారు.  యూపీలో రైతుల మారణకాండలో ప్రధాన పాత్ర పోషించిన కేంద్ర  మంత్రి అజయ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ సోమవారం స్థానిక రైల్వే స్టేషన్‌లో ధర్నా నిర్వహించి స్టేషన్‌ మాస్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం కార్యకర్తలు షేక్‌ వలీ, పెంకి అప్పారావు, పి.పాండురంగారావు, పి.లక్ష్మినారాయణ,  కె.రామకృష్ణ, వి.వెంకట రమణ, సీహెచ్‌ పాపారావు, ప్రకాష్‌, రాగాల రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:57:00+05:30 IST