రైతుకు ధీమా.. బీమా

ABN , First Publish Date - 2022-07-25T04:34:31+05:30 IST

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తుంది రైతుబీమా పథకం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి నగదు అందించి భార్య, పిల్లలకు జీవన భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. రైతుకు ఎలాంటి ఇ్బందులు ఎదురై మరణించినా బీమా వర్తిస్తుంది.

రైతుకు ధీమా.. బీమా

- కొత్త రైతుల నమోదుకు అవకాశం

- దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

చింతలమానేపల్లి, జూలై 24: రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తుంది రైతుబీమా పథకం. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి నగదు అందించి భార్య, పిల్లలకు జీవన భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. రైతుకు ఎలాంటి ఇ్బందులు ఎదురై మరణించినా బీమా వర్తిస్తుంది. బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. గతేడాది రెన్యూవల్‌ అయిన రైతుల కాలపరిమితి ఈ నెలలో ముగియనుండడంతో మళ్లీ వీరికి బీమాలో అవకాశం కల్పించడంతోపాటు కొత్త వారిని పథకంలో చేర్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

57 ఏళ్లు దాటితే బీమాకు అనర్హులు

ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా మండలాల్లో 18-57ఏళ్ల రైతులు నమోదై ఉన్నారు. ఈఏడాది 57 సంవత్సరాలు దాటిన వారి పేర్లు బీమా నుంచి తొలగిపోనున్నాయి. 14ఆగస్టు 1963నుంచి 14ఆగస్టు 2004మధ్యలో జన్మించిన వారికి రైతుబీమా అవకాశం ఉంది. ఒక గుంట భూమి ఉన్న రైతులు సైతం ఈ పథకానికి అర్హులే. ఒక్కో రైతు పేరిట రూ.3,556ల చొప్పున జీవిత బీమా సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. నాలుగు సంవత్సరాలుగా రైతుల కోసం బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 

మార్గదర్శకాలు జారీ

రైతు బీమా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం వ్యవసాయశాఖకు జారీ చేసింది. జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాల వారీగా ఏఈవోలు, ఏవోలు బుధవారం నుంచి గ్రామాల్లో పర్యటించి రైతు బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సారి జిల్లాలో కొత్తగా పట్టాపాసు పుస్తకం వచ్చిన 4,299మంది రైతులు బీమాలో నమోదు చేసుకునేందుకు అర్హులై ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 57సంవత్సరాలు దాటిన వారి పేర్లు బీమా నుంచి తొలగిస్తారు.

దరఖాస్తు విధానం

పట్టాదారు పాసు పుస్తకంతోపాటు రైతు ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలతో రైతు బీమా దరఖాస్తు పత్రం పూర్తి చేసి తమ క్లస్టర్‌ ఏఈవోలకు అందించాలి. దరఖాస్తు పత్రంపై రైతు సెల్‌ నెంబరు రాస్తే నమోదు నమయంలో ఏమైనా సందేహాలు వస్తే రైతును అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పాసుపుస్తకం ఇంకా రాని వారు తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో కూడిన పాసు పుస్తకం నకలు జిరాక్స్‌ పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన వారందరినీ చేర్పిస్తాం

- రాజేష్‌, వ్యవసాయాధికారి 

రైతు బీమాకు అర్హులైన రైతులందరినీ చేర్పించేందుకు గ్రామాల వారీగా రైతుల జాబితాను ఏఈవోలు తమ క్లస్టర్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈనెల20 నుంచి కొత్త పాసుపుస్తకాలు వచ్చిన రైతులు పాత పాసుపుస్తకాలు ఉండి బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. బీమా పథకంలో పేర్లు ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే అవకాశం ఉంది. అర్హులైన వారందరినీ బీమా పథకంలో చేర్పించి వారి కుటుంబానికి భరోసా కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

Updated Date - 2022-07-25T04:34:31+05:30 IST