జగన్ ప్రభుత్వ విధానాలు రైతులను ముంచుతున్నాయి: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2021-09-15T20:46:25+05:30 IST

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన 93శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో...

జగన్ ప్రభుత్వ విధానాలు రైతులను ముంచుతున్నాయి: ధూళిపాళ్ల

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన 93శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు రైతులను, వ్యవసాయాన్ని నిండా ముంచుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగాయని, డీఏపీ ఎరువులు బ్లాక్ మార్కెట్లోనే దొరుకుతున్నాయన్నారు. ప్రభుత్వం గుత్తాధిపత్యం కోసమే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసిందని,  రైతులకు కావాల్సిన విత్తనాలు కూడా భరోసా కేంద్రాల్లో దొరకడంలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జగన్ ప్రభుత్వం తెలంగాణ కంటే వెనుకబడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, రూ.16,700 కోట్లు వెచ్చించి 2020-21 నాటికి కోటి 40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు కేవలం రూ.6,700 కోట్లు మాత్రమే వెచ్చించిందని విమర్శించారు.


2019-20 ఖరీఫ్‌లో జగన్ ప్రభుత్వం కేవలం 14.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, తెలంగాణ ప్రభుత్వం 38 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని ధూళిపాళ్ల అన్నారు. 2020-21 ఖరీఫ్‌లో ఏపీ ప్రభుత్వం 15.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటే,  తెలంగాణ 41.06 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, మొక్కజొన్న కేంద్రాలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబులు నింపాయన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద, 2019-20లో  రాష్ట్రంలో ఒక్కరైతుకి పంటల బీమా సొమ్ము అందలేదన్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజన పథకంలో 2019-20లో రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన  రూ.1033 కోట్లను జగన్ ప్రభుత్వం కేంద్రానికి బకాయిపెట్టిందన్నారు.


జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరైతుకి కూడా యాంత్రీకరణ పరికరాలు అందించలేదని ధూళిపాళ్ల ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన డ్రిప్ ఇరిగేషన్, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, భూసారపరీక్షలు, సూక్ష్మపోషకాల పంపిణీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. రైతు భరోసా కింద రూ.12,500లు ఇస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక రూ.7,500 లకే పరిమితంచేశారని ఆరోపించారు. వడ్డీలేని రుణాలిచ్చామని ప్రభుత్వం చెబుతుంటే,  బ్యాంకులు, సహాయ సహకార సంఘాలు రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. లక్షలోపు రుణాల తాలూకా వడ్డీ రాయితీని ప్రభుత్వం రైతులకు చెల్లించడంలేదని, జగన్ ప్రభుత్వం కేవలం 60 వేల మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలిచ్చిందన్నారు. ఈ లెక్కలన్నీ  కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-15T20:46:25+05:30 IST