Sugar వస్తే 45 ఏళ్ల లోపే.. లేదంటే.. తీపి కబురే..!

ABN , First Publish Date - 2021-10-31T05:15:29+05:30 IST

మధుమేహం.. ఇది ఒకసారి అటాక్‌ అయిందంటే ఇక అన్ని రోగాలను శరీరంలోకి ఆహ్వానించినట్లే..! తరచూ వినపడే మాట ఇది.

Sugar వస్తే 45 ఏళ్ల లోపే..  లేదంటే.. తీపి కబురే..!

  • లేదంటే 60 తర్వాతే..
  • మధుమేహ సంక్రమణ వయసు మారిపోతోందా..?
  • ప్రధానంగా అప్రమత్తతతోనే ఈ వ్యాధికి దూరం
  • జాగ్రత్త పడుతున్న వారు సగంమంది పైనే..
  • మాకెందుకు వస్తుందిలే అనుకుంటే మాత్రం కష్టమే!
  • జిల్లాలో ఆసక్తికరంగా ల్యాబ్‌ల రిపోర్టులు
  •   

మధుమేహం చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు కలవరపెడుతున్న వ్యాధి. గతంలో వంశపారంపర్యంగా సంక్రమిస్తుందనే పేరున్నా.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మారిన ఆహార అలవాట్లు, కరోనా వంటి కారణాలతో ఎవరికైనా షుగర్‌ రావచ్చు. కానీ ముందుగానే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్నవారు ఈ ప్రమాదానికి దూరంగా ఉంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మాకెందుకు వస్తుందిలే అనుకున్న వారిలో మాత్రం ఈ వ్యాధి దగ్గరవుతోంది. జిల్లాలో కొన్ని ప్రముఖ ల్యాబ్‌ల్లో తొలిసారి షుగర్‌ టెస్ట్‌ చేయించుకున్నవారి ఫలితాలు, వారి వయసులను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 


గుంటూరు(సంగడిగుంట), అక్టోబరు30: మధుమేహం.. ఇది ఒకసారి అటాక్‌ అయిందంటే ఇక అన్ని రోగాలను శరీరంలోకి ఆహ్వానించినట్లే..! తరచూ వినపడే మాట ఇది. ఇది ఒక్కొక్కరికి ఒక్కో వయసులో బయట పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించే షుగర్‌ ఒక ఎత్తయితే.. పూర్వీకులలో ఆ వ్యాధి లేకున్నా తర్వాతి వారికి షుగర్‌ వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇందుకు మనం తినే ఆహారం, కరోనా వంటి వ్యాధులు కూడా కారణం అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఓ సర్వేలో మఽధుమేహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అదేంటంటే.. మధుమేహం 45 ఏళ్ల వయసు లోపే కనిపిస్తోంది. లేదంటే ఇక 60 తర్వాతే..! గత రెండు దశాబ్దాలుగా వ్యాధి నిర్ధారణ, చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెరగడమే ఇందుకు కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

 

 సర్వేలో వెల్లడిస్తోన్న విషయాలివి..

గత ఏడాది కాలంటే ప్రముఖ ల్యాబ్‌ల్లో మధుమేహ పరీక్ష చేయించుకున్న వారి సంఖ్య సరాసరి వెయ్యి అనుకుంటే..  అందులో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారు 500 మంది ఉన్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వారు మరో వందమంది ఉన్నారు. మిగిలిన 400 మంది 60 ఏళ్లు దాటిన వారే కావడం గమనార్హం. వీరంతా ఎక్కువమంది విద్యాధికులు.


కారణాలు విశ్లేషిస్తే..

సర్వే ఫలితాలను వైద్యుల దృష్టికి తీసుకు వెళితే నిజమేనని అంగీకరించారు. దీనికి విభిన్న కారణాలను అంచనా వేశారు. గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఇంట్లోనూ మధుమేహ బాధితులు ఉన్నారు. వారు పడుతున్న బాధను దగ్గరగా చూస్తున్నారు. దీంతో 50శాతం కుటుంబాలు ముందు జాగ్రత్తలు చేపట్టాయి. సాధ్యమైనంత ఎక్కువకాలం మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు రకరకాల మార్గాల్లో జాగ్రత్త పడుతున్నారు 60 ఏళ్లు వచ్చేవరకు దీని బారిన పడకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యులను సంప్రదించడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఒక్క మధుమేహం గురించే కాకుండా బీపీ, థైరాయిడ్‌ వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు.  

 

-  ప్రపంచంలో మధుమేహానికి రాజధాని భారతదేశం. భారతదేశంలో దక్షిణాదిలో ఇంకా ఎక్కువ. ఇందులో ఏపీ, తెలంగాణలకు మొదటిస్థానం. ఏపీలో గుంటూరు, కృష్ణాల్లో అత్యధికంగా షుగర్‌ బాధితులు ఉన్నారు. ఇందుకు కారణం కొన్ని తరాలుగా వరి అన్నానికి అలవాటు పడి ఉండటం అన్నది ఒక అంచనా.  

 

మాకెందుకు వస్తుంది అన్నవారికే...

మా ముందు తరాల వారికి మధుమేహం లేదు.. మాకు అధిక బరువు లేదు.. లక్షణంగా ఉన్నాం.. మాకెందుకు వస్తుంది అనుకునే 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కేవలం తమకు రాదన్న ధీమాతో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఎక్కువమంది దీని బారినపడుతున్నారు. దీనికి  వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడితో కూడిన పనులు, ఆహారపు అలవాట్లు కూడా తోడవుతుందని అభిప్రాయం.  

 

అప్రమత్తతే శ్రీరామరక్ష

మా వంశంలో అందరికి షుగర్‌ ఉంది.. మాకూ వస్తుంది... అయితే సాధ్యమైనంత కాలం దాని బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలని అని చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు మధుమేహం వచ్చినపుడు కంగారుపడకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారని, తమకు రాదు అనుకుని అశ్రద్ధ చేసిన వారే ఏదో ఒక అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్నారని వైద్యులు అంటున్నారు.  


ఆహ్వానించదగిన పరిణామం

 రెండు దశాబ్దాలుగా మధుమేహం పట్ల ముందు జాగ్రత్త పెరిగింది.  వాస్తవానికి 45 వయస్సు లోపు వారికే షుగర్‌ వచ్చే అవకాశాలు మెండు. కానీ 60 వరకు దానిని దరిచేరనీయకుండా చూస్తున్నారు. ఇది చాలా  ఆహ్వానించదగిన పరిణామం. ఎక్కువ విద్యావంతులు ఉండే గుంటూరు జిల్లా వంటి ప్రాంతంలో ఈ సర్వే ఆసక్తికరంగాను, వాస్తవానికి దగ్గరగాను ఉంది. ముఖ్యంగా కరోనా తరువాత నుంచి 90శాతం మందిలో ఆరోగ్యంపై దృష్టి పెరిగింది. ఈ అప్రమత్తత ఇలాగే కొనసాగితే మరో దశాబ్దం తరువాత 60 ఏళ్లలోపు మధుమేహ వ్యాధిగ్రస్తులను తక్కువ మందిని చూస్తాం. మా వంశంలో లేదు.. మాకు రాదు అనే ధీమా వద్దు. ప్రతి ఒక్కరూ 40సంవత్సరాల వయస్సు నుంచి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్య సూత్రాలు పాటించండి.

 - డాక్టర్‌ వి.శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌, జీజీహెచ్‌ 

 

Updated Date - 2021-10-31T05:15:29+05:30 IST