ఆర్‌అండ్‌బీలో నియంత!

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సొంత జిల్లా.. అదీ ఆయన శాఖలోనే ఇష్టారాజ్యంగా తయారైంది. ఓ అధికారి నియంతలా వ్యవహరిస్తు

ఆర్‌అండ్‌బీలో నియంత!

 ఆ అధికారి చెప్పిందే వేదం..

 ఐటీఐ అర్హతకే నాలుగు నెలల్లో రూ.350 కోట్ల పనుల అప్పగింత..

 డ్రైవర్లు, అటెండర్ల పేరుతో బ్యాంకు ఖాతాలు..

 వాటి ద్వారా లంచాల వసూళ్లు..

 డీఈ పరిశీలించకుండానే నేరుగా ఉన్నతాధికారికి ఫైల్‌..

 ప్రత్యేకంగా ఉత్తర్వు సిద్ధం చేసిన ఘనులు

 బీటెక్‌ చదివిన ఇంజనీర్లకు విలువేదీ?

 అమాత్యుడి సొంత జిల్లాలోనే ఇష్టారాజ్యం..


అనంతపురం కార్పొరేషన్‌, సెప్టెంబరు 18: 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సొంత జిల్లా.. అదీ ఆయన శాఖలోనే ఇష్టారాజ్యంగా తయారైంది. ఓ అధికారి నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆయన చెప్పిందే వేదం.. అన్నట్లు సాగుతోందన్న విమర్శలున్నాయి. వేలు.. లక్షలు కాదు, ఏకంగా వందల కోట్ల రూపాయల పనులు ఒక ఐటీఐ చదివిన అధికారి చెప్పినట్లే సాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


సాంకేతిక విభాగంలో పనిచేసే ఆ అధికారి చెప్పిందే వేదం. ఇంజనీరింగ్‌ (బీటెక్‌, ఎంటెక్‌) చదివిన ఏఈలు, డీఈలు కూడా ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. ఆ శాఖ ఉన్నతాధికారిని సైతం తన గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంజనీరింగ్‌ చేసిన అధికారులకు పైస్థాయిలో సాంకేతిక విభాగాధికారిని ఉంచటం ఆయనకు అనుకూలంగా మారింది. ఐటీఐ చదివిన వారు రూ.2కోట్లలోపు ప్రణాళికేతర పనుల టెండర్‌ ప్రక్రియ మాత్రమే చేయాలనే నిబంధన ఉంది. ప్రణాళిక పనులను ఇంజనీర్లు చేయాలి. జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదు.


ప్రణాళిక, ప్రణాళికేతర పనులన్నీ ఐటీఐ చేసిన అధికారే చేయాలట. ఆయనకు వందల కోట్ల రూపాయల పనులు అప్పగించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల మంజూరుకు సంబంధించిన లెటర్లు రాయటానికి, కరస్పాండెన్స్‌కు మాత్రమే ఏఈలు ఉండాలట. ఈ విధానం రాష్ట్రంలో ఆ శాఖ పరిధిలో ఏ జిల్లాలోనూ లేదు. ఆ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితి నెలకొంది. టెండర్‌ ఫైళ్ల విషయంలో సాంకేతిక విభాగంలో పనిచేసే ఆ ఇద్దరు అధికారులతోపాటు ఉన్నతాధికారి సంతకం ఉంటే చాలట. డీఈ స్థాయి అధికారి పర్యవేక్షించాల్సి అవసరమే లేదట.


ఐటీఐ చదివిన అధికారి చేసినదే ఫైనల్‌ అట. ఎవరూ పరిశీలించాల్సిన అవసరం లేదంటూ ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా సిద్ధం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఒప్పందాల్లో పీఏ సంతకం కూడా లేదని సమాచారం. డిప్యుటేషన్‌పై వచ్చిన సంబంధిత అధికారులు తప్పులు చేసి వెళ్లిపోతే.. కోట్లాది రూపాయల పనులకు ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇక్కడ సాగుతున్న తంతు ఆ శాఖ ఈఎన్‌సీ, ముఖ్య కార్యదర్శి కార్యాలయ వర్గాలకు తెలిసినా.. ఏమీ చేయలేకున్నారని తెలుస్తోంది.


నాలుగు నెలల్లో రూ.350 కోట్లు..

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో నిత్యం వందల కోట్ల పనులు సాగుతుంటాయి. వాటికి సంబంధించి టెండర్ల పక్రియ వరకు సాంకేతిక విభాగాధికారులు ఫైల్‌ తయారు చేసిన తరువాత డీఈ స్థాయిలో పరిశీలించాలి. ఇక్కడ పరిస్థితి అలా లేదు. డీఈ వాటిని చూడకుండానే నేరుగా ఉన్నతాధికారి వద్దకు వెళ్తున్నాయి. ఈ సర్కిల్‌లో ఇప్పటి వరకు సాంకేతిక అధికారి (టీఓ) పోస్టు లేదు. ఆ పోస్టే లేదని ఆ శాఖాధికారులే చెబుతున్నారు.


సాంకేతిక విభాగానికి ఐదు నెలల క్రితం వచ్చిన ఓ అధికారి ఇక్కడ డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగుతోంది. నాలుగు నెలల్లో రూ.400 కోట్ల వరకు పనుల టెండర్ల ప్రక్రియ సాగినట్లు సమాచారం. వాటిలో ఈయనే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ శాఖకు ఎన్‌డీబీ రుణాలతో సాగే పనులు కీలకం. త్వరలో రూ.122 కోట్ల పనులు చేపట్టనున్నారు.


వాటికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. పీహెచ్‌సీ భవనాలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల విలువైన 46 పనులు చేపట్టనున్నారు. వాటిలో 36 పనులకు టెండర్లు ముగిశాయి. వాటిలో భారీగా లొసుగులున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి వాటిపై సంతకం చేయటానికే భయపడ్డారంటే ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాంకేతిక విభాగంలో పని చేసే కిందిస్థాయి ఉద్యోగి, అక్కడి అధికారి, ఉన్నతాధికారే సంతకాలు చేశారట. అగ్రిమెంట్లలో రెగ్యులర్‌ ఉద్యోగులు, అధికారుల సంతకాలు లేకుండా ఎలా పంపారు..? అని ఈఈ ప్రశ్నించారట. అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు.


అటెండర్లు, డ్రైవర్ల పేర్లతో బ్యాంకు ఖాతాలు

సాంకేతిక విభాగాధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు. ఓ సామాజికవర్గం పేరు చెప్పి, కేసులు, సంఘం పేరుతో అందరినీ భయభ్రాంతులకు లోనుచేస్తున్నారట. ఉన్నతాధికారి సైతం ఈయన చెప్పినట్లే నడుచుకుంటారని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ ఆమ్యామ్యాలు పుచ్చుకునేందుకు నూతన పద్ధతి అమలులో ఉంది. అటెండర్లు, డ్రైవర్ల పేర్లతో దాదాపు పది బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల నుంచి డబ్బు నేరుగా ఆయా ఖాతాలకు జమయ్యేలా చూస్తారట. అవసరమైతే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పేలో పంపే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారట.


డబ్బు తీసుకుంటే ఏసీబీకి పట్టిస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారని తెలిసింది. క్లాస్‌-4 కాంట్రాక్టర్‌, పెట్రోల్‌ బంకుల విషయంలో భారీగానే సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్‌ బంకుకు సంబంధించి రూ.50 వేలు, కాంట్రాక్టర్ల రిజిస్ర్టేషన్ల విషయంలోనూ రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేసినట్లు సమాచారం. ఈ నాలుగైదు నెలల్లోనే 45 వరకు పెట్రోల్‌ బంకులు, 40 మందికిపైగా కాంట్రాక్టర్ల రిజిస్ర్టేషన్లు సాగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సుమారు రూ. 40 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. 


ఆ వేధింపులేంటో..?

రోడ్లు, భవనాల శాఖలో పనిచేసే మహిళా అధికారులు తాము నరకం అనుభవిస్తున్నామని ఏకంగా ఆందోళనకు దిగారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిళ్లు కార్యాలయంలో తాను పది గంటల వరకు ఉంటుంటే ఏడు గంటలకే ఎలా వెళ్తారని సిబ్బందిని ప్రశ్నిస్తారని సమాచారం. రాత్రి సమయాల్లో మహిళలని కూడా చూడకుండా మెసేజ్‌లు పెడుతుండటం కొందరిలో తీవ్ర భయాన్ని రేకెత్తించింది.


ముగ్గురు మహిళా ఏఈల సరండర్‌కు రెఫర్‌ చేశారు. గతంలో నర్సీపట్నంలో మీడియాకు సమాచారం చెప్పాడనే కారణంతో డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన తరహాలోనే.. అవే సెక్షన్లు పెట్టి ఓ ఏఈని సస్పెండ్‌ చేయాలని ఆదేశించారని తెలిసింది. తమను హీనంగా చూస్తారని పలువురు అధికారులే వాపోతున్నారు. రెండు నెలలుగా ముగ్గురు మహిళా ఏఈలు సెలవులోనే ఉన్నారంటే కార్యాలయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రత్యేక ఉత్తర్వులు

టెండర్లకు సంబంధించి తాము సిద్ధం చేసిన ఫైల్‌ను మరొకరు పరిశీలించకుండా ఆ ఇద్దరు అధికారులు మరో కుతంత్రం పన్నారు. డ్రాయింగ్‌ వారే చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. సాంకేతిక విభాగానికి సంబంధించి ఆ ఇద్దరే టెండర్ల పనులు చేయాలని రూల్‌ విధించుకున్నారు. ఈ విధానం ఏ జిల్లాలోనూ లేకపోవటం గమనార్హం. ఆ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వు (జీఓ) కాపీ కూడా సిద్ధం చేశారు.


ఉన్నతాధికారి కూడా తానే కావటంతో అలా ఫైనల్‌ చేసి, పడేశారు. ఈ కాపీ ఈఎన్‌సీ కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. అయినా.. వారు చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యమేంటో అర్థం కావట్లేదు. తాజాగా ఆ ఉన్నతాధికారి టిడ్కో విభాగానికి బదిలీ అయ్యారు. దానిని రద్దు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత హస్తమున్నట్లు ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST