టూల్‌కిట్ కేసులో ట్విటర్ ఇండియా ఎమ్‌డీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు?

ABN , First Publish Date - 2021-06-17T15:31:04+05:30 IST

కాంగ్రెస్ టూల్‌కిట్’ కేసులో ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్

టూల్‌కిట్ కేసులో ట్విటర్ ఇండియా ఎమ్‌డీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు?

న్యూఢిల్లీ : ‘కాంగ్రెస్ టూల్‌కిట్’ కేసులో ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహేశ్వరిని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారుల బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, మనీశ్‌ను మే 31న బెంగళూరులో ప్రశ్నించినట్లు సమాచారం. 


ఢిల్లీ పోలీసులు ఇటీవల ట్విటర్‌కు ఓ నోటీసును పంపించారు. ఈ టూల్‌కిట్‌ను మానిప్యులేటెడ్ మీడియాగా ఏ విధంగా పేర్కొన్నారు? అందుకు ప్రాతిపదికగా తీసుకున్న సమాచారం, దాని హేతుబద్ధత గురించి మొత్తం సమాచారాన్ని సమర్పించాలని కోరారు. ఢిల్లీ పోలీసులు మే 24న లడో సరాయ్, గురుగ్రామ్‌లలోని ట్విటర్ కార్యాలయాలకు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన కాంగ్రెస్ టూల్‌కిట్‌పై పెట్టిన కొన్ని పోస్టులకు ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ చేయడంపై నోటీసు ఇచ్చారు. 


‘కాంగ్రెస్ టూల్‌కిట్‌’పై పెట్టిన కొన్ని పోస్టులకు ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతకుముందు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ లేఖను ట్విటర్‌కు రాసింది. టూల్‌కిట్ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, ఈ ట్యాగ్‌లను తొలగించాలని కోరింది. 


మరోవైపు నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో తటస్థ వేదిక హోదాను ట్విటర్ కోల్పోయింది. దీంతో ట్విటర్‌లో పోస్ట్ అయ్యే అంశాలకు ఆ సంస్థ ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ట్విటర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుని, శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. 


Updated Date - 2021-06-17T15:31:04+05:30 IST