ఆక్సిజన్‌కు ఢోకాలేదు

ABN , First Publish Date - 2021-05-13T05:05:20+05:30 IST

జిల్లాలో ప్రసుత్త అవసరాలకు తగినంతగా ఆక్సిజన్‌ సరఫరా ఉందని.. దీనికోసం కరోనా బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ మహేష్‌కుమార్‌ చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న వివిధ విభాగాల అధికారులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు.

ఆక్సిజన్‌కు ఢోకాలేదు
మాట్లాడుతున్న జేసీ మహేష్‌కుమార్‌

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 

సరఫరా పర్యవేక్షణకు వార్‌రూమ్‌ 

ఒడి శా నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు

జేసీ మహేష్‌కుమార్‌

కలెక్టరేట్‌, మే 12: జిల్లాలో ప్రసుత్త అవసరాలకు తగినంతగా ఆక్సిజన్‌ సరఫరా ఉందని.. దీనికోసం కరోనా బాధితులు ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని జేసీ మహేష్‌కుమార్‌ చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న వివిధ విభాగాల అధికారులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ కె.ప్రసాదరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్‌ సీతారామరాజు, రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్టు కమిషనర్‌ సీహెచ్‌ దేవి, రెవెన్యూ డీపీఎం పద్మావతి, పోలీస్‌ శాఖ నుంచి ఏఎస్‌పీ సత్యనారాయణ, జిల్లా సమాచార కేంద్రం నుంచి డీఐవో నరేంద్రలు నోడల్‌ అధికారులుగా నియమితులయ్యారు. సమీక్షలో జేసీ మాట్లాడుతూ ఆక్సిజన్‌ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు లేకుండా  ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కలిసి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆక్సిజన్‌ సరఫరాను 24 గంటలూ పర్యవేక్షించాలని, ఎటువంటి నిర్లిప్తతకు తావివ్వకూడదని చెప్పారు. ప్రతి శాఖ నుంచి ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాసుపత్రిలో మాత్రమే లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిల్వ చేసే ట్యాంకు ఉందని, మిగిలిన అన్ని ఆసుపత్రులకు సిలిండర్ల ద్వారానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం నుంచి జిల్లాకు ఆక్సిజన్‌ తెప్పిస్తున్నామని, రోజువిడిచి రోజు ఆక్సిజన్‌ ట్యాంకులు వస్తున్నాయని వివరించారు. బొబ్బిలిలో ఉన్న రెండు ప్రైవేటు ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ కేంద్రాల ద్వారా సిలిండర్లలో ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నామన్నారు. ఇలా రోజుకు సుమారు 400 నుంచి 500 సిలిండర్ల వరకూ సరఫరా జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లా అవసరాలకు ఆక్సిజన్‌ సరిపోతోందని, డిమాండ్‌ పెరిగితే ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో వినియోగంలో లేని సుమారు 400 సిలిండర్లు వెలికితీసి ఉపయోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ట్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ రవాణా జరిగే సమయంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా రహదారులపై పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో ఒడిశా నుంచి కూడా కంటైనర్ల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో గణపతిరావు, డీఎస్‌పీ అనిల్‌, వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-13T05:05:20+05:30 IST