భండారు అచ్చమాంబ స్త్రీ సమాజాల్ని స్థాపించిందా?

ABN , First Publish Date - 2020-06-22T08:00:20+05:30 IST

భండారు అచ్చమాంబ జీవితం, కార్యాచరణకు సంబంధించి కొన్ని అవాస్తవాలు బలంగా ప్రచారంలో ఉన్నాయి. ఆమె మహిళా సంఘాల్ని స్థాపించిందన్నది వాటిలో ఒకటి. అచ్చమాంబ చరిత్రను రాసిన కొండవీటి సత్యవతి ‘‘తొలి కథ రాసిన అచ్చమాంబే తొలి స్త్రీల సమాజం కూడా స్థాపించింది...

భండారు అచ్చమాంబ స్త్రీ సమాజాల్ని స్థాపించిందా?

...ఇంతదాకా మనం వివరించుకుంటూ వచ్చిన విషయాలు ‘బృందావనపుర స్త్రీ సమాజా’న్ని భండారు అచ్చమాంబ స్థాపించలేదనీ, అసలా సమాజం బ్రిటీషాంధ్రలో ఏర్పాటైన మొట్టమొదటి స్త్రీ సమాజం కానేకాదనీ స్పష్టం చేస్తాయి. 


భండారు అచ్చమాంబ జీవితం, కార్యాచరణకు సంబంధించి కొన్ని అవాస్తవాలు బలంగా ప్రచారంలో ఉన్నాయి. ఆమె మహిళా సంఘాల్ని స్థాపించిందన్నది వాటిలో ఒకటి. అచ్చమాంబ చరిత్రను రాసిన కొండవీటి సత్యవతి ‘‘తొలి కథ రాసిన అచ్చమాంబే తొలి స్త్రీల సమాజం కూడా స్థాపించింది. తెలుగు దేశంలో అప్పటివరకు స్త్రీల కోసం ఒక సమాజం స్థాపించడం అనే ఆలోచన కూడా లేదు. అలాంటి చోట అచ్చమాంబ చొరవతో మొట్టమొదటి స్త్రీ సమాజం ‘బందరు స్త్రీ సమాజం’ ఏర్పాటయింది’’ అని స్త్రీ సమాజ స్థాపనా విషయంలో కూడా అచ్చమాంబను తొలిగా నిలబెట్టే ప్ర యత్నం చేశారు (భండారు అచ్చమాంబ సచ్చరిత్ర, పు.36). ముదిగంటి సుజాతారెడ్డి యింకొంచెం ముందుకెళ్ళి ‘బృందా వన పుర స్త్రీ సమాజా’న్నే కాకుండా కాకినాడలోని ‘శ్రీ విద్యార్థినీ సమాజా’న్ని కూడా అచ్చమాంబే స్థాపించింద న్నారు (భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథలు, పు.ఠిజీజీజీ). అచ్చమాంబకు బృందావనపుర స్త్రీ సమాజంతో ఉన్న సంబంధమెలాంటిదనే విషయాన్ని పరిశీలించే ముందు అసలీ సమాజం తొలి సమాజమా కాదా అన్న  విష యాన్ని చారిత్రకాధారాలతో చర్చించుకుంటూ పోదాం. 


ఇప్పటిదాకా లభిస్తున్న ఆధారాలనుబట్టి స్త్రీ ప్రయత్నంతో, చొరవతో స్త్రీలను సమీకరించే పని మొట్టమొదట చేసింది కందుకూరి రాజ్యలక్ష్మమ్మ. స్త్రీల కోసం ప్రత్యేకంగా ‘స్త్రీ ప్రార్థనా సమాజాన్ని’ నడిపిందామె. 1890లోనో అంతకు ముందో ఈ సమాజం ఉనికిలోకి వచ్చి ఉంటుంది. ‘‘ఇది ప్రార్థనల సమాజమే కానీ స్త్రీల సెక్యులర్‌ విషయాల చర్చకు సంబంధించింది కాదు కదా’’ అని అభ్యంతరం లేవదీసి దీన్ని మొట్టమొదటి స్త్రీ సమాజంగా గుర్తించ నిరాకరించిన ప్పటికీ ‘బృందావనపుర స్త్రీ సమాజానికి తొలి స్త్రీ సమాజ’ మనే గౌరవం దక్కదు. ఎందుకంటే స్త్రీల సెక్యులర్‌ విష యాలను చర్చించిన స్త్రీ సమాజమొకటి అంతకుముందే ఏర్పడి వుంది. 


‘తొలి’ స్త్రీ సమాజమనుకొంటున్న ‘బృందావనపుర స్త్రీ సమాజం’ నవంబరు 1902లో మచిలీపట్నం (బందరు)లో ఏర్పాటైంది. దానికి సుమారు రెండు నెలల ముందే ప్రస్తుతం ఒడిశాలో ఉన్న గంజాం జిల్లా (అప్పుడు ఉత్తర సర్కారు ల్లోని నార్దర్న్‌ మోస్ట్‌ జిల్లా; మద్రాసు ప్రెసిడెన్సీలో)లోని అస్కా/ అసికాలో 18 సెప్టెంబరు 1902లో ‘అసికా స్త్రీ సమాజం’ స్థాపించబడింది. ఈ సమాజానికి బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ అనే క్రియాశీలక మహిళా మేధావి కార్య దర్శిగా పనిచేసింది. స్త్రీల పత్రికలయిన హిందూ సుందరి, తెలుగు జనానా, సావిత్రిలలో ఈ సమాజ కార్యకలాపా లకు సంబంధించిన అనేక వివరాలున్నాయి. ప్రారంభమై నప్పటి నుండీ నెలకొకసారి సభలు జరిపిన ఈ సమాజం స్త్రీ విద్యాభివృద్ధికై చాలా కృషి చేసింది. బాలికలు పాఠ శాలకెళ్ళి రావడానికి సమాజ స్త్రీల ద్వారా చందాల మూ లంగా డబ్బులు సేకరించి ఒక బండిని ఏర్పాటు చేసింది. మొదటి వార్షికోత్సవం నాటికి 13 సభలు, రెండవ వార్షి కోత్సవం నాటికి 36 సభలు జరిపింది. ‘‘ప్రతి సభకును సగటున 22 (మంది) స్త్రీలు వచ్చిరి. ఒక్కొక్కపుడు 50 సభ్యురాండ్ర వఱకు గూడ వచ్చిరి.’’ హిందూ స్త్రీల స్థితి, స్త్రీ విద్యావశ్యకత, స్త్రీలలో ఐకమత్యం, స్త్రీ సంఘాల అవ సరం, పతిభక్తి, రాజభక్తి, గృహ నిర్వ హణ, స్త్రీలకు ఇంగ్లిష్‌ విద్యావశ్యకత మొదలైన విషయాలపై చర్చించడం, ఉపన్యాసాలివ్వడం చేసేవారు ఈ సమాజ స్త్రీలు. 


బృందావనపుర స్త్రీ సమాజమేర్పడే నాటికే ఈ సమాజమూ, ఇంకా ఒకటీ రెండు స్త్రీ సమాజాలూ పని చేస్తూండి నాయన్న అవగాహన సమకాలీన మహిళామేధావులకు ముఖ్యంగా భం డారు అచ్చమాంబకు, పులుగుర్త లక్ష్మీ నరసమాంబకూ ఉంది. స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నం తవరకూ బ్రిటీషాంధ్రలో స్త్రీల సెక్యులర్‌ విషయాలను చర్చించిన మొట్టమొదటి స్త్రీ సమాజమైన ‘అసికా స్త్రీ సమాజ’ నిర్మాతా, కార్యదర్శీ అయిన బుఱ్ఱా బుచ్చి బంగా రమ్మ గూర్చి కొంత తెలుసుకుందాం. పెన్షన్డ్‌ డెప్యూటీ కలెక్టర్‌ అయిన దివాన్‌ బహదూర్‌ బుద్భవరపు నారా యణ మూర్తి పంతులు (విశాఖపట్నం వాస్తవ్యులు) బంగారమ్మ భర్త. సరైన పాఠశాల విద్యకు నోచుకోని బంగారమ్మ ఇంటివారి సహకారంతోనూ, స్వయంకృషి తోనూ ఇంగ్లీస్‌సహా వివిధ విషయాల్లో మంచి జ్ఞానాన్నా ర్జించింది. బ్రిటీషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన అగ్రగణ్యుల్లో ఒకరైన బంగారమ్మ భర్త ఉద్యోగరీత్యా ఏ ఊరికి బదిలీ అయితే ఆ ఊర్లో స్త్రీలను సమీకరించి మహిళా సంఘాలను యేర్పర్చేది. 1905లో విశాఖపట్నంలో ‘భారతీ సమా జా’న్నీ, 1910లో కర్నూలులో ‘హిందూ స్త్రీ విద్యాభివృద్ధినీ సమాజము’నూ స్థాపించింది. 1912 మే 23, 24 తేదీలలో నిడుదవోలులో జరిగిన మూడవ ‘ఆంధ్ర మహిళా సభ’కు అధ్యక్షత వహించింది. 


ఇక అచ్చమాంబకు బృందావనపుర స్త్రీ సమాజంతో ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. నిడుదవోలు వెంకటరావు అముద్రిత రచన ‘భండారు అచ్చమాంబ జీవితం’ (అను బంధం) ఆధారంగా కొండవీటి సత్యవతి ఈ సమాజాన్ని ‘‘స్థాపించింది’’ అచ్చమాంబ అంటున్నారు. ఈ సమాజ స్థాపనా విషయాన్ని ప్రస్తావిస్తూ క్రెడిటంతా పురుషులకే వచ్చే విధంగా రాసుకున్నారు అయ్యదేవర కాళేశ్వరరావు ‘నవ్యాంధ్రము: నా జీవిత కథ’లో (పు. 63). అచ్చమాంబ సమకాలీకుల్లో కూడా బృందావనపుర స్త్రీ సమాజ ప్రారంభకత్వ విషయానికి సంబంధించి గందరగోళం ఉంది. కొన్ని ఆధారాల ప్రకారం ఓరుగంటి సుందరీ రత్నమాంబ స్థాపకురాలైతే మరికొన్ని ఆధారాలు రత్నమాంబ, అచ్చ మాంబలిద్దర్నీ ప్రారంభకులుగా యిచ్చాయి (హిందూ సుందరి, డిసెంబరు 1906. పు.10-16). 1920లో ప్రారం భమైన సమాజం రెండు సమావేశాల తర్వాత అంతమై సెప్టెంబరు 17, 1904న పునరుద్ధరించబడింది. పునరు ద్ధరించబడిన సంవత్సరాన్నే సమకాలీన మహిళలు సమా జపు పుట్టిన రోజుగా భావించారు. ద్వితీయ వార్షికోత్సవం (17 సెప్టెంబరు 1906) సందర్భంగా ప్రసంగించిన ద్రోణం రాజు దుర్గమ్మ ఓరుగంటి సుందరీ రత్నమాంబనే బృందా వనపుర సమాజపు తల్లిగా వర్ణించింది. ఆమె మాటల్లో: ‘‘ఈ బృందావన సమాజమను బాలికకు కన్న తల్లిగారగు ఓరుగంటి సుందరీ రత్నమాంబగారు 1902వ సంవత్స రంలో గర్భవతి అయి నవంబర్‌ నెలలో ఈ సమాజ మను శిశురత్నమును ప్రసవించెననియు ఆ శిశువును పెంచుటకు ఆమెకు వీలుపడనందున నలుగురిని పోష కులుగా (పెంపుడు తల్లులు) నేర్పరిచిరనియు వారు పుత్రికా వాత్సల్యముతో ఆమెను పెంచుచు 1904వ సంవ త్సరము సెప్టెంబర్‌ నెలలో నామకరణము చేసిరనియు తెలియుచున్నది.’’ దీనిని బట్టి ఓరుగంటి సుందరీ రత్న మాంబే ఈ సమాజ స్థాపకురాలు. 1909 ఫిబ్రవరి 7 నాటి ‘కృష్ణాపత్రిక’ ఆధారంగా భండారు అచ్చమాంబ, ఓరుగంటి సుందరీ రత్నమాంబలిద్దరినీ స్థాపకులుగా చెప్పారు ప్రముఖ చరిత్రకారులైన వకుళాభరణం రామకృష్ణ (Social Reform in Andhra, P.98).


కానీ వాస్తవంగా ఓరుగంటి సుందరీ రత్నమాంబనే ‘బృందావనపుర స్త్రీ సమాజ’ సంస్థాపకురాలిగా తీసుకో వాలి. 1902 డిసెంబరు 24న మచిలీపట్నంలో జరిగిన స్త్రీల సభలో భండారు అచ్చమాంబ మాట్లాడినదాన్ని బట్టి మనమీ నిర్ధారణకొస్తున్నాము. ఆమె మాటల్లోనే: ‘‘నేనిట్లు మీ ముందు మాటలాడ సాహసించుటకంతయు నీ యూర గల కొందరు సోదరుల ప్రోత్సాహమును నాకు గల స్త్రీ జనాభిమానమును గారణము. ... నేనీ గ్రామమునకు వచ్చిన పిదప విద్యావిశారదయగు మిస్‌ హ్యాన్నారత్నము గారీ యూర సతీసమాజమునొకదాని నేర్పరచుటకై యత్నిం పుతున్నారని నాకు దెలిసె. ఆమెగారి యొక్కయు తదిత రులు యొక్కయు అనుగ్రహము వలన నేడిట్లు మన మందఱము కలిసికొని మాటలాడు భాగ్యము కలిగెను...’’ (హిందూ సుందరి, జులై 1903, పు. 1-2). తర్వాత స్త్రీ సమాజాల ప్రాముఖ్యతను వివరిస్తూ అమెరికా ఉన్నత స్థానంలో ఉండడానికి స్త్రీ సమాజమే ముఖ్య కారణమనీ, స్త్రీ సమాజాలు ఐకమత్యాన్ని పెంచుతాయనీ, దాంతో కొద్దిపాటి శ్రమతోనే దేశహిత కార్యక్రమాలు చేయవచ్చని చెబుతూ అలాంటి అవకాశాన్ని ఓరుగంటి రత్నమ్మ సమాజ యేర్పాటు ద్వారా కలగజేసిందని స్ఫురించేట్లుగా ‘‘దీనికంతకు ముఖ్యురాలై యుండి మనకందరకు మిక్కిలి శ్రేయోదాయకమగు నీ సమాజము నేర్పరుపనుత్సహించిన మిస్‌ రత్నము గారి యెడల మనము కృతజ్ఞులై యుండ వలెను’’ అని సమాజ సంస్థాపనా కర్తృ త్వాన్ని ఓరుగంటి సుందరీ రత్నమాంబ కిచ్చేసింది అచ్చమాంబ. దీనిని బట్టి బృందావనపుర స్త్రీ సమాజ స్థాపకు రాలు ఓరుగంటి సుందరీ రత్నమాంబే ననీ, అచ్చమాంబ రాకతో అది ప్రారంభ మవ్వడం ఒక సందర్భం మాత్రమేననీ, స్త్రీ సమాజాల్ని స్థాపించాలనే ఆలోచనే అచ్చమాంబ కలుగజేయకముందే కొందరు ఆంధ్ర స్త్రీల కుండినదనీ విస్పష్టమౌతోంది. 


మిస్‌ హ్యాన్నారత్నం ఉరఫ్‌ ఓరుగంటి సుందరీ రత్నమ్మ అనే దేశీయ క్రైస్తవ స్త్రీ ‘బృందావన స్త్రీ సమాజ’ స్థాపకురాలు. మధురైలో బారిస్టరుగా పని చేసిన మిస్టర్‌ హెన్స్‌మన్‌ ఆమె భర్త. భర్త మరణానంతరం ఈమె బెంగుళూరులోని వాణీ విలాస స్త్రీల కళాశాలకు ప్రిన్సి పల్‌గా పని చేసింది. ‘ఇండియన్‌ లేడీస్‌ మేగజైన్‌’ సంపా దకురాలైన కమలా సత్యనాథన్‌ ఈమె సోదరి. ఇంత దాకా మనం వివరించుకుంటూ వచ్చిన విషయాలు ‘బృందా వనపుర స్త్రీ సమాజా’న్ని భండారు అచ్చమాంబ స్థాపించ లేదనీ, అసలా సమాజం బ్రిటీషాంధ్రలో ఏర్పాటైన మొట్ట మొదటి స్త్రీ సమాజం కానేకాదనీ స్పష్టం చేస్తాయి. 

షేక్‌ మహబూబ్‌ బాషా

91605 79705


Updated Date - 2020-06-22T08:00:20+05:30 IST