మోదీలో ప్రజాస్వామ్యవాది మేల్కొన్నాడా?

ABN , First Publish Date - 2021-11-24T06:21:09+05:30 IST

ఎన్నికలు సమీపిస్తుంటే తమ కాళ్ల కింద నేల కరిగిపోతున్నట్లు, ఎవరో తమ సర్వస్వం దోచుకుపోతున్నట్లు రాజకీయ నాయకులకు దుస్వప్నాలు వస్తుంటాయి. ఎప్పుడూ ఎవరికీ లొంగరని...

మోదీలో ప్రజాస్వామ్యవాది మేల్కొన్నాడా?

ఎన్నికలు సమీపిస్తుంటే తమ కాళ్ల కింద నేల కరిగిపోతున్నట్లు, ఎవరో తమ సర్వస్వం దోచుకుపోతున్నట్లు రాజకీయ నాయకులకు దుస్వప్నాలు వస్తుంటాయి. ఎప్పుడూ ఎవరికీ లొంగరని, ఎవర్నీ కలుసుకోరని, తమ రాతి మేడల్లో తాము నిరంకుశుల్లా జీవిస్తుంటారని పేరు తెచ్చుకున్న నేతలు సైతం ఎన్నికలు సమీపిస్తుంటే కిందకు దిగివచ్చి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పలు రకాల వ్యూహాలు అల్లుతుంటారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా వ్యూహాలు అల్లక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది.


లేకపోతే ఉక్కుమనిషిలా గుర్తింపు పొంది, ఎవరికీ ఒక పట్టాన లొంగే మనస్తత్వం లేదనిపించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎందుకు ఉన్నట్లుండి సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు? ఆయన ప్రజాస్వామ్యవాదిగా మారారని అనుకోవడం కూడా అర్థరహితం. ఎందుకంటే సాగుచట్టాలను ప్రవేశపెట్టినప్పుడు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో, వాటిని ఉపసంహరించుకున్నప్పుడు కూడా మోదీ అంతే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇదే మరో నేత అయి ఉంటే పెద్దఎత్తున రైతులను, సిక్కులను ఇంటికి పిలిపించుకుని వారితో చర్చలు జరిపిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించి ఉండేవారు. మరి మోదీ కనీసం పార్టీలో కీలకనేతలతో కూడా చర్చించలేదు. పెద్దనోట్ల రద్దును ప్రకటించిన మాదిరే సాగుచట్టాల ఉపసంహరణను కూడా ఎవరితో చర్చించకుండా ప్రకటించారు. దీన్ని బట్టి ఆయన మనస్తత్వం ఏమీ మారలేదన్న విషయం స్పష్టమవుతోంది. తాను తీసుకునే నిర్ణయం ఘనత మరెవరికీ దక్కకూడదని, అన్ని నిర్ణయాలు తానే తీసుకుని ప్రకటించాలనే మోదీ వైఖరి ఈ వెనుకడుగులోనూ తెలుస్తోంది. బహుశా అందుకే మోదీ నిర్ణయం ప్రకటించిన తర్వాత దాని వెనుక ఉన్న తర్కాన్ని వివరించేందుకు ఏ పార్టీ నేతా ముందుకు రావడం లేదు. అంతా హతాశులైనట్లు, తమ అగ్రనాయకుడు నిర్ణయం ప్రకటించిన తర్వాత తాము మాట్లాడితే ఏ కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్లు అధికార పార్టీ నేతలను కదిపితే అర్థమవుతోంది. ‘మాకు కారణాలు తెలుసు, కానీ చెప్పలేము..’ అని ఒక సీనియర్ పార్టీ నేత అన్నారు. ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన నేత తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు, తర్వాత కనీసం తన పార్టీలోనైనా ప్రజాస్వామిక చర్చ జరిపించాలనే ఉద్దేశం లేకపోతే ఆ నాయకుని మనస్తత్వాన్ని ఏమని అభివర్ణించాలి?


ఏకపక్షంగా ప్రకటించినప్పటికీ, మోదీ దాదాపు ఏడాది తర్వాత తన నిర్ణయం మూలంగా తన పార్టీకే ఎక్కువ నష్టమని గ్రహించినందువల్లే అయిష్టంగానైనా దిగి వచ్చారన్న విషయం అర్థమవుతోంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితి గురించి తాజా నివేదికలు అందుతూనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు పైకి అనుకున్నంత సాఫీగా లేవని, ముఖ్యంగా పశ్చిమ యూపీలో రైతులు, ముఖ్యంగా జాట్‌రైతుల ఆగ్రహం మూలంగా బిజెపి వ్యతిరేక ప్రభంజనం వీస్తుందని ఇప్పటికి మూడు సర్వేల్లో తేలినట్లు తెలుస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జరిపించిన అంతర్గత సర్వేలో కూడా పశ్చిమ యుపిలో బిజెపి వ్యతిరేక గాలులు తీవ్రంగా వీస్తున్నాయని తేలినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లను గెలుచుకుంది. పశ్చిమ యూపీలోని 14 జిల్లాల్లో 2017లో బిజెపి మొత్తం 71 సీట్లలో 52 సీట్లు గెలుచుకుంది. తూర్పు యూపీగా పేరు పొందిన పూర్వాంచల్‌లో గత ఎన్నికల్లో బిజెపి 164 సీట్లలో 115 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఈ ప్రాంతంలో పట్టు నిలబెట్టుకునేందుకు మోదీ తీవ్రయత్నాలు చేస్తున్నారు. గత జూలై నుంచి మూడుసార్లు పర్యటించి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు అనేక ప్రాజెక్టులకు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. అమిత్ షా కూడా వారణాసి కేంద్రంగా తన ప్రచారవ్యూహాన్ని రూపొందించారు. 2017 ఎన్నికల్లో బిఎస్‌పి, ఎస్‌పి మధ్య ముస్లిం ఓట్లు చీలిపోవడంతో బిజెపి, మిత్రపక్షాలు దాదాపు 111 నియోజకవర్గాల్లో విజయం సాధించగలిగాయి. ఈసారి ముస్లిం ఓట్లు చీలిపోయే అవకాశాలు లేవని, వారు సమాజ్‌వాది పార్టీ వెనుక బలంగా సంఘటితమయ్యారని అంతర్గత సర్వేల్లో తేలింది. బహుజన సమాజ్ పార్టీ బలం క్షీణించడం, అనేక చిన్న పార్టీలు సమాజ్‌వాది పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా మారిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే మోదీ, అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగడంతో పాటు సాగు చట్టాలను ఉపసంహరించుకోవడానికైనా సిద్ధపడక తప్పలేదు.


ఇక పంజాబ్‌లో బిజెపికి తన విజయం కన్నా పూర్తిగా సిక్కులు వ్యతిరేకం కావడం తీవ్ర ఆందోళన కలిగించినట్లు తెలుస్తోంది. బిజెపి నేతలు ఎక్కడకు వెళ్లినా సిక్కులు దాడులు చేయడం ఆ పార్టీ ఊహించలేదు. నిజానికి రైతాంగం వెనుక సిక్కులు బలంగా నిలబడడం వల్లే దాదాపు ఏడాదికి పైగా పోరాటం చెక్కుచెదరకుండా కొనసాగింది. రిపబ్లిక్ డే రోజు సృష్టించిన ఘటనలతో సిక్కులను దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా, ఖలిస్తానీలుగా చిత్రించేందుకు తద్వారా హిందూ ఓట్లను సంఘటితం చేసుకునేందుకు జరిగిన ప్రయత్నాలు బిజెపి సైద్ధాంతిక భ్రష్టతను వెల్లడించాయి. నిజానికి ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత పంజాబ్‌లో పరిస్థితులు సద్దుమణిగేందుకు చాలా కాలం పట్టింది. ఆ సమయంలో హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన పాత్రను విస్మరించలేం. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీల మూలంగా నాలుగు దశాబ్దాలకు పైగా బిజెపి–అకాలీదళ్‌ల మధ్య సంబంధాలు వర్థిల్లడమే కాదు, ఎన్నికల పొత్తులు కుదుర్చుకోవడం హిందూ–సిక్కు రాజకీయ సయోధ్యకు గుణాత్మకమైన రీతిలో తోడ్పడింది. ‘పంజాబ్‌లో పట్టు కోసం సిక్కులపై హిందువులను రెచ్చగొట్టేందుకు మీరు సిద్ధపడుతున్నారు. కార్పొరేట్‌ల కోసం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడమే కాక విద్వేషాలు సృష్టిస్తున్నారు. వాజపేయి హయాంలో అందర్నీ కలుపుకుపోయేందుకు అవలంబించిన ఉదార వాద విధానాలను ఎందుకు మరిచిపోయారు‘ అని కొద్దిరోజుల క్రితం అకాలీదళ్ నేత చందూ మజ్రా ప్రశ్నించారు. నిజానికి సిక్కులను కూడా హిందూజాతిలో భాగంగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు కూడా పంజాబ్‌లో బిజెపి శత్రు పార్టీగా మారడం ఇష్టం లేదనే తెలుస్తోంది. దేశ విభజన కాలం నాటి నుంచీ సంఘ్‌కూ సిక్కులకూ అవినాభావ సంబంధాలున్నాయి. మతకల్లోలాల్లో సిక్కులను కాపాడిన చరిత్ర ఆర్ఎస్‌ఎస్‌కు ఉన్నది. వాజపేయి, ఆడ్వాణీలకు ఈ చరిత్ర తెలుసు కనుకే అకాలీదళ్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించారు. అయితే మోదీ ఆ చరిత్రను విస్మరించడమే కాక సిక్కుల పాత గాయాల్ని రేపే ప్రయత్నం చేశారు. ఇది ప్రమాదకర పరిణామాలకు దారి తీయవచ్చని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లకు ఏ ఆత్మజ్ఞాన ప్రబోధం జరిగిందో కాని గురునానక్ జయంతి సందర్భంగా ఆయన మళ్లీ సిక్కులకు స్నేహహస్తం చాచారు. వారిని క్షమాపణ కోరారు. అకాలీదళ్‌ను అంత త్వరగా తమ వైపుకు తిప్పుకోవడం సాధ్యం కాదని తెలిసిన మోదీ కాంగ్రెస్ నుంచి వేరు వడిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో బేరసారాలు ప్రారంభించారు. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిది. తమ ప్రయోజనాలను దెబ్బతీసిన రాజకీయ పార్టీని పంజాబ్ రైతాంగం, ప్రజలు అంత త్వరగా క్షమించే అవకాశం లేదు.


విచిత్రమేమంటే తన అనాలోచిత నిర్ణయాల ద్వారా సామాజిక అశాంతికి కారణమైంది ప్రభుత్వమైతే అందుకు పౌరసమాజాన్ని విమర్శించడం మోదీ నేతృత్వంలోని బిజెపిలో నెలకొన్న మరో సైద్ధాంతిక వైపరీత్యం. దేశంలో ప్రభుత్వాలు తప్పుడు విధానాలు అవలంబించినప్పుడు ముందుగా పౌరసమాజం మేల్కొంటుంది. ఎన్నికల్లో జయాపజయాలతో ప్రమేయం లేకుండా ఉద్యమాల్ని నిర్వహించడం, ప్రభుత్వాలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయడం చేస్తుంది. గతంలో యుపిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే, కేజ్రీవాల్, రాందేవ్, యోగేంద్రయాదవ్ లాంటి అనేకమంది నిర్వహించిన ఉద్యమాల వల్లే దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం ఏర్పడి భారతీయ జనతా పార్టీ ప్రయోజనం పొందింది. కాని ఇవాళ ప్రభుత్వాన్ని తప్పు పట్టే పౌరసమాజాన్ని ప్రమాదకరంగా చిత్రించడం బిజెపి సిద్ధాంతంగా మారిపోయింది. అదే ఆలోచనా విధానాన్ని ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటిస్తూ పౌరసమాజం కొత్త యుద్ధానికి తెరలేపుతోందని, దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి వారి సలహాల వల్లే ప్రజల సమస్యల గురించి ప్రశ్నించినందుకు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు చిన్న పిల్లలను సైతం జైలుకు పంపేందుకు మోదీ ప్రభుత్వం వెనుకాడలేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని, అది ఇంకా పోలీసు రాజ్యం కాదని అనేకమంది మాజీ ఐపీఎస్ అధికారులు దోవల్ ప్రకటనను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.


సాగుచట్టాలను ఉపసంహరించుకోవడం ప్రధానంగా రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల కోసమే అని మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నందువల్ల మోదీ ఆలోచనా విధానంలో పరివర్తన వచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు మద్దతు నిచ్చిన మెజారిటీ హిందువుల్లో అనేకమంది ఉదారవాదులు, తటస్థులు కూడా లేకపోలేదు. గుజరాత్ అల్లర్లను మరిచి మరీ మోదీని వారు నెత్తికెత్తుకున్నారు. అనేక రాజకీయపార్టీలు కూడా బిజెపితో స్నేహహస్తం చాచేందుకు ముందుకువచ్చాయి. కాని మోదీ ఆలోచనా విధానమే ఈ దేశ మౌలిక ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమని, అధికారం కోసం, పార్టీ విస్తరణ కోసం ఏమైనా చేయగలరని ఆయనే రుజువు చేసుకున్నారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవడమే కాదు, తన ఆలోచనా సరళిని భిన్నంగా మార్చుకున్నప్పుడే మోదీ కొత్త అవతారంతో ముందుకు వచ్చి, దేశం ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రవేశించేందుకు వీలు కల్పించే అవకాశం ఉంటుంది. వేషానికీ, అవతారానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది.


ఎ. కృష్ణారావు 

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-11-24T06:21:09+05:30 IST