Abn logo
Mar 2 2021 @ 01:06AM

సంస్కరణలు జరిగేనా..? అవినీతి నిగ్గు తేలేనా..?

-  కలెక్టర్‌కు సెస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు 

- చివరి క్షణంలో సెస్‌ పాలకవర్గం పొడిగింపు రద్దు 

- ఫిబ్రవరి 27తో ముగిసిన పాలకవర్గం గడువు 

- ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆశ్రయించిన ప్రతినిధులు

- 50  ఏళ్ల ప్రస్థానంలో అలుముకుంటున్న చీకట్లు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సహకార రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా దేశ విదేశాల్లోని ఎందరికో అధ్యయన  కేంద్రంగా మారిన సిరిసిల్ల  సహకార విద్యుత్‌ సరఫరా సంఘం (సెస్‌) అవినీతి చీకట్లలో కూరుకుపోయిందనే విమర్శలను ఎదుర్కొంటోంది.  సెస్‌ పాలకవర్గం తీరుపై కూడా అసంతృప్తి కొనసాగుతోంది. 2016 ఫిబ్రవరి 27న ఎన్నికైన పాలకవర్గం గడువు గత నెలతో ముగిసింది. దానిని మళ్లీ ఏడాది పొడిగిస్తూ ఉత్వర్వులు వెలువడడంపై  సెస్‌ వినియోగదారులు, గ్రామ ప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సోమవారం పాలకవర్గం మళ్లీ చార్జ్‌ తీసుకునే చివరి క్షణంలో పొడిగింపు ఉత్తర్వులను సహకార సంఘాల రిజిస్ర్టార్‌ ఎం.వీరబ్రహ్మయ్య రద్దు చేస్తూ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  28 ఫిబ్రవరి 2022 వరకు  కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు. చివరి క్షణంలో పాలకవర్గం పొడిగింపు రద్దు కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  కలెక్టర్‌ ఆధ్వర్యంలోనైనా సెస్‌ సంస్కరణల బాటలో పయనిస్తుందని, అవినీతి నిగ్గు తేలుతుందని భావిస్తున్నారు. 


సహకార స్ఫూర్తిగా... 

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నో  సహకార సొసైటీలకు స్ఫూర్తిగా నిలిచింది. యాభై ఏళ్లుగా సుదీర్ఘ సేవలు అందిస్తోంది. కొద్ది కాలంగా  అవినీతి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిపై విచారణ కూడా కొనసాగుతోంది. పాల కవర్గం గడువు ముగిసిపోవడంతో ఎన్నికలు జరు గుతాయని భావించారు. ఎన్నికల హడావుడి కూడా మొదలైంది. ఈ సారి ఓటరు గుర్తింపు కార్డులతో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. సెస్‌ పరిధిలో 2.60 లక్షల మంది వినియో గదారుల్లో  1.31 లక్షల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించి ఉన్న సెస్‌లో గతంలో 11 మంది డైరెక్టర్లు ఉండగా కొత్తగా ఏర్పడిన మండలాలు, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ అర్బన్‌తో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. ఇదే క్రమంలో పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు రావడంతో జిల్లాలో రాజకీయ పార్టీలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇదే క్రమంలో పొడగింపు కాలాన్ని రద్దు చేసి కలెక్టర్‌కు అప్పగించారు. ఎన్నికలు నిర్వహించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందోననే ఆసక్తి కూడా పెరిగింది. 


అవినీతిపై దృష్టి  పెట్టేరా..?

అక్టోబరు 31, 1970లో 4,720 మంది సభ్యులతో మొదలైన సంస్థ ఇప్పుడు రెండు లక్షల 60 వేల మందితో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.  ఈ ప్రస్థానం వెనుక ఐదు దశాబ్దాల శ్రమ  ఉంది.  వంద కోట్లకు పైగా ఆస్తులను సమకూర్చుకున్న సెస్‌ లాభాల పయనంలో అవినీతి బాటలు కూడా పడ్డాయి.   కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భారీ అవినీతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సెస్‌ పాలకవర్గాలు మారినా గుట్టుగానే ఉంచడంపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. 2007 నుంచి 2010 వరకు భారీగా సాగిన అవినీతి రూ.40 కోట్ల వరకు ఉంటుందని అప్పటి ప్రభుత్వానికి, సహకార మంత్రిత్వ శాఖకు పలువురు ఫిర్యాదు చేశారు.  మంత్రి కేటీఆర్‌ కూడా అవినీతి నిర్మూలనపై జోక్యం చేసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ పార్టీ వారే పాలకవర్గ సభ్యులుగా ఉండడంతో మంత్రి చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రస్తుతం అవినీతి ఆరోపణలు పతాకస్థాయికి చేరుకున్నాయి. 1980లో అప్పటి అకౌంటెంట్‌  6 లక్షల 44 వేల 225 రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. కోర్టు వరకు వెళ్లారు.   ఆ డబ్బులు ఇంకా రికవరీ కాలేదు. కేసు పెండింగ్‌లోనే ఉంది. గతంలో బిల్లు వసూళ్లలో కాంట్రాక్టర్‌ డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడితే రూ.7.50 లక్షలు తిరిగి రికవరీచేశారు. స్ర్కాప్‌ అమ్మకాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జరిగిన భారీ అవకతవకలపై జరిపిన విచారణ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. 2007 నుంచి 2010 వరకు అవినీతి చోటు చేసుకుందని అప్పటి పాలకవర్గం ఒప్పుకొని విచారణ కమిటీ వేసింది. 2011 మార్చిలో అవకతవకలకు ఉద్యోగులను బాధ్యులుగా చేయడంతో ఒక ఏడీ, ఇద్దరు ఏఈలను సస్పెండ్‌ చేశారు. మరో డీఈ, ఇద్దరు ఏఈలను తిరిగి మాతృ సంస్థకు పంపించారు. దీంతో సెస్‌లో అవినీతి కలకలం రేపింది. బోయిన్‌పల్లి ఏఈఈ కంకణాల రాంరెడ్డి అకారణంగా సస్పెండ్‌ చేశారని మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుడు ఉద్యోగులు తిరుగుబాటు చేశారు. సెస్‌ పాలకవర్గాన్ని బర్తరఫ్‌ చేయాలంటూ ఉద్యోగులు  నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 51 ద్వారా విచారణ జరిగి నివేదిక కూడా అందించారు. దానిపై సీఏ ఎంక్వయిరీ కూడా వేశారు. కమిటీ విచారణకు వచ్చిన ఉద్యోగులకు రూ.14 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత విజిలెన్స్‌ విచారణ చేపట్టినా ఇంతవరకు ఎంజరిగిందో ప్రజలకు మాత్రం తెలియడం లేదు. హైకోర్టులోనూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


అద్దె భవనాల్లో కార్యాకలాపాలు

ఏటా రూ.140 కోట్ల బడ్జెట్‌తో వినియోగదారులకు సేవలు అందించే సెస్‌ ఇప్పుడు గూడు చెదిరి అద్దె భవనాల్లో కొనసాగుతోంది. సెస్‌ ప్రధాన కార్యాలయం కలెక్టరేట్‌కు అప్పగించారు. కలెక్టరేట్‌ నుంచి ప్రతి నెలా రూ.20 వేలు అద్దె వస్తుండగా విద్యానగర్‌లో సెస్‌ ప్రధాన కార్యాలయం నిర్వహణ కోసం ప్రైవేటు భవనానికి రూ.60 వేలు చెల్లిస్తున్నారు. మరోవైపు సెస్‌ స్టోర్స్‌ స్థలంలో రైతు బజార్‌ నిర్మించారు. సెస్‌ రూ.50 వేల అద్దెతో ప్రైవేటు భవనంలో స్టోర్‌ను నిర్వహిస్తోంది. గత పాలకవర్గాలు ప్రభుత్వ కార్యాలయాల అవసరాలకు భవనాలు ఇచ్చి వినియోగదారుల సొమ్మును  అద్దె భవనాలకు ధారాదత్తం  చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


Advertisement
Advertisement