దీదీ బోలే.. ఖేలా హోబే

ABN , First Publish Date - 2021-05-07T09:50:08+05:30 IST

చక్రాల కుర్చీలో కూర్చుని మమతా దీదీ ఎన్నికల్లో చక్రం తిప్పింది. ఫుట్‌బాల్ చేతుల్లోకి తీసుకుని ‘ఖేలా హోబే’ అంటూ గట్టిగా ఒక్క విసురు విసిరింది....

దీదీ బోలే.. ఖేలా హోబే

చక్రాల కుర్చీలో కూర్చుని మమతా దీదీ ఎన్నికల్లో చక్రం తిప్పింది. ఫుట్‌బాల్ చేతుల్లోకి తీసుకుని ‘ఖేలా హోబే’ అంటూ గట్టిగా ఒక్క విసురు విసిరింది. రవీంద్రుడి కవితా పంక్తిని తీసుకుని మమతా బెనర్జీ తన ఎన్నికల నినాదంగా మార్చుకుంది. ఫుట్‌బాల్‌ని హ్యాండ్ బాల్‌గా విసిరినా దాన్ని కమలనాథులు తిప్పి కొట్టలేకపోయారు. పైగా ఎన్నికల్ని ఆటలా ఆడదామన్న దీదీ నినాదాన్ని మోదీ బృందం రివర్స్‌లో పాశుపతాస్త్రంగా వాడుకుందామనుకున్నారు. ‘దీదీ బోలే ఖేలా హోబే, బీజేపీ బోలే వికాస్ హోబే’ అని ప్రధాని మోదీ బహిరంగ సభల్లో భూమ్యాకాశాలు ఒక్కటయ్యేలా తన గళంలోని శక్తిని ప్రదర్శించారు. అంతే కాదు ‘దీదీ.. దీదీ’ అంటూ అనేక సభల్లో అపహాస్యానికి తన వ్యంగ్య చాతుర్యాన్ని జోడించారు. 130కోట్ల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశపు ప్రధాని చూపాల్సిన కనీస హుందాతనాన్ని ఎందుకో ఎన్నికల ఆవేశంలో మరచిపోయారు. బెంగాల్ మహిళల ఆత్మగౌరవమంతా దీదీ చేతుల్లోకి వచ్చిందేమో, దీదీ విసిరిన బంతి కమలదళాధిపులకు గట్టిగా తగిలింది. 


ఒక పక్క దేశం యావత్తూ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని గిలగిల్లాడిపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా కేవలం ఎన్నికలనే పట్టించుకున్నారు. బెంగాల్ మీదే సర్వశక్తుల్నీ కేంద్రీకృతం చేశారు. దేశం ఏమైపోయినా పర్వాలేదు గాని బెంగాల్ ఒక్కటి చేతికి చిక్కితే చాలనుకున్నారు. పిల్లల పరీక్షలు రద్దు చేసినట్టు ఎన్నికల్ని కనీసం కొంతకాలం వాయిదా వేయలేకపోయారు. కరోనా మరణ ఘంటికలు మోగిస్తున్న కాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఘోరమైన విషయమైతే, బెంగాల్‌లో పోలింగును ఎనిమిది దశలుగా జరపాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయం మరింత ఘోరమైనది. ఎవరి ఇషారాతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కానంత అయోమయం ఏమీ లేదు ప్రజలకు. ఇటు బెంగాల్లోనూ అటు తమిళనాడులోనూ టీఎంసీ, డీఎంకే పార్టీలను విజయపథం వైపు నడిపే వ్యూహాన్ని రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫలితాలు వెలువడుతుండగానే ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్నికల కమిషన్ చాలా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని నిర్భయంగా చెప్పాడు. తాను ఈ రంగంలోకి వచ్చిన ఆరేడేళ్ళలో ఎన్నికల్లో మతాన్ని ఇంత బాహాటంగా వాడుకోవడాన్ని చూడలేదని బాధను వ్యక్తం చేశాడు. తనలో ఈ ఎన్నికల రణరంగం ఏం భయాన్ని కలిగించిందో, ఏ బెదిరింపులు వచ్చాయో తెలీదుగాని, ‘అయామ్ క్విటింగ్ దిస్ స్పేస్’ అని టీవీ లైవ్‌‍లో ప్రకటించాడు. కమలనాథులు అతి ధీమాతో ప్రచారార్భాటాలు సాగిస్తుండగానే బీజేపీ ఫలితం రెండంకెలు దాటదని ప్రకటించాడాయన. అంతటి వాడు ఇప్పుడీ వృత్తి నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నాడో రహస్యంగా మిగిలింది.


బెంగాల్‌లో చివరి నాలుగు దశల పోలింగ్ ఒక పెద్ద సంగ్రామంగా మారింది. కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ప్రజలను భయకంపితులను చేయడంలో మిలటరీ దళాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. అందుకే చివరి దశల్లో ఓటింగ్ శాతం పడిపోయింది. పోతే, బీజేపీ 77 సీట్లు దక్కించుకుంటే, అంతకుముందు 76 సీట్లున్న లెఫ్ట్ ఫ్రంట్ జీరోలోకి జారింది. ఏమైనా క్షేత్రస్థాయిలో బెంగాల్‌లో లెఫ్ట్‌కీ, టీఎంసీకి మధ్య అగ్గి రగులుతూనే ఉంది. ఏ నిప్పు ఎటు ఎగిరి బీజేపీ మంటను మరింత రగిలించిందో చూడాలి. లెఫ్ట్ క్యాడర్ తమ మీద ఇప్పటికీ రాజకీయ కక్షలు తీర్చుకునే మమతా దీదీ మీది కసితోనే ఉన్నారు. వారు బీజేపీ వైపు చూస్తే దేశంలో లౌకిక శక్తుల సమీకరణకు అతిపెద్ద విఘాతం కాగలదు. ఈ ఘర్షణకు బెంగాల్‌లో ఫుల్ స్టాప్ పడకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సీను రిపీటవుతుంది. బీజేపీ ప్రస్తుత విజయోత్సాహంతో మరింతగా బెంగాల్ లోతుల్లోకి చొచ్చుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 


ఎన్నికల ముందు దేశం బెంగాల్ వైపు ఎంత ఉత్సుకతతో చూసిందో పరిణామాల అనంతరం అంత కంటే ఎక్కువ ఆశతో చూస్తోంది. మోదీ షాలతో పాటు ఎంపీలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా బెంగాల్‍లోనే తిష్ట వేశారు. దీదీని అష్ట దిగ్బంధం చేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నినా వారి పాచికలు పారలేదు. వీల్ చైర్‌లో కూర్చునే మమత వీరందరినీ సాహసంగా ఎదుర్కొంది. ఆ సాహసం, ఆ శక్తి ఆశలుడుగుతున్న లౌకిక శక్తులలో ప్రాణవాయువు ఊదింది. ఫిబ్రవరి నెలకల్లా కొవిడ్ సునామీని ఎదుర్కొన్న మొనగాళ్ళమని మోదీ, ఆయన అనుయాయులు జబ్బలు చరుచుకున్నారు. కానీ వైరస్ ఓటు వేయదని, వారి మాట వినదని వారికి తెలియ లేదు. జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంఘం (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో ప్రధాని చేసిన ప్రసంగం దేశానికి గుర్తుండే ఉండాలి. ఇండియాను తమ సామర్థ్యంతో కరోనా నుంచి కాపాడుకున్నామని మోదీ గొప్పగా చాటుకున్నారు. అంతే కాదు, భారత్‌లో టీకా తయారీ గురించి ఆడంబరంగా ప్రకటిస్తూ- ఇప్పుడు ప్రపంచం ఇండియాని కాదు, ఇండియానే ప్రపంచాన్ని కాపాడే సత్తా కలిగివుందని అన్నారు. మరిప్పుడేమైంది? ఆ తీర్మానాలు, ఆ గర్వాతిశయాలు ఏమయ్యాయి? ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాల వైపు ఆశగా, దీనంగా ఎందుకు చూడాల్సి వచ్చింది? కనీసం టీకాలు ఇచ్చే ప్రక్రియనైనా సక్రమంగా నిర్వహించగలుగుతున్నామా? ఏమైపోయింది ఆత్మనిర్భర భారతం?


సంపూర్ణ నిర్లక్ష్యం, ముందు చూపు లేని అలసత్వం, గద్దెను కాపాడు కోవడం తప్ప మరో ఎజెండా లేని రాజకీయ అత్యాశలు దేశాన్ని కల్లోలం దిశగా నడిపాయి. కరోనాను ఓడించడం కాదు, కరోనా చేతుల్లో ఓడిపోయారు. ఆసుపత్రుల్లో పడకలు లేక, అవసరమైన మందులు దొరక్క, కనీసం గాలి పీల్చుకునే అదృష్టమే లేక, శ్మశానంలోనూ చోటు దొరక్క సగటు భారతీయుడు గుండెలు బాదుకుంటున్నాడు. ఏ మందిర నిర్మాణాలు, ఏ విగ్రహ ప్రతిష్ఠాపనలు, ఏ జై శ్రీరామ్ నినాదాలు ఇప్పుడు దేశాన్ని కాపాడతాయి? కనుక దేశం మరో ప్రత్యామ్నాయం కోసం తప్పక చూస్తుంది. అటు తమిళనాడులో, కేరళలో ప్రతిపక్షాలు సాధించిన విజయాలు కూడా ఆశను కల్పిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు రానున్న కాలంలో దేశానికి మంచి చేస్తాయని, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా సాగే శక్తుల సమీకరణకు మమత, పినరయి విజయన్, స్టాలిన్ విజయాలు కొండంత బలాన్నిస్తాయని ఆశించడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. 

డా. ప్రసాదమూర్తి (కవి, జర్నలిస్టు)

Updated Date - 2021-05-07T09:50:08+05:30 IST