దీదీ X మోదీ

ABN , First Publish Date - 2021-04-04T06:42:25+05:30 IST

ఆరో తేదీన మూడోదశ పోలింగ్‌కు బెంగాల్‌, అసోంలో ప్రచారం పదునుగా సాగుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ మతఘర్షణలకు

దీదీ X మోదీ

  • మత ఘర్షణలకు బీజేపీ యత్నం.. మైనారిటీలు బీజేపీ ఉచ్చులో పడొద్దు: మమత
  • బెంగాలీలను మమత అవమానిస్తున్నారు.. బీజేపీ ప్రమాణస్వీకారానికి వస్తా: మోదీ


కోల్‌కతా, ఏప్రిల్‌ 3: ఆరో తేదీన మూడోదశ పోలింగ్‌కు బెంగాల్‌, అసోంలో ప్రచారం పదునుగా సాగుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ మతఘర్షణలకు ఆజ్యం పోస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘సమాజాన్ని చీల్చి లాభపడాలనుకునే పార్టీ బీజేపీ! హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఎంఐఎంకు బీజేపీ డబ్బులిస్తోంది. బెంగాల్లో పుట్టిన మరో ముస్లిం పార్టీ(ఐఎ్‌సఎఫ్‌) కూడా బీజేపీతో కుమ్మక్కయింది. వీటి ఉచ్చులో పడకండి. వాటికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. ఓట్ల చీలికను నివారించండి’’ అని రాయిదిఘి సభలో మైనారిటీలకు మమత విజ్ఞప్తి చేశారు. మత ఘర్షణలకు దిగే బయటి వ్యక్తులను తరిమికొట్టాలని, మహిళలూ ఉద్యమించాలని ఆమెకోరారు.


‘‘నేను భక్తి శ్రద్ధలున్న హిందువుని. రోజూ ఇంటి నుంచి బయల్దేరే ముందు చండీమంత్రాన్ని చదువుతాను. మిగిలిన మతాల్ని కూడా గౌరవిస్తాను. అది మన సంస్కృతి. ఇక బీజేపీ నేతలు దళితుల ఇంట్లో భోజనాలు చేస్తూ వారి పట్ల ప్రేమ కురిపిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మేం బ్రాహ్మణులం. అయినా మా ఇంట్లో నా మంచి చెడ్డలన్నీ చూసే, నాకు వంటచేసి పెట్టే మనిషి ఓ ఎస్సీ. నేనెన్నడైనా చెప్పుకున్నానా? ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచి లంచ్‌ తెప్పించుకుని దళితుల ఇంట్లో కూర్చుని తింటున్న బీజేపీ వారు నాకు పాఠా లు చెబుతారా? బీజేపీ అధికారంలోకొస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. కేంద్ర బలగాలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, ఈసీది పక్షపాత వైఖరని మమత ఆరోపించారు.



మమత కాలు.. వీడియో వివాదం

వీల్‌ ఛైర్‌లో ప్రచారం చేస్తున్న మమత దెబ్బ తగిలిన తన కాలును ముందుకీ వెనక్కీ స్వేచ్ఛగా ఊపుతున్నారంటూ బీజేపీ బయటపెట్టిన వీడియో క్లిప్‌పై వివాదం రేగింది. ‘ఆమె కాలు బాగానే ఉంది. అంతా డ్రామా. ఇలాంటి డ్రామాల వల్ల ప్రయోజనం లేదు. సానుభూతి కోసం ఆమె తాపత్రయం’’ అని వీడియో బయటపెట్టిన బీజేపీ కార్యదర్శి ప్రణయ్‌ రాయ్‌ విమర్శించారు.


‘కాలుకు బ్యాండేజి కట్టుకుని తిరగడం వల్ల ఓట్లు రాలవు. ఏ కాలికి దెబ్బ తగిలిందో కూడా ఆమె మరిచిపోయారు.రెండూ కదిలిస్తున్నారు. ప్రజలు విశ్వసించడం లేదు’ అని రాహుల్‌ సిన్హా అనే మరో నేత అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ మండిపడింది. ‘ఇది మమతను అవమానించడమే కాదు.. బెంగాలీ మహిళలందరినీ బీజేపీ అవమానిస్తోంది. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లకు ఏమీ తెలియదా? కట్టు ఎన్నాళ్లుంచా లో చెప్పింది డాక్టర్లే. ఇది నీచ రాజకీయం’’ అని టీఎంసీ ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ దుయ్యబట్టారు.


Updated Date - 2021-04-04T06:42:25+05:30 IST