మే 2న దీదీకి ఉద్వాసన, మాకు 200 సీట్లు: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-04-18T00:27:50+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మే 2న బెంగాల్‌ పీఠం నుంచి..

మే 2న దీదీకి ఉద్వాసన, మాకు 200 సీట్లు: అమిత్‌షా

పూర్బ బర్దమాన్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మే 2న బెంగాల్‌ పీఠం నుంచి తప్పుకుంటారని, బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి జోస్యం చెప్పారు. ఆరో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారంనాడు ఆస్‌గ్రామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ పర్యటించానని, దీదీకి ఉద్వాసన, బీజేపీకి 200 సీట్లు ఖాయమనే విషయం నిశ్చయమైందని చెప్పారు.


కట్ మనీ, సిండికేట్ పాలన, బుజ్జగింపు రాజకీయలకు మమతా బెనర్జీ ప్రభుత్వం పేరుమోసిందని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లో ఒక తరహా ప్రజలు నివశిస్తున్నారని, వారు చొరబాటుదారలను, వాళ్లు దీదీని బాగా అభిమానిస్తుంటారని చెప్పారు. ''మీరూ, నేనూ రెండో తరహా వ్యక్తులం. మన సొంత పండుగలు జరుపుకోవాలంటే కోర్టు అనుమతులు తీసుకుంటుంటాం. మమత హయాంలో దుర్గాపూజ అనంతర నిమజ్జనానికి కూడా మీకు అనుమతి ఇవ్వలేదు'' అని సభికులను ఉద్దేశించి షా అన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులను ఆపాలా వద్దా అనేది తాను ప్రజలను అడగదలచుకున్నాననీ, దీదీ కానీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కానీ ఆ పని చేయగలుగుతారా అని ప్రశ్నించారు. చొరబాటులను ఆపగలిగేది ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పక్షి (చొరబాటుదారులు) కూడా సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి రాలేదని అన్నారు. నామసుద్ర, మతువా కమ్యూనిటీలకు పౌరసత్వ హోదా కల్పిస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చారు. కాగా, ఆరో విడత పోలింగ్ 43 నియోజకవర్గాల్లో ఈనెల 22న జరుగనుంది. 306 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

Updated Date - 2021-04-18T00:27:50+05:30 IST