Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎంగా సైడ్‌ తీసుకోలేదు!

సీఎం హోదాలో అధిష్ఠానం సూచనల ప్రకారం నడుచుకున్న రోశయ్య.. రెండు ప్రాంతాల మనోభావాలకూ విలువను ఇస్తూ సంయమనంతో వ్యవహరించారు. 2009 సెప్టెంబరు నెలలో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంతో రోశయ్యను అధిష్ఠానం సీఎంగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన కుర్చీలో పూర్తిగా కుదురుకోక ముందే.. తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్‌ ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో పెట్టాలన్న డిమాండ్‌తో నవంబరు నెలలో నిరవధిక నిరశన దీక్షను కేసీఆర్‌ చేపట్టారు. కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్న రోశయ్య ప్రభుత్వం ఆయన్ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించింది.


కేసీఆర్‌కు ప్రాణహాని ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికల మేరకే అప్పటి రోశయ్య ప్రభుత్వం ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించిందంటూ కాంగ్రెస్‌ వర్గాల్లో ఇప్పటికీ ప్రచారం ఉంది. అయితే, పార్టీలోని తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిమ్స్‌కు కేసీఆర్‌ను తరలించారనీ చెబుతారు. ఒక వైపు నిమ్స్‌లో కేసీఆర్‌ దీక్ష కొనసాగుతుండగా అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రోశయ్య.. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయవద్దంటూ చెప్పారని, ఆయన హైదరాబాద్‌కు వచ్చేలోపే ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారనీ చెబుతుంటారు. గవర్నర్‌ కాక ముందు ఈ విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ రోశయ్య కూడా ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరగగానే సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement