టీకాతో కాదు..గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:29:29+05:30 IST

కరోనా టీకా వేయించుకున్న మరుసటి రోజే ఒకరు మృతి చెందిన ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన విఠల్‌రావు(42) 108 వాహన పైలట్‌గా సేవలందిస్తున్నారు

టీకాతో కాదు..గుండెపోటుతో మృతి

నిర్మల్‌ జిల్లా కుంటాలలో వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే 108 పైలట్‌ మృతి

14 మంది వైద్య బృందంతో పోస్టుమార్టం.. గుండెపోటుతో మృతిచెందినట్లు నివేదిక  


హైదరాబాద్‌/నిర్మల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరోనా టీకా వేయించుకున్న మరుసటి రోజే ఒకరు మృతి చెందిన ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన విఠల్‌రావు(42) 108 వాహన పైలట్‌గా సేవలందిస్తున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేయించుకున్నారు. ఆ తరువాత అబ్జర్వేషన్‌ కోసం సాయంత్రం 5 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ.. ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. బుధవారం వేకువజామున 2.30గంటలకు ఆయనకు ఛాతీనొప్పి రాగా, 5.30 గంటల సమయానికి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో మార్గం మధ్యలోనే విఠల్‌ గుండెపోటుతో మృతిచెందారని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడి (డీహెచ్‌) కార్యాలయం తెలిపింది. ఒక కార్డియాలజిస్టుతో కూడిన వైద్య బృందం రిమ్స్‌ నుంచి వెళ్లి పోస్టుమార్టం నిర్వహించింది. ఆయన గుండెపోటుతోనే చనిపోయారని నివేదిక ఇచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ.. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుతో సమీక్షించారు. మరోవైపు మృతిపై విచారణ జరిపేందుకు 14 మంది వైద్య నిపుణులతో కూడిన నిర్మల్‌ జిల్లా స్థాయి అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌ (ఏఈఎ్‌ఫఐ) కమిటీ.. తన ప్రాథమిక నివేదికను బుధవారం రాత్రే రాష్ట్రస్థాయి ఏఈఎ్‌ఫఐ కమిటీకి పంపింది.


గుండెపోటు వల్లే విఠల్‌ మృతిచెందారని ఈ నివేదికలోనూ పేర్కొన్నట్లు సమాచారం.జాతీయ స్థాయి ఏఈఎ్‌ఫఐకు గురువారం నివేదికను పంపనుంది. టీకాతో వెంటనే తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కేంద్రంలో పదుల సంఖ్యలో టీకా తీసుకోగా, వారిలో ఒకరికో ఇద్దరికో ఆరోగ్య సమస్యలు తలెత్తితే అది టీకాతో కాదని తేల్చి చెప్పాయి. 


ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా..  

విఠల్‌రావు గత 13ఏళ్లుగా 108 పైలట్‌గా పని చేస్తున్నారు. 45రోజుల క్రితం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం కంకేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సెలవుపైనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే విఠల్‌రావు కోలుకుంటున్నారు. తాజాగా ఆయన కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడం.. మరుసటి తెల్లవారుజామునే గుండెపోటుతో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.  

Updated Date - 2021-01-21T06:29:29+05:30 IST