ధరాఘాతం!

ABN , First Publish Date - 2021-10-18T06:13:13+05:30 IST

ఆర్థిక సంక్షోభానికి కరోనా సంక్షోభం తోడయింది.

ధరాఘాతం!

డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో మధ్య తరగతి విలవిల 

కరోనాకు ముందు డీజిల్‌ ధర రూ.69.92, పెట్రోల్‌ రూ.76.05 

ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.103.91, పెట్రోల్‌ రూ.111.41

20 మాసాల్లో డీజిల్‌పై రూ.33.99, పెట్రోల్‌పై రూ.35.36 భారం

జిల్లాపై భారం రూ.10 వేల కోట్లు


ఆర్థిక సంక్షోభానికి కరోనా సంక్షోభం తోడయింది. సామాన్య ప్రజల జీవనస్థితి గతి తప్పింది. కష్టకాలంలో ఆదుకోవలసిన పాలకులు కష్టాల ఊబిలోకి నెట్టారు. ప్రజలపై ఎడాపెడా ధరల భారాన్ని మోపేస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలే ఇందుకు నిదర్శనం. కరోనాతోపాటే పెరిగిన చమురు ధరలు.. మధ్య తరగతి ప్రజలను, రవాణా రంగాన్ని కుంగదీస్తున్నాయి. కరోనా తరువాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న ప్రజలను ఆదుకోవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరమే లేకుండా ఎడాపెడా పన్నులు వడ్డిస్తూ కోలుకోని దెబ్బతీస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గత ఏడాది ఆరంభంలో కరోనాకు ముందు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు, నేటికి ఉన్న వ్యత్యాసం చూస్తే కళ్లు తిరగకమానవు. నొప్పి తెలియకుండా భారాలు మోపాలనుకున్నారేమో పాలకులు పెట్రో ధరలను పైసల్లోనే పెంచుకుంటూ మెల్లగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సెంచరీ దాటించేశారు. 

కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ప్రజల జీవన ప్రమాణాలు తరిగిపోతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత దెబ్బతీస్తున్నాయి. చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ నలిగిపోయేది మధ్య తరగతి వర్గాలే. పరోక్షంగా ఈ వర్గాలపైనే భారం అధికంగా పడుతోంది. హద్దే లేకుండా పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరల కారణంగా ఇప్పటికే నిత్యావసరాలు మొదలుకుని అనేక ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు ఏమీ కొనలేని స్థితిలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో బడా వ్యాపారులకు ఉద్దీపనలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగు పరచటానికి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కరోనాతో పాటే పెరిగిన చమురు ధరలే ఇందుకు నిదర్శనం. 


కరోనాకు ముందు ఇలా..

కరోనా మొదటి దశకు సరిగ్గా నెల రోజుల ముందు ఫిబ్రవరి 29, 2020న డీజిల్‌ లీటరు ధర రూ.69.92 ఉండగా, పెట్రోల్‌ ధర రూ.76.05 ఉంది. వాస్తవానికి ఆ నెలలో ఉత్తరాదిన ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆ నెల ప్రారంభంలో ఉన్న రేట్ల కంటే ఓ రూపాయి తగ్గించింది. 


కరోనా రెండో దశ తర్వాత...

కరోనాకు ముందు, రెండో దశకు తర్వాత డీజిల్‌, పెట్రోల్‌ ధరల్లో ఊహించనంత వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం నాటికి డీజిల్‌ ధర రూ.103.91 ఉండగా, పెట్రోల్‌ ధర రూ.111.41 ఉంది. ఈ లెక్కన చూస్తే 20 మాసాల్లో డీజిల్‌ ధరలు రూ.33.99, పెట్రోల్‌ ధరలు రూ.35.36 పెరిగాయి. 


రవాణా రంగంపై రూ.4,860 కోట్ల భారం  

రవాణా, వ్యవసాయం తదితర రంగాలపై చమురు ధరల ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. రవాణా రంగానికి సంబంధించి జిల్లాలో 25 వేల జాతీయ పర్మిట్‌ లారీలు ఉండగా, వాటిపై ఏడాదికి రూ.3,599.10 కోట్ల భారం పడింది. 20 వేల నాన్‌ నేషనల్‌ పర్మిట్‌ లారీలపై రూ.863.78 కోట్లు, ఆటోలపై రూ.179.95 కోట్ల భారం పడుతోంది. ఇవి కాకుండా జిల్లావ్యాప్తంగా స్కూల్‌, కాలేజీ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. వీటిపై రూ.117.17 కోట్ల భారం పడుతోంది. వ్యవసాయదారులు ఉపయోగించే ట్రాక్టర్లు, మోటార్లపై భారం రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కలిపితే రూ.4,860 కోట్ల వరకు భారం పడుతోంది. 


సగటున రూ.30కి పైగా పెరిగిన ధరలు  

డీజిల్‌ ,పెట్రోల్‌ ధరలు ఈ కాలంలో లీటర్‌కు సగటున రూ.30పైనే పెరిగాయి. ఒకప్పుడు ఈ ధరలు ఇంత భారీగా పెరగటానికి దశాబ్ద కాలమైనా పట్టేది. అలాంటిది ఇంత తక్కువ వ్యవధిలో ఊహించనంత అధికంగా పెరగటం మధ్యతరగతి ప్రజపైనే కాక, రవాణా తదితర రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ స్థాయిలో ప్రజల ఆదాయం పెరగకపోగా మరింత క్షీణించింది. ఉద్యోగుల వేతనాలు తరిగిపోయాయి. ఉపాధి మృగ్యమైపోయింది. ప్రజలు అప్పుల పాలయ్యారు. ఇటువంటి స్థితిలో భారాలను మోపడం ద్వారా పాలకులు కోలుకోలేని దెబ్బతీస్తున్నారు.


ముడి చమురు ధరలు తగ్గినా.. 

కరోనా మహమ్మారి పడగవిప్పిన మొదటి దశలోనే అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. ఈ తరుణంలో ఇక్కడ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గాలి. కానీ అలా జరగలేదు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆదాయవనరుగా ఎంచుకోవడమే అందుకు కారణం. 


మధ్య తరగతిపై రూ.4,500 కోట్ల భారం 

ఈ 20 మాసాల్లో పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరల ప్రభావం పరోక్షంగా మధ్య తరగతి ప్రజలపై పడింది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. జీతాలు పెరగకపోవటం, జీవన వ్యయం పెరగటం వీరిపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లావ్యాప్తంగా 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరిలో 40 శాతంగా ఉన్న ఎగువ తరగతి వర్గాలను మినహాయిస్తే, దాదాపు 30 లక్షల మందిపై పరోక్షంగా ధరల ప్రభావం పడింది. సగటున నలుగురు కుటుంబ సభ్యుల దామాషా ప్రాతిపదికన చూస్తే 7,50,000 కుటుంబాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రతి కుటుంబంపై నిత్యావసరాల పెరుగుదల ద్వారా రూ.2 వేలు, పెట్రోల్‌ వినియోగంపై రూ.1500, కూరగాయలు, వస్ర్తాలు, ఇతర దైనందిన అవసరాలపై రూ.1500 దామాషాగా తీసుకుంటే రూ.5 వేల వరకు భారం పడుతుంది. ఈ లెక్కన నెలకు సగటున 7.50 లక్షల కుటుంబాలపై రూ.375 కోట్ల భారం పడుతోంది. ఏడాదికి రూ.4,500 కోట్ల మేర భారం పడుతోంది. 

Updated Date - 2021-10-18T06:13:13+05:30 IST