డీజిల్‌ ధర 101.34

ABN , First Publish Date - 2021-10-05T06:25:53+05:30 IST

నాలుగు నెలల కిందటే పెట్రోల్‌ ధర సెంచరీ దాటగా, ఇపుడు డీజిల్‌ కూడా శతకం బాదేసింది.

డీజిల్‌ ధర 101.34

తిరుపతి, ఆంధ్రజ్యోతి: పెట్రోల్‌ బాటలోనే డీజిల్‌ పయనిస్తోంది. నాలుగు నెలల కిందటే పెట్రోల్‌ ధర సెంచరీ దాటగా, ఇపుడు డీజిల్‌ కూడా శతకం బాదేసింది. కరోనాకు ముందు, అంటే 2020 మార్చిలో.. ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలను పోల్చుకుంటే ఊహించుకోలేని వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పటికి.. ఇప్పటికి లీటరుపై పెట్రోల్‌ రూ.34.35, డీజిల్‌ రూ.32.40 చొప్పున ధరలు పెరిగాయి. డీజిల్‌ ధర పెరగడం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో 302 పెట్రోల్‌ బంకులున్నాయి. రోజుకు 14.02 లక్షల లీటర్ల పెట్రోల్‌, 23.05 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు వంటి వాహనాలు సుమారు 1,27,041 ఉన్నాయి. 20 నెలలుగా పెరిగిన ధరలను గమనిస్తే పెట్రోల్‌ లీటరుకు రూ.34.35 పెరిగింది. ఈ లెక్కన పెట్రోల్‌వాడే వాహనదారులపై రోజుకు రూ.4.81 కోట్లు భారం పడుతోంది. అలాగే 20 నెలల్లో లీటరు డీజిల్‌ ధర రూ.32.40 పెరిగింది. ఈ లెక్కన డీజల్‌ వాడే వాహనదారులపై రోజుకు రూ.7.46 కోట్ల భారం ఉంది. ఈ రెండింటి భారం రోజుకు రూ.12.27 కోట్లుకాగా.. నెలకు రూ.368 కోట్లు, ఏడాదికి రూ.4,417 కోట్ల భారం జిల్లా వాహనదారులపై పడుతోంది. 


అన్నివర్గాలూ సతమతం

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో అన్ని వర్గాలూ సతమతమవుతున్నాయి. ప్రభుత్వాలు వీటిపై తగిన రీతిలో దృష్టి పెట్టడం లేదన్న ఆవేదన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుతాయని ఆశ పడుతున్నా.. ఆ కల నెరవేరడం లేదు. రెండేళ్లుగా కరోనాతో అవస్థ పడుతున్న జనంపై పెరుగుతున్న నిత్యావసరాల ధరల భారానికి ఈ ఇంధన ధరలు జత కలవడంతో కుటుంబాల ఆర్థిక ప్రణాళిక గాడి తప్పుతోంది.

Updated Date - 2021-10-05T06:25:53+05:30 IST