సరైన డైట్‌తో శరీర దుర్గంధానికి చెక్‌!

ABN , First Publish Date - 2020-02-15T05:35:22+05:30 IST

తేన్పులు వచ్చినపుడు నోట్లో నుంచి చెడు వాసన వస్తోంది. నోటి దుర్వాసన కూడా ఉన్నట్టు అనిపిస్తోంది.

సరైన డైట్‌తో శరీర దుర్గంధానికి చెక్‌!

తేన్పులు వచ్చినపుడు నోట్లో నుంచి చెడు వాసన వస్తోంది. నోటి దుర్వాసన కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇవి పోవాలంటే తీసుకోవాల్సిన డైట్‌ గురించి చెప్పండి. శరీర దుర్గంధానికి, డైట్‌కి   సంబంధం ఉందా?

- వాసంతి, హైదరాబాద్‌


మీరు మూడు ప్రశ్నలు అడిగారు. నోటి దుర్వాసన, తేన్పులు, శరీర దుర్గంధం... నోటి దుర్వాసన అనేది కేవలం నోటికి సంబంధించినది. రెండు పూటలా పళ్లు తోమకపోవడం, ఆహారంలో ఫ్రూట్స్‌, వెజిటెబుల్స్‌ లేకపోవడం, నిద్రకు ముందు తీపి పదార్థాలు తిని నోరు కడుక్కోకపోవడం, పళ్లకు పుచ్చులు, రంధ్రాలు ఉంటే వాటికి చికిత్స చేయించుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తుంది. ఇది ఇన్ఫెక్షన్‌కి దారి తీస్తుంది. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. రెండు పూటలా దంతాలు శుభ్రం చేసుకోవాలి.

తేన్పుల విషయానికొస్తే... సరిగా అరుగుదల లేకపోవడం వల్ల, ఎక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తినడం వల్ల, పండ్లు కూరగాయలు సరిగా తినకపోవడం వల్ల, మందులు, ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల వచ్చే అవకాశం ఉంది. కారణం తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, మజ్జిగ అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. ప్రతి రోజూ సులువుగా మల విసర్జన జరిగేలా చూసుకోవాలి. నీరు బాగా తాగాలి.

శరీర దుర్గంధం అనేది మనం తీసుకునే ఆహారం, వేసుకునే బట్టలు, చెమట, బ్యాక్టీరియా, వాడే సబ్బులు, పెర్‌ఫ్యూమ్స్‌ వల్ల మార్పు చెందుతూ ఉంటుంది. శరీర శుభ్రత అనేది శరీర దుర్గంధాన్ని డిసైడ్‌ చేస్తుంది. ముఖ్యంగా జెనిటల్స్‌ శుభ్రత, మల మూత్ర విసర్జన తర్వాత తీసుకునే జాగ్రత్తలు, నావల్‌ (నాభి), చంకలు, చెవులు, ముక్కు, నోరు శుభ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి శరీర మలినాలను విసర్జించడమేగాక, కొత్త కణాల్ని పుట్టించి ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరాన్ని కాంతిమంతం చేస్తాయి. శరీర పరిశుభ్రత అంటే కేవలం చెడు వాసన నివారించడానికే కాకుండా, ఆరోగ్యం కోసం కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆహారం, వ్యాయామం, నిద్ర ఎంత ముఖ్యమో, శరీర శుభ్రత కూడా ఎవరికైనా అంతే ముఖ్యం.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-02-15T05:35:22+05:30 IST