ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2022-08-06T06:56:14+05:30 IST

జిల్లాలో ఇటీవల పలువురు అధికారులకు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య విభేదాలు


- బదిలీపై కొందరు...సెలవుల్లో మరికొందరు అధికారులు

- జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఘటనలు

జగిత్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల పలువురు అధికారులకు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించాల్సిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు పొసగకపోవడంతో దీని ప్రభావం  అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. ఇటీవల జిల్లాలో వరుస సంఘటనలు నెలకొంటుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నేతలతో విభేదాల కారణంగా ఒకరిద్దరు అధికారులు సెలవులపై వెళ్లగా మరో ఒకరిద్దరు అధికారుల బదిలీ అయినట్లు ఉద్యోగ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులుండడంతో ఆయా ప్రభుత్వ శాఖల్లో దీని ప్రభావం పడుతోంది.

- ప్రజాప్రతినిధులతో పొసగకపోవడం వల్లే..

జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులతో విభేదాల వల్ల కొందరు అధికారులు బదిలీ చేయించుకోగా, మరికొందరు అధికారులు సెలవుల్లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్‌ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో మరో అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. వెంటనే సంబంధిత అధికారి బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధులతో పొసగకపోవడం వల్లే డీపీవో బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గొల్లపల్లి మండలానికి చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి వ్యవహారంలో తలెత్తిన విభేదాలే డీపీవో సెలవుపై వెళ్లడానికి కారణమన్న ప్రచారం ఉంది. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు డీపీవోపై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల మనస్తాపానికి గురయిన డీపీవో సెలవుపై వెళ్లినట్లుగా వినిపిస్తోంది. ఇటీవల జిల్లా పౌరసంబంధాల అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. డీపీఆర్‌వో వైఖరిని వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడం తదితర కారణాల వల్ల బదిలీ జరిగినట్లుగా ప్రచారంలో ఉంది. మెప్మాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి సైతం వివాదంలో ఇరుక్కొని ప్రజాప్రతినిధులు, అధికారుల ఆగ్రహానికి గురయి సస్పెన్షన్‌ అయ్యాడు. ఇటీవలనే తాజాగా సదరు అధికారి తిరిగి బాధ్యతలు చేపట్టారు.

- సెలవుల్లో  ఇన్‌చార్జి జడ్పీ సీఈవో..

జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈవో వరదరాజన్‌ సుమారు పదిహేను రోజులుగా సెలవుల్లో ఉన్నారు. జడ్పీ సీఈవో సెలవుపై వెళ్లడం వెనక వివిధ కారణాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత అవసరాల వల్ల సెలవుపై వెళ్లారా... ప్రజాప్రతినిధులతో పొసగకపోవడం వల్ల వెళ్లారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులతో విభేదాలే సెలవుపై వెళ్లడానికి కారణమని ఉద్యోగ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సెలవుల్లో ఉన్న జడ్పీ ఇన్‌చార్జి సీఈవో వరదరాజన్‌ స్థానంలో ప్రస్తుతం కొన్ని రోజులుగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

-  మున్సిపల్‌ కమిషనర్‌ను సరెండర్‌ చేయాలంటూ..

జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ను సరెండర్‌ చేయాలంటూ సాక్ష్యాత్తు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు పట్టుపడుతున్నారు. కమిషనర్‌ను బదిలీ గానీ, సరెండర్‌ గానీ చేయాలంటూ మున్సిపల్‌ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు నాలుగు రోజులు క్రితం వినతిపత్రం అందించారు. దీంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి అధికారులకు సైతం పలువురు ప్రజాప్రతినిధులు వినతిపత్రం పంపించారు. ఈ ఘటన జగిత్యాల మున్సిపల్‌లో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలకు అద్దంపడుతోంది. ప్రజాప్రతినిధులు బహిరంగంగా మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీని కోరడం బల్ధియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బల్ధియాలో పలువురు కింది స్థాయి అధికారులు సైతం వివిధ కారణాల వల్ల సెలవుపై వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌లకు వివరించారు. ఇలా జిల్లాలో చోటుచేసుకున్న పలు సంఘటనలు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య నెలకొన్న విభేదాలకు అద్దం పడుతున్నాయి. 

- విభేదాలకు కారణాలెన్నో...

అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, నిధుల మంజూరు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యం తదితర విషయాలు అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాము పలు సందర్బాల్లో జారీ చేసే హుకూంలను అధికారులు పట్టించుకోవడం లేదన్న గుర్రుతో ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేస్తుండడం, బదిలీలు చేయిస్తుండడం వంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య చోటుచేసుకుంటున్న ప్రచ్చన్న యుద్ద వాతావరణం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుందున్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు, రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-08-06T06:56:14+05:30 IST