Hyderabad లో పగలు ఉక్కపోత.. రాత్రి కుండపోత..!

ABN , First Publish Date - 2021-07-17T13:52:56+05:30 IST

గ్రేటర్‌లో విచిత్ర వాతావరణం నెలకొంటుంది.

Hyderabad లో పగలు ఉక్కపోత.. రాత్రి కుండపోత..!

  • భాగ్యనగరంలో భిన్న వాతావరణం


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. ఉదయం ఉక్కపోత, తేమ వాతావరణం ఉండడంతోపాటు రాత్రివేళ ఆకస్మాత్తుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం.. క్రమేణా భారీగా మారుతుండడంతో రోడ్లపై వరద ముంచెత్తుతోంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ఉధృతంగా వస్తుండడంతో స్థానికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వచ్చిన వరదను బయటకు పంపించేందుకు తండ్లాడుతున్నారు.


రెండు రోజులుగా నగరంలో కురిసిన వర్షమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో వర్షాలు దంచికొట్టాయి. అక్టోబర్‌ 13న ఒకే రోజు 19 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. గత బుధవారం అర్ధరాత్రి ఉప్పల్‌ బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వర్షం పడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల 14న నగరంలో 27.4 డిగ్రీలు, 15న 29.2, 16న 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడిమి, ఉక్కపోత కనిపిస్తున్నప్పటికీ రాత్రి 9 తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. 


వర్షాల తీవ్రతతో శివారు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. గురువారం రాత్రి 12 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కూకట్‌పల్లిలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 5.3, ఉప్పల్‌లో 4.3, రామంతాపూర్‌లో 3.8, హబ్సీగూడలో 3.8, అల్కాపురిలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-17T13:52:56+05:30 IST