నూతన విద్యా విధానంపై భిన్న స్వరాలు

ABN , First Publish Date - 2020-07-31T08:15:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీ య నూతన విద్యా విధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యావిధానంలో భాగంగా పలు మార్పులకు శ్రీకా రం చుట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. సంబంధిత శాఖ పేరును సైతం మార్చబోతోంది. అయితే.. ఈ నూతన విద్యా విధానం ఏవిధంగా

నూతన విద్యా విధానంపై భిన్న స్వరాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీ య నూతన విద్యా విధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యావిధానంలో భాగంగా పలు మార్పులకు శ్రీకా రం చుట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. సంబంధిత శాఖ పేరును సైతం మార్చబోతోంది. అయితే.. ఈ నూతన విద్యా విధానం ఏవిధంగా ఉండబోతోంది, పిల్లల చదువులు ఏవిధంగా సాగుతాయనే అంశాలపై తల్లిదండ్రుల్లోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. దీనిపై పలువురు మేధావులు, విద్యార్థి నేతలు ‘ఆంధ్రజ్యోతి’తో గురువారం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


విద్యా విధానం కాలానుగుణంగా మారాలి

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆలోచనా ధోరణి చాలా మారింది. పుస్తకాలు చదవడం అనేది మూస విధానంలా వారికి అనిపిస్తోంది. గడచిన 30 ఏళ్లలో ఎన్నో సాంకేతిక విప్లవాలు చూశాం. తమకు కావలసింది తామేనేర్చుకుంటామనే తత్వం ఈ మధ్య పిల్లల్లో బలంగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాంటి విధానం అమల్లో ఉంది. మారిన పరిస్థితుల్లో వస్తున్న ఈ కొత్త విద్యా విధానాన్ని స్వాగతించాలి. పిల్లలకు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువు చెప్పాలనడం గొప్ప విషయం. మాతృభాషలో బోధన పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. 

-హెచ్‌సీయూ వీసీ  ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు


నూతన విద్యా విధానం అమలునే ముఖ్యం

విదేశాల్లో చదవాలంటే 16 ఏళ్లు తప్పనిసరిగా ఇక్కడ చదివుండాలి. కానీ.. కొత్త విద్యా విధానంలో దీన్ని 15 ఏళ్లకు కుదించారు. ప్రస్తుతం డిగ్రీ చేసినవారు ఒక సంవత్సరం హానెస్టు కోర్సు చదివి విదేశాల్లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్తున్నారు. మరి దీన్ని ఎలా సరిచేస్తారో చూడాలి. కొత్త పాలసీ బ్లూ ప్రింట్‌ డాక్యూమెంటేషన్‌ బాగుంది. కానీ అమలు ఏలా ఉంటుందో చూడాలి. క్వాలిఫైడ్‌, కమిటెడ్‌ టీచర్లు ఉండాలి. టెక్నాలజీని వాడాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. వాటికి సరిపడా నిధులివ్వాలి.

-డాక్టర్‌ డీఎన్‌ రెడ్డి, డైరెక్టర్‌, సీఆర్‌రావు ఏఐఎంఎ్‌ససీఎస్‌, హెచ్‌సీయూ క్యాంపస్‌


వర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకే..

యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే పాలసీలు నూతన విద్యావిధానంలో ఉన్నాయి. విద్యను గ్లోబల్‌ మార్కెట్లో ఒక వస్తువుగా మార్చేందుకు అనువైన పాలసీగా నూతన విద్యా విధానం ఉంది. విద్యారంగాన్ని ప్రైవేటీకరణనుంచి కాపాడుకోవడంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా కలిసి ముందుకు నడవాలి. దీనిలోని అంశాలు విద్యారంగంలోకి కార్పొరేట్‌, విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా చర్యలు లేవు.

-ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, ఆల్‌ ఇండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు


విద్యార్థులకు వ్యతిరేకం.. ఈ విధానం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానం ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత కుప్పకూల్చేలా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేసేందుకు ప్రభుత్వం.. కరోనా సమయాన్ని ఒక సువర్ణావకాశంలా ఉపయోగించుకుంటోంది. న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీలో విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం, ప్రభుత్వ విద్యాలయాల్లోని ఖాళీల భర్తీ తదితర అంశాల ఊసే లేదు. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయాలనూ అందులో ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో అశాస్త్రీయ ఽధోరణులకు అద్దంపట్టే నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. - ప్రొఫెసర్‌ ఆర్‌. గంగాధర, ఏఐడీఎ్‌సఓ రాష్ట్ర అధ్యక్షుడు 

Updated Date - 2020-07-31T08:15:40+05:30 IST