Abn logo
May 1 2021 @ 16:19PM

సెకెండ్ వేవ్ గురించి తెలిసినా పట్టించుకోలేదా?.. ఇంకా ఎన్ని వేవ్స్ వస్తాయి..?

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతిని ముందే ఊహించారా? కేంద్రానికి ఆ సమాచారం ముందే తెలుసా? సెకెండ్ వేవ్‌పై రాష్ట్రాలను ముందుగానే హెచ్చిరించిందా? ఇలాంటి వేవ్‌లు మరెన్ని రాబోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, మందుల కొరత, వైద్యుల కొరత, వ్యాక్సిన్ల కొరత.. ఈ జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా ఎందుకు సిద్ధమవలేదు?


దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని గతేడాది జూలైలోనే ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. ప్రజలు, ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక, కేంద్ర ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే.. వైరస్ రెండో దశ దేశంలో విలయ సృష్టిస్తుందని ఈ ఏడాది మార్చి 9వ తేదీన కేంద్రాన్ని హెచ్చరించింది. అప్పటికే మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లలో రెండో దశ మొదలైందని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోకుంటే దేశమంతా వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలు, కుంభమేళా నిర్వహించి కరోనా రెండో దశకు తలుపులు బార్లా తెరిచింది. 

ఇంకా ఎన్ని కరోనా వేవ్స్ వస్తాయో.. ఊహించడం కష్టం..

కరోనా వైరస్‌కున్న జన్యు పరివర్తన సామర్థ్యం వల్ల ఇలాంటి వేవ్స్ ఇంకా ఎన్ని వస్తాయో ఇప్పుడే ఊహించడం కష్టమని ఎయిమ్స్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు. `కరోనా వైరస్ మ్యుటేషన్స్ కారణంగా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియెంట్లను ఇప్పటి వరకు కనుగొన్నారు. వీటిల్లో యూకే వేరియెంట్ చాలా ప్రమాదకారి. చాలా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో రెండో దశ ఉద్ధృతి ఇంత భారీగా ఉండడానికి ఇదే కారణం. వైరస్‌ ఇలా రూపం మార్చుకుంటుంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యం కాదు. అలాగే వ్యాక్సిన్లు కూడా వంద శాతం సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పలేం. ఈ వ్యాక్సిన్ల వల్ల వచ్చే రోగ నిరోధక శక్తి ఒక సంవత్సరం వరకు పనిచేయవచ్చు. ఈ కారణాల వల్లే భారత్‌లో కరోనా వేవ్‌లు ఎన్ని వస్తాయో ఊహించడం కష్టంగా మారింది. వైరస్‌లో వచ్చే మ్యుటేషన్లే ఈ మహమ్మారి దశలను నిర్దేశిస్తాయి. ఏదేమైనా ఈ వైరస్‌తో మనం ఎక్కువ కాలం సహజీవనం చేయాల్సి ఉంటుంద`ని ఆయన అభిప్రాయపడ్డారు. `సుప్రీం` ప్రశ్నలు..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌‌ను సుప్రీంకోర్టు `జాతీయ సంక్షోభం`గా అభివర్ణించింది. కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వందశాతం వ్యాక్సిన్లు కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని, ఆక్సిజన్‌ ట్యాంకర్లు, సిలిండర్లు ఆసుపత్రులకు చేరడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, కేంద్రం, రాష్ట్రాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకుందని, నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదని ప్రశ్నించింది. కేంద్రం పరిగణించాల్సిన ముఖ్యమైన విధాన మార్పులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, తగిన ఆదేశాలు రూపొందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మే 10వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.


రాష్ట్రాలను కేంద్రం ముందే హెచ్చరించిందా? 

కరోనా రెండో దశ విలయం గురించి దేశంలోని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ముందుగానే హెచ్చరించామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. డిసెంబర్ 4, 2020న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పేర్కొంది. కోవిడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌ను పెంచుకోవాలని, హాస్పిటల్స్‌లో మరిన్ని బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపింది.


ఏదేమైనా కరోనా సెకెండ్ వేవ్ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇంతటి విలయం ఉండేది కాదు. అధినేతలు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చేది కాదు.  

Advertisement
Advertisement