డిజిటల్‌ భూసర్వే వాయిదా!

ABN , First Publish Date - 2021-06-11T10:12:53+05:30 IST

రాష్ట్రంలో అక్షాంశాలు, రేఖాంశాల(కో ఆర్డినేట్స్‌) ఆధారంగా భూముల సరిహద్దులను నిర్ణయించేందుకు శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టదలచిన డిజిటల్‌

డిజిటల్‌ భూసర్వే వాయిదా!

ఏజెన్సీల ఎంపికకు టెండర్లు.. రేపటిలోగా దరఖాస్తు చేయాలి


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్షాంశాలు, రేఖాంశాల(కో ఆర్డినేట్స్‌) ఆధారంగా భూముల సరిహద్దులను నిర్ణయించేందుకు శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టదలచిన డిజిటల్‌ భూసర్వే వాయిదా పడింది. తొలుత 17 ఏజెన్సీలతో జాబితాను రూపొందించిన ప్రభుత్వం వాటితో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపింది. ఆ ఏజెన్సీల ద్వారానే సర్వే చే యాలని నిర్ణయించుకొంది. హఠాత్తుగా జాబితాను పక్కనబెట్టి ఏజెన్సీలను ఎంపిక చేయడానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టెండర్లు పిలిచింది. టెండర్ల ద్వారా ఏజెన్సీల ఎంపిక పూర్తయ్యాక గ్రామాల జాబితాను వాటికి అప్పగించి,ప్రయోగాత్మక సర్వేకు వెళతారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మూడేసి గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టాలని గతంలో తీసుకున్న నిర్ణయం తాజా మార్పుతో వాయిదా పడింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈనెల 12వ తేదీ రాత్రి 9 గంటల దాకా గడువు ఇచ్చారు.


13న ఉదయం 11 గంటలకు టెండర్లు తెరుస్తారు. టెండర్లకు దరఖాస్తు చేసుకునే సంస్థలు గత మూడు సంవత్సరాలకు గాను ఆర్థిక లావాదేవీల సమాచారం కూడా పొందు పరచాల్సి ఉంటుంది. గతానుభవాలను కూడా వివరించాలి. ఒక ఎకరా సర్వే చేయడానికి ఏ మేర ఖర్చవుతుంది? యూనిట్‌ ధర ఎంత? మొత్తం కలిపి ఎంత ధరకు సర్వే చేస్తారు? సర్వే పరికరాలు, డ్రోన్లు, ఏరియల్‌ ఫొటోగ్రఫీ, శాటిలైట్‌ చిత్రాలు, మానవ వనరులకు అయ్యే వ్యయం ఎంత? డేటాను ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చు... వంటి వివరాలను కమర్షియల్‌ బిడ్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది. టెండర్ల తర్వాత సంస్థల సామర్థ్యాల ఆధారంగా ప్రయోగాత్మక సర్వే బాధ్యతలు అప్పగిస్తారు.


ఏజెన్సీల ఎంపిక తర్వాతే

ఏజెన్సీల ఎంపిక తర్వాతే గ్రామాల ఎంపికను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఇప్పటికే ప్రతీ జిల్లాలో కలెక్టర్లు నాలుగైదు గ్రామాలను ఎంపిక చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏయే గ్రామాల్లో సర్వే చేయాలనే దానిపై సీఎంవోనే తుది నిర్ణయం తీసుకోనుంది. ఎంపిక చేసిన ఏజెన్సీలు ఆ గ్రామానికి సంబంధించి ధరణి రికార్డులననుసరించి క్షేత్రస్థాయిలో రైతుకు ఎంత భూమి ఉందో, సరిహద్దులేమిటో అక్షాంశాలు, రేఖాంశాలు(కోఆర్డినేట్స్‌) ఆధారంగా నిర్ధారించి, డిజిటల్‌ రికార్డులు అందిస్తాయి. కోఆర్డినేట్స్‌ ఆధారంగా ఎవరైనా సదరు భూమి హద్దులను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

Updated Date - 2021-06-11T10:12:53+05:30 IST