ఇక డిజిటల్‌ లైబ్రరీలు

ABN , First Publish Date - 2022-01-29T04:31:37+05:30 IST

మెదక్‌ జిల్లాలోని గ్రంథాలయాలను డిజిటలైజేషన్‌ చేయనున్నామని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్‌ అన్నారు

ఇక డిజిటల్‌ లైబ్రరీలు

మెదక్‌లో రెండున్నర కోట్లతో జిల్లా గ్రంథాలయం

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్‌


మెదక్‌అర్బన్‌, జనవరి28: మెదక్‌ జిల్లాలోని గ్రంథాలయాలను డిజిటలైజేషన్‌ చేయనున్నామని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా శాఖ గ్రంథాలయంలో చైర్మన్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెదక్‌లో రెండున్నర కోట్ల వ్యయంతో నూతనంగా జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించేందుకు స్ధానిక కోర్టు పక్కన 38 గుంటల ప్రభుత్వ స్ధలాన్ని కేటాయించినట్లు చెప్పారు. 2022-23 బడ్జెట్‌లో భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ప్రతిపాదించామన్నారు. నర్సాపూర్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న భవనం తుదిదశలో ఉందన్నారు. రేగోడ్‌లో రూ.25 లక్షలతో గ్రంథాలయ నిర్మాణానికి కలకత్తాలోని రాజారామ్‌ మోహన్‌రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ద్వారా రూ.4.34 కోట్ల పన్నులు వసూలు చేయాలన్నది లక్ష్యం కాగా అందులో 8 శాతం సెస్‌ రూపంలో సుమారు రూ. 57లక్షల ఆదాయం గ్రంథాలయాలకు వస్తుందన్నారు. ఈ నిధులు గ్రంథాలయాల పటిష్టతకు ఉపయోగపడతాయన్నారు. 2022-23కు భవన నిర్మాణాలకు, మరమ్మతులకు, పుస్తకాలు, మ్యాగజైన్లు, ఫర్నీచర్‌, కంప్యూటర్లు, తదితర కొనుగోలు చేయుటకు, అ వుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు రూ. 1.58 కోట్ల బడ్జెట్‌కు పౌర గ్రంథాలయశాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపేందుకు సమావేశం తీర్మానించిం ది. సమావేశంలో వయోజన విద్య ఉపసంచాలకులు రామేశ్వర్‌, డీపీఆర్‌వో శాంతికుమార్‌, సభ్యులు అనూష, సిద్దిరాంలు, విజయలక్ష్మి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T04:31:37+05:30 IST