ముంబై: ఆన్‌లైన్ రుణాల్లో పెరిగిన వేధింపు సంఘటనలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ డిజిటల్ రుణాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్ నాయకత్వం వహించే ఈ బృందంలో ఆర్‌బీఐలో పని చేస్తున్న వారిలో కొందరితో పాటుగా వెలుపలి నిపుణులను కూడా సభ్యులుగా నియమించారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. డిజిటల్ లెండింగ్ కార్యకలాపాల తీరును పరిశీలించడంతో పాటు అవి సమాజంలోకి ఎంతగా విస్తరించాయి, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి కూడా సమీక్షించాల్సి ఉంటుంది. డిజిటల్ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి నియంత్రణ లేదా చట్టబద్ధమైన చర్యలను కూడా ఆ కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ లెండింగ్ విభాగంలో పని చేస్తున్న కంపెనీలకు ప్రవర్తనా నియమావళిని కూడా సూచించాలి.