డిజిటల్‌ రాఖీ

ABN , First Publish Date - 2020-08-03T09:40:05+05:30 IST

అనూ .. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె సోదరుడు గతంలో బ్రిటన్‌లో ఉద్యోగం చేసేవారు. నిరుడే స్వస్థలానికి వచ్చారు.

డిజిటల్‌ రాఖీ

  • వాట్సాప్‌ ద్వారానే అనురాగ సందేశాలు
  • పోస్టు ద్వారానూ సోదరీమణుల సందేశం
  • ఒకే ఊర్లో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా ఇదే తీరు
  • కరోనా వ్యాప్తితో రాఖీలు కట్టేందుకు  ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అనూ .. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె సోదరుడు గతంలో బ్రిటన్‌లో ఉద్యోగం చేసేవారు. నిరుడే స్వస్థలానికి వచ్చారు. గత రాఖీ పౌర్ణమి రోజు సోదరుడికి రాఖీ కట్టి పండుగను గొప్పగా జరుపుకొన్నారామె. ఈసారి ఆమె, సోదరుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కరోనా వ్యాప్తితో సోదరుడి ఇంటికి వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితి. ‘‘తమ్ముడు ఉండే గేటెడ్‌ కమ్యూనిటీలో ఔట్‌సైడర్స్‌కు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. వాడు వస్తానని చెబితే మా చుట్టు పక్కల కొవిడ్‌ కేసులు ఎక్కువ ఉన్నాయని రావొద్దని చెప్పాను. వాట్సాప్‌ కాల్‌లోనే రాఖీ వేడుకలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని ఆమె చెప్పారు! నగరంలో చాలామందిది ఇదే పరిస్థితి! వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు వారిళ్లకు వెళ్లాలనే ఆలోచనను చాలామంది సోదరీమణులు దూరం పెట్టారు. అయితే వేడుక వేడుకే కదా. అందుకే ఈసారి చాలామంది రాఖీ పండుగను ‘డిజిటల్‌’గా సెలెబ్రేట్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఓ రాఖీ, కుంకుమ భరిణ, హారతి ఉన్న ఫొటో.. దానికి ఓ చక్కని సందేశాన్ని జత చేసి వాట్సా్‌పలో పంపించడం సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గతంలో పండుగల సందర్భాల్లో వాట్సా్‌పలో వెల్లువెత్తే మెసేజ్‌లతో చికాకు పడే జనమే, ఇప్పుడు మెసేజ్‌లు పంపిస్తూ ‘డిజిటల్‌ రాఖీ ఫెస్టివల్‌’ను స్వాగతిస్తున్నారు.


వాట్సాప్‌ సందేశాలే కాదు.. 90 దశకంలో మాదిరిగా రాఖీలను పోస్టులోనూ పంపిస్తున్నారు. రాఖీలను పోస్టల్‌/కొరియర్‌ సర్వీసుల ద్వారా ఇప్పటికే ఎంతోమంది పంపారని పలు సంస్థలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా అంతకన్నా ఎక్కువమందే రాఖీలను పంపుతున్నారని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎన్నో వెబ్‌సైట్‌లలో కనిపించే లక్షలాది ఆప్షన్ల నుంచి తమ బడ్జెట్‌కు సరిపోయే రీతిలో రాఖీలను సెలెక్ట్‌ చేసుకుని పంపడం ఒక ట్రెండ్‌ అయితే డిజిటల్‌ రాఖీను తామే తయారుచేసి పంపడం మరో ట్రెండ్‌. రాఖీలతో పాటు గిఫ్ట్‌ హ్యాంపర్లను అందిస్తున్న సైట్లూ చాలానే ఉన్నాయి. ఈ ధోరణి బాగా పెరిగిందని యాప్‌ ప్రతినిధులు చెబుతున్నారు. మన దేశంలో ప్రేమికుల దినోత్సవం తర్వాత కాసుల పంట పండించే పండుగల్లో రాఖీపండుగ ఒకటన్నది ఈ-కామర్స్‌ నిపుణుల మాట.


గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి వ్యాపారం 100% పెరిగిందని ఫెర్న్‌ అండ్‌ పెటల్స్‌ లాంటి సంస్ధలు చెబుతున్నాయి. గిఫ్టింగ్‌ పేరిటా ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులనూ విడుదల చేశా యి. ఇక ఈసారి రాఖీ పండుగ మరింత వినూత్నం. కరోనా పోరులో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న వారికి రాఖీలు పంపి.. అభినందించేందుకు పలు గ్రీటింగ్‌ కార్డులు వచ్చాయి. ఓ మార్కెటింగ్‌ ఏజెన్సీకి చెందిన ప్రతినిధి విశాల్‌ మాట్లాడుతూ ఓ నర్సు, రోగి మధ్య రక్షాబంధన్‌ స్ఫూర్తి వర్ధిల్లానే ఆలోచనతో ఎక్కువగా ఈసారి గ్రీటింగ్స్‌ రూపుదిద్దుకున్నాయని చెప్పారు. 

Updated Date - 2020-08-03T09:40:05+05:30 IST