ఆర్టీసీలో డిజిటల్‌ సేవలు

ABN , First Publish Date - 2022-08-27T03:51:45+05:30 IST

టీఆస్‌ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు అధికారులు డిజిటల్‌ పేమెంట్స్‌లో టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు.

ఆర్టీసీలో డిజిటల్‌ సేవలు

- టికెట్ల జారీకి నగదు రహిత విధానం

- దశలవారీగా విస్తరణ

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26: టీఆస్‌ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు అధికారులు డిజిటల్‌ పేమెంట్స్‌లో టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ డిపోలో ఈ సేవలను డీఎం సుగుణాకర్‌ కొద్ది రోజులక్రితం లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లే మూడు సర్వీసులకు ఈ సేవలు అందిస్తుండగా అతి త్వరలో ఆసిఫాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే అన్ని సర్వీసులకు విస్తరిస్తామని వెల్లడించారు. 

డిపోకు 16 ఐ-టిమ్‌ మిషన్లు

బస్సుల్లో నగదు రహితసేవలను విస్తృత పరిచేందుకు ఆసిఫాబాద్‌ డిపోకు16ఐ-టిమ్‌ మిషన్లు(ఇంటిలిజెన్స్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌) కేటాయించారు. ఈ మిషన్లలో 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌కార్డు అమర్చి ఉంటుంది. ఇంటర్‌నెట్‌ సహకారంతో డిజిటల్‌ పేమెంట్స్‌లో టికెట్లను జారీచేస్తారు. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, ఫోన్‌పే, గుగుల్‌పేతో పాటు ఇతర యూపీఏ పేమెంట్స్‌ స్వీకరించి టికెట్లు జారీచేస్తారు. టిమ్‌ మిషన్‌పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా చెల్లింపులు చేసి టికెట్‌ పొందవచ్చు. ఈ టిమ్‌ మిషన్ల ఆపరేటింగ్‌పై టిమ్‌ డ్రైవర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. 

దళలవారీగా సేవల విస్తరణ

ఆసిఫాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపోలో మొత్తం 76షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఇందులో 13సర్వీసులు హైదరాబాద్‌ రూట్లలో నడుస్తున్నాయి. రాజధాని రెండు బస్సులు, సూపర్‌ లగ్జరీ ఏడు బస్సులు, డీలక్స్‌ నాలుగు బస్సులను ప్రతిరోజు అధికారులు నడుపుతున్నారు. ఉదయం ఆరు బస్సులు, రాత్రి ఏడు బస్సులు హైదరాబాద్‌ రూట్లలో నిత్యం ప్రయాణికులను గమ్యం స్థానాలకు చేరుస్తున్నాయి. రోజు ఈ రూట్లలో 13బస్సులు 8798కిలో మీటర్లు ప్రయాణించి సుమారు రూ.4లక్షల మేరకు ఆదాయాన్ని డిపోకు తీసుకువస్తుంటాయి. మారుతున్న కాలానుగుణంగా ప్రయాణికులకు డిజిటల్‌ సేవలను అందించే ఉద్దేశ్యంతో ఆర్టీసీ అధికారులు నగదు రహిత సేవలను ప్రారంభించారు. దశల వారీగా డిపో నుంచి హైదరాబాద్‌కు వెళ్లే అన్ని సర్వీసుల్లో డిజిటల్‌ సేవలను విస్తరించనున్నారు. 

నగదు రహిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి

- సుగుణాకర్‌, ఆసిఫాబాద్‌ డీఎం

ప్రయాణికులు నగదు రహిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ రూట్‌లో వెళ్లే బస్సులలో డిజిటల్‌ పేమెంట్‌లో టికెట్‌ జారీ ప్రక్రియను ప్రారంభించాం.డిపోకు 16ఐ-టిమ్‌ మిషన్లు(ఇంటిలిజెన్స్‌ టికెట్‌ ఇష్యూమిషన్‌) కేటాయించారు. రాబోయే రోజుల్లో సేవలను మరింత విస్తృతపరుస్తాం. 

Updated Date - 2022-08-27T03:51:45+05:30 IST