Apr 29 2021 @ 18:25PM

దిల్‌ రాజుకి రూల్స్‌ వర్తించవా?

భారీ బడ్జెట్‌ చిత్రాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల వరకూ ఓటీటీలో విడుదల కాకూడదని నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం. అందులో శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు కూడా సభ్యుడే! ఇప్పుడు ఆయనే మండలిలో పెట్టుకున్న నిర్ణయాన్ని ధిక్కరించారు. అయితే చిన్న సినిమా విషయంలో ఆయా నిర్మాతల బాగోగుల కోసం విడుదలైన తక్కువ రోజుల్లోనే విడుదలైన సందర్భాలున్నాయి. కానీ ‘వకీల్‌సాబ్‌’ లాంటి భారీ చిత్రం ఈ నెల 30న ఈ చిత్రం అమెజాన్‌ ఫ్రైమ్‌లో స్ర్టీమింగ్‌ కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పట్లో ఓటీటీలో విడుదల కాదు అని కూడా దిల్‌ రాజు మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఇప్పుడు దిల్‌ రాజుకి నియమాలు వర్తించవా, నిర్మాతల మండలి నియమాలు తుంగలో తొక్కారా? అంటూ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలో విడుదలైతే ఫ్యామిలీ ఆడియన్స్‌ దూరమవుతారని, థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కొందరు థియేటర్‌ యజమానులు గగ్గోలు పెడుతున్నారని వినికిడి. కనీసం పెద్ద సినిమాలైనా నియమాలకు అనుగుణంగా ఉంటే బావుంటుందని అంటున్నారు. 


ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ వల్ల థియేటర్లు లేకపోవడం వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం అనే లాజిక్‌ దిల్‌రాజుకి ఉండొచ్చు. కానీ, భవిష్యత్తులో బడా హీరోలతో ఆయన నిర్మించే సినిమాలను ఇలా రెండు మూడు వారాలకే ఓటీటీలో విడుదల చేయకుండా ఉంటారని నమ్మకంగా చెప్పగలరా? దీని వల్ల మరో వివాదం కూడా దిల్‌ రాజు మెడకు చుట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీకి ‘వకీల్‌ సాబ్‌’ విడుదల హక్కులు ఇచ్చారట. రూల్స్‌ ప్రకారమే ఓటీటీలో విడుదల చేస్తామని అగ్రిమెంట్‌ కూడా చేశారట. రెండువారాలు దాటగానే ఓటీటీలో విడుదల చేయడం పట్ల దిల్‌ రాజుపై దుబాయ్‌ సంస్థ కేసు పెట్టనుందనీ, లేదంటే పరిహారం చెల్లించాలని దిల్‌ రాజును హెచ్చరిస్తునట్లు తెలిసింది.