ఐపీఎల్: కోల్‌కత్తా కెప్టెన్‌గా తప్పుకున్న డీకే.. కొత్త కెప్టెన్ ఎవరంటే..

ABN , First Publish Date - 2020-10-16T21:03:10+05:30 IST

ఐపీఎల్‌కు సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ జట్లలో ఒకటైన..

ఐపీఎల్: కోల్‌కత్తా కెప్టెన్‌గా తప్పుకున్న డీకే.. కొత్త కెప్టెన్ ఎవరంటే..

ఐపీఎల్‌కు సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ జట్లలో ఒకటైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌ దినేష్ కార్తీక్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా మోర్గాన్ వ్యవహరించనున్నట్లు ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే.. డీకే కెప్టెన్సీపై ఇటీవల తీవ్ర విమర్శలొచ్చాయి. ఓడిపోయిన ఆ మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలను డీకే సరిగ్గా నిర్వర్తించకపోవడమే కారణమన్న విమర్శలూ వినిపించాయి. బ్యాటింగ్‌పరంగా కూడా దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో అంత ఫామ్‌లో లేకపోవడం నిరాశపరిచే అంశం. కెప్టెన్సీ నుంచి డీకే తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలిసింది.


ఈ ఐపీఎల్ సీజన్‌లో డీకే ఇప్పటివరకూ 108 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. 2018 నుంచి కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ వ్యవహరిస్తున్నాడు. కార్తీక్ నాయకత్వంలో 2018లో నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్ వరకూ వెళ్లగా.. 2019లో లీగ్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. రెండున్నర సంవత్సరాలుగా కేకేఆర్ జట్టుకు డీకే కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక.. మోర్గాన్ కూడా కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హుడే. 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి పేరుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నైట్‌రైడర్స్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌ జట్టుతో నైట్‌రైడర్స్ టీం తలపడనుంది.



Updated Date - 2020-10-16T21:03:10+05:30 IST