అది వైడ్ కాదా?.. అంపైర్‌ను తెలుగులో ప్రశ్నించిన దినేశ్ కార్తీక్

ABN , First Publish Date - 2020-10-31T02:29:33+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారు గర్వించే ఘటన ఒకటి జరిగింది.

అది వైడ్ కాదా?.. అంపైర్‌ను తెలుగులో ప్రశ్నించిన దినేశ్ కార్తీక్

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారు గర్వించే ఘటన ఒకటి జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే, కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓ చూడముచ్చటైన ఘటన జరిగింది. శామ్ కరన్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతి వికెట్లకు దూరంగా వెళ్లింది. దినేశ్ కార్తీక్ దానిని ఆడేందుకు ప్రయత్నించగా అందలేదు. కీపర్ ఆ బంతికి వైడ్ ఇవ్వకపోవడంతో కల్పించుకున్న కార్తీక్.. అంపైర్ షంషుద్దీన్ వంక చూసి ‘వైడ్ కాదా’ అని తెలుగులో అడిగాడు. 


నిజానికి కార్తీక్ తెలుగువాడు కాదు. చెన్నైలో పుట్టిపెరిగినప్పటికీ తెలుగు మాట్లాడగలడు. దీనికి తోడు షంషుద్దీన్ హైదరాబాద్‌కు చెందినవాడు. పక్కా తెలంగాణ. దీంతో తొందరగా అర్థం అవుతుందన్న ఉద్దేశంతో కావచ్చు.. ‘అది వైడ్ కాదా’ అని అడిగాడు. వెంటనే స్పందించిన అంపైర్ షంషుద్దీన్.. ‘లోపల.. చానా లోపల, కొంచెం కూడా కాదు’ అని పక్కా తెలంగాణలో చెప్పాడు. వీరు మాట్లాడుకున్నది కొన్ని సెకన్లే అయినా, ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దుబాయ్ మైదానంలో మ్యాచ్ మధ్య అంపైర్, బ్యాట్స్‌మన్ తెలుగులో మాట్లాడడం తెలుగు భాషా ప్రియులు మురిసిపోతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.



Updated Date - 2020-10-31T02:29:33+05:30 IST